SP Udaykumar Reddy: ‘చదువుతోనే లక్ష్య సాధన’
పోలీస్ ఉద్యోగుల పిల్లలు ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి తోడ్పడేలా జిల్లా పోలీస్ యంత్రాంగం తరఫున పోటీ పరీక్షలకు సంసిద్ధమయ్యేలా హెడ్‌క్వార్టర్స్‌లో ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని అక్టోబర్ 11న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. భవిష్యత్‌లో చదువు మాత్రమే ఉన్నత శిఖరాలకు చేరుస్తుందని తెలిపారు. చిన్నప్పటి నుంచే పిల్లలకు విద్యపై ఇష్టాన్ని పెంపొందించేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని సూచించారు. ఒక్కసారి జ్ఞానాన్ని సంపాదించిన తర్వాత అది జీవితంలో మనల్ని విడిచిపెట్టి పోదనే విషయాన్ని గుర్తు చేశారు.
చదవండి: Scholarship: మెరిట్ స్కాలర్‌షిప్ పరీక్ష గడువు పొడిగింపు
పోలీస్ పిల్లల ఆవశ్యకతను గుర్తించి భవిష్యత్‌లో హైదరాబాద్ నుంచి నిష్ణాతులైన సిబ్బందితో శిక్షణ తరగతులు నిర్వహించి పోటీ పరీక్షలకు ఆదిలాబాద్ జిల్లా నుంచి పోలీసుల పిల్లలు ఎంపికయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కాగా, ఈ గ్రంథాలయం ఉదయం నుంచి సాయంత్రం వరకు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుత సమాజంలో ఉన్న నవీకరించిన పుస్తకాలన్నింటినీ అందుబాటులో ఉంచి పిల్లలకు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో హెడ్‌క్వార్టర్ ఆర్‌ఐ నవీన్‌కుమార్, ట్రాఫిక్ సీఐ, రిజర్వ్ సిబ్బంది, స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు.