Telangana: పాఠశాలల్లో ‘మధ్యాహ్నం’ తంటా.!
కొన్ని పాఠశాలల్లో విద్యార్థులు ఇంటి నుంచి భోజనం తెచ్చుకుంటుండగా.. మరికొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులే తాత్కాలిక వంట మనిషితో వంట చేయిస్తున్నారు. ఉన్నత పాఠశాలల్లో ఎస్‌ఏ–1 పరీక్షలు జరుగుతుండటంతో ఉదయం వచ్చే విద్యార్థులు ఇంటికి వెళ్తుండటం.. మధ్యాహ్నం వచ్చే విద్యార్థులు ఇంట్లోనే తినివస్తుండటంతో కాస్త ఊరట కలిగిస్తోంది. కొన్ని హైస్కూళ్లలో మధ్యాహ్న భోజనం వంట నిర్వాహకులు చేస్తుండగా.. కొన్నింట్లో ఉపాధ్యాయులే తాత్కాలిక వంటమనుషులను ఏర్పాటు చేసుకున్నారు.
ప్రైమరీ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఇంటినుంచే లంచ్ బాక్స్‌లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అక్టోబర్ 6న జిల్లా కేంద్రంలోని ఎంఈవో కార్యాలయ ఆవరణలోనే ఉన్న స్టేషన్‌రోడ్, హరిజనవాడ, రాళ్లపేట్ స్కూల్‌ను ‘సాక్షి’ పరిశీలించింది. 45మంది విద్యార్థుల్లో ఎక్కువ మంది ఇంటి నుంచి తెచ్చుకున్న భోజనం తిన్నారు. ఇంకోవైపు ఈ పాఠశాల (ఎంఈవో ఆఫీస్) ఎదుట వంటకార్మికులు నిరసన తెలిపారు.
చదవండి: Telangana: సర్కార్‌బడుల్లో ‘అల్పాహారం’.. టిఫిన్లు ఇవే..
ఖాళీ ప్లేట్లతో వంటకార్మికుల నిరసన
డిమాండ్లు నెరవేర్చాలని తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ చేపట్టిన ఆందోళనలో భాగంగా అక్టోబర్ 6న మంచిర్యాల ఎంఈవో కార్యాలయం ఎదుట ఖాళీ కంచాలు ప్రదర్శిస్తూ వంట కార్మికులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు రాజేశ్వరి మాట్లాడుతూ.. కొత్త మెనూ, కోడిగుడ్డుకు అదనపు బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన నిర్వహణను స్వచ్ఛంద సంస్థలకు ఇవ్వరాదని పేర్కొన్నారు. ప్రమాద బీమా, పీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించాలని కోరారు. గుర్తింపు కార్డులు ప్రభుత్వమే ఇవ్వాలని, పెండింగ్ బిల్లులు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు.