Telangana: విద్యార్థులకు అల్పాహారం..
పాఠశాలకు సమయం అయ్యిందనే కారణంతో చాలా మంది విద్యార్థులు హడావుడిగా ఖాళీ కడుపులతో తరగతులకు హాజరవుతున్నారు. ఈ పరిస్థితితో వారిలో పోషకాహారం లోపించి, సన్నగా అవుతున్నారు. నీరసంగా ఉండటంతో చాలా అనారోగ్య సమస్యలు వస్తున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కొంత మంది విద్యార్థుల్లో రక్తహీనత సమస్యలు అధికమవుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది.
అందులో భాగంగా తమిళనాడు సర్కారు తరహాలోనే రాష్ట్రంలోనూ అల్పాహారం పథకాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే జిల్లాలోని 825 పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంతో పాటు రాగిజావను అమలు చేస్తున్నారు.
చదవండి: ఐటీ ఉద్యోగాలకు కేరాఫ్ పాలమూరు
రాగి జావపై అనాసక్తి
సర్కారు బడుల్లో ఈ ఏడాది నుంచి రాగిజావను పంపిణీ చేస్తున్నారు. పంపిణీ కేంద్రం నుంచి ముడి సరకులు తీసుకెళ్లడం, పాఠశాల సిబ్బందికి భారంగా మారింది. మరో వైపు కొందరు పిల్లలు రాగిజావ తాగేందుకు అనాసక్తి చూపుతున్నారు. కొన్ని చోట్ల ఉదయం 11 గంటలకు ఇస్తుండటంతో.. మధ్యాహ్న భోజనం తినలేకపోతున్నామని మరికొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మధ్యాహ్న భోజనం వంట కార్మికులకే రాగి జావ బాధ్యత అప్పగించడంతో కొన్ని ప్రాంతాల్లో అమలు కావడంలేదు.
తక్కువ ఖర్చుతో అధిక పోషకాలు..
అల్పాహారంలో ఏయే పదార్థాలు ఇస్తారో ప్రభుత్వం మార్గదర్శకాలు వెల్లడించాల్సి ఉంది. విద్యార్థులకు పోషకాలతో కూడిన అల్పాహారాన్ని అందిస్తే ప్రయోజనంగా ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు. నిత్యం ఒకే రకంగా కాకుండా, వారంలో వేర్వేరు రకాలుగా అందిస్తే పిల్లలు ఆసక్తి చూపుతారన్నారు.
జిల్లాలో 825 పాఠశాలలు
జిల్లాలో ఎక్కువ శాతం మంది విద్యార్థులు.. ఉన్నత పాఠశాలలకు దూరంగా ఉండటంతో గంట ముందు బయల్దేరుతున్నారు. ఆ సమయంలో వారి ఇళ్లలో అల్పాహారం వండకపోవడంతో తినకుండానే వస్తున్నారు. ఏటా నవంబరు నుంచి ఫిబ్రవరి వరకు జిల్లా విద్యా శాఖ నిర్వహిస్తున్న పదో తరగతి ప్రత్యేక తరగతులకు గంటన్నర ముందుగానే విద్యార్థులు హాజరవుతుంటారు. సాయంత్రం కూడా గంట ఆలస్యంగా ఇళ్లకు వెళ్తుంటారు. కేవలం మధ్యాహ్న భోజనంతోనే ఆకలి తీర్చుకునేవారు. అల్పాహారానికి దాతలపై ఆధారపడాల్సి వచ్చేది. 2015లో కేంద్ర విద్యాశాఖ రాష్ట్రంలో మధ్యాహ్న భోజనంపై సర్వే నిర్వహించిన సందర్భంలో 30 శాతం మంది విద్యార్థులు ఖాళీ కడుపుతో పాఠశాలలకు హాజరవుతున్నట్లు తేలింది. రక్తహీనతతో పాటు బలహీనంగా తయారవుతున్నట్లు గుర్తించింది.
విద్యార్థులకు మేలు..
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన అల్పాహారంతో జిల్లాలోని 60 వేల మంది విద్యార్థులకు మేలు జరుగుతుంది. దసరా పండుగ నుంచి జిల్లా వ్యాప్తంగా అమలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. రక్తహీనత, విటమిన్ లోపం ఉన్న విద్యార్థులకు ఈ కార్యక్రమం దోహదం చేస్తుంది.
– గోవిందరాజులు, జిల్లా విద్యాశాఖ అధికారి