Tenth Class Public Exams 2024: ‘పది’ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
ములుగు రూరల్: పదో తరగతి వార్షిక పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తుంది. పరీక్ష కేంద్రాల ఏర్పాటు, విద్యార్థులకు అసౌకర్యం కలుగకుండా ఉండేలా వసతుల కల్ప నకు కృషి చేస్తుంది. ఈ నెల 18 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అప్రమత్తంగా ఉండేలా విద్యాశాఖ చర్యలు చేపడుతోంది. విద్యాశాఖ అధికారులు పరీక్షల నిర్వహణలో భాగంగా చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంట్ ఆఫీసర్లను నియమించింది. విద్యార్థులు ప్రశాంత వాతావరణలో పరీక్షలు రాసే విధంగా అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తుంది.
21 పరీక్ష కేంద్రాలు
జిల్లాలోని తొమ్మిది మండలాల్లో 3,088 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసిన వాటిలో ములుగు జెడ్పీహెచ్‌ఎస్ (బాలుర), జెడ్పీ హెచ్‌ఎస్(బాలికల), జీహెచ్‌ఎస్ ములుగు, టీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్ జాకారం, ఎస్‌ఎంఎస్ బండారుపల్లి (ఏ), (బీ), జెడ్పీహెచ్‌ఎస్ మల్లంపల్లి, వెంకటాపూర్(ఎం) జెడ్పీహెచ్‌ఎస్, జీహెచ్‌ఎస్ గోవిందరావుపేట, జెడ్పీహెచ్‌ఎస్ పస్రా నాగారం, జెడ్పీహెచ్‌ఎస్ ఇందిరానగర్, జీటీడబ్ల్యూ ఏహెచ్‌ఎస్ మేడారం, జెడ్పీహెచ్‌ఎస్ ఏటూరునాగారం(ఏ), (బీ), టీఎస్ టీడబ్ల్యూఆర్‌ఎస్ ఏటూరునాగారం, జెడ్పీహెచ్‌ఎస్ వాజేడు, జెడ్పీహెచ్‌ఎస్ వెంకటాపురం (కె), జీటీడబ్ల్యూ ఏహెచ్‌ఎస్ చిరుతపల్లి, జెడ్పీహెచ్‌ఎస్ మంగపేట, జెడ్పీహెచ్‌ఎస్ కమలాపూర్, జెడ్పీహెచ్‌ఎస్ రాజుపేట పాఠశాలలు ఉన్నాయి.
సకాలంలో పరీక్ష కేంద్రాలకు హాజరు కావాలి
పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు గంట ముందు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి. విద్యార్థులు ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకురాకూడదు. విద్యార్థులు హాల్‌టికెట్‌లో వివరాలను పరీక్ష సమయానికి ముందే పరిశీలించుకుని అభ్యంతరాలు ఉంటే పాఠశాల ప్రధానోపాధ్యాయుడి ద్వారా పరీక్ష కేంద్రం సూపరింటెండెంట్‌కు సమాచారం అందించి పొరపాట్లను సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి. విద్యార్థులు పరీక్ష జరుగుతున్న సమయంలో బయటకు రాకూడదు.
పర్యవేక్షణ అధికారుల ఏర్పాటు
పదో తరగతి పరీక్షల నిర్వహణకు 21మంది చీఫ్ సూపరింటెండెంట్‌లు, 22 మంది డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్‌లు, 200మంది ఇన్విజిలేటర్లు, రెండు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను డీఈఓ పాణిని ఏర్పాటు చేశారు. పరీక్ష పత్రాలను మండల కేంద్రాల్లోని పోలీస్ స్టేషన్‌లలో భద్రపరచనున్నట్లు తెలిపారు. ప్రశ్నపత్రాలు తీసుకొచ్చి సీల్ ఓపెన్ చేయడం, సీజ్ చేసే వరకు అవకతవకలు జరగకుండా సీసీ కెమెరాలలో నమోదు అయ్యేలా చూడాలి.
అప్రమత్తంగా ఉండాలి..
పదో తరగతి పరీక్షల నిర్వహణలో ఇన్విజిలేటర్లు, సూపరింటెండెంట్‌లు, డిపార్‌మెంట్ ఆఫీసర్లు అప్రమత్తంగా ఉండాలి. విద్యార్థులకు అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకుంటున్నాం. పరీక్ష కేంద్రాల వద్ద కంట్రోల్ రూం ఏర్పాటు చేస్తున్నాం. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసుకునే విధంగా తల్లిదండ్రులు సహకరించాలి. ఇన్విజిలేటర్లు మొబైల్ ఫోన్లు పరీక్ష కేంద్రాలకు తీసుకురాకూడదు. సందేహాల నివృత్తికి కంట్రోల్ రూం నంబర్ 9010008345లో సంప్రదించాలి.
– పాణిని, జిల్లా విద్యాశాఖ అధికారి