Skip to main content

School Education Department: గుట్టుగా టీచర్ల సర్దుబాటు!

కరీంనగర్‌: ఊహించిందే జరుగుతోంది. ప్రాథమిక విద్యను బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం విద్యార్థులు లేరనే సాకుతో ఉపాధ్యాయులను సర్దుబాటు పేరిట తరలించేందుకు సిద్ధమవుతోంది.
Adjustment of teachers

ఈ ప్రక్రియను గుట్టుచప్పుడు కాకుండా వేగవంతం చేసింది. దీంతో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల మనుగడ ప్రశ్నార్థకరం కానుంది. విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలకు రప్పించాల్సిన విద్యాశాఖ అధికారులు ఆ దిశగా కృషి చేయకుండా బడుల మూసివేతకు సిద్ధమవుతున్నారు.

ప్రభుత్వం రేషనలైజేషన్‌ ప్రక్రియ చేపడితే ఉపాధ్యాయులను ఇతర పాఠశాలల్లోకి, వేరేశాఖల్లోకి పంపించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇటీవల జిల్లా విద్యాశాఖ అధికారులతో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ కార్యాలయంలో టీచర్ల రేషనలైజేషన్‌ ప్రక్రియ గురించి వివరిస్తూనే ఉన్నఫలంగా సమాచారాన్ని పంపించాలని కోరడంతో మళ్లీ టీచర్ల హేతుబద్ధీకరణ అంశం హట్‌టాపిక్‌గా మారింది.

చదవండి: Goodnight Killers: గురుకులంలో ‘గుడ్‌నైట్‌ కిల్లర్స్‌’

జిల్లాలో ఇదీ పరిస్థితి

జిల్లాలో 426 ప్రాథమిక పాఠశాలలు, 76 ప్రాథమికోన్నత, 149 ఉన్నత పాఠశాలలు మొత్తం 651 స్కూళ్లు ఉన్నాయి. వీటిల్లో 38,475మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇటీవల జిల్లావ్యాప్తంగా ఉపాధ్యాయుల బదిలీలు పూర్తయ్యాయి. ఒక్కో ఉపాధ్యాయుడు అదనపు విద్యార్హతలు సాధించడంతో రెండు, మూడు సబ్జెక్టుల్లో పదోన్నతి లభించింది.

ఎన్ని సబ్జెక్టుల్లో పదోన్నతి లభించినా ఒకేస్థానంలో చేరేందుకు అవకాశముండడంతో భారీగా ఖాళీలు ఏర్పడ్డాయి. జిల్లా విద్యాశాఖ లెక్కల ప్రకారం సింగిల్‌ టీచర్స్‌ స్కూళ్లు 46ఉన్నాయి. ఈ పాఠశాలల్లో ఉన్న టీచర్‌ సెలవు పెట్టినా, మరే కారణంగా రాకు న్నా ఆ రోజు పిల్లలకు సెలవే. యూపీఎస్‌ పాఠశాలల్లో సైతం 30మంది లోపు విద్యార్థులున్న స్కూళ్లను సమీప ఉన్నత పాఠశాలల్లో విలీనంచేయాలని గతేడాది నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ఉపాధ్యాయుల రేషనలైజేషన్‌ ప్రక్రియతో ఎన్ని ప్రభుత్వ పాఠశాలలు మూతపడనున్నాయో, ఎంత మంది టీచర్లు సర్దుబాటు కానున్నారో తేలనుంది.

నిరుద్యోగుల ఆశలు అడియాశలే

ప్రభుత్వం టీచర్ల హేతుబద్ధీకరణ నిర్ణయం తీసుకోవడంతో నిరుద్యోగులు నిరాశ చెందుతున్నారు. ఏళ్ల తరబడి కోచింగ్‌ తీసుకుని, ఎలాగైన టీచర్‌ జాబ్‌కొట్టాలనే డీఎస్సీ అభ్యర్థుల భవిష్యత్‌ ప్రశ్నార్థ కం కానుంది. రేషనలైజేషన్‌ ప్రక్రియ ముగిసిన తర్వాత చాలా మంది ఉపాధ్యాయులు మిగిలే పరిస్థితి ఉంటుందనే భావనతో డీఎస్సీ అభ్యర్థులు తీవ్ర ఆవేదనకు లోనవుతున్నారు.

Published date : 14 Aug 2024 11:52AM

Photo Stories