SI Achievers: లక్ష్యాన్ని చేరి స్పూర్తిగా నిలిచారు ఈ నలుగురు
లక్షెట్టిపేట పురపాలిక పరిధిలోని గంపలపల్లి గ్రామానికి చెందిన తిప్పని నాగశిల్ప ఎస్సై ఉద్యోగానికి ఎంపికయ్యారు. ఆమె సాధారణ వ్యవసాయ కుటుంబానికి చెందిన యువతి. తన తండ్రి తిరుపతి రైతు, తల్లి శ్రీలత గృహిణి. పదో తరగతి వరకు స్థానికంగా చదివిన ఆమె ఇంటర్ కరీంనగర్‌లో పూర్తి చేసారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బీటెక్ 2022లో పూర్తి చేశారు. తన చదువు ముగిసాక తను ఎస్ఐ కోసం పరీక్షలు రాసేందుకు తన తల్లిదండ్రులు కూడా సహకరించారు. దీంతో, తను ఏ కోచింగ్ సెంటర్ సహాయం లేకుండా, ఎలాంటి శిక్షణ లేకుండా తనకి తాను ఇచ్చుకున్న శిక్షణతోనే పరీక్షలను పూర్తి చేసి, తొలి ప్రయత్నంలోనే ఎస్సైగా ఎంపిక కావడం విశేషం. దీంతో, వారి తల్లిదండ్రులు ఎంతో ఆనందించారు.
చిన్నప్పటి నుంచి తండ్రి కష్టాలు చూసి పెరిగారు.. ఎలాగైనా జీవితంలో ఉన్నత స్థితిలో నిలిచి తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని తలిచారు. తన కలలు సాకారం చేసే క్రమంలో కష్టపడి ఎస్ఐ కోసం ప్రిపేర్ అయ్యారు వీరు. ఆ పరీక్షల ఫలితాలు ఇటీవల విడుదలైయ్యాయి. ఎస్సై ఫలితాల్లో స్టేషన్ ఫైర్ ఆఫీసర్‌గా ఎంపికయ్యారు స్థానిక ఎన్టీఆర్‌నగర్‌కు చెందిన శివశంకర వరప్రసాద్. బుచ్చయ్య, ప్రేమలతకు శివశంకర వరప్రసాద్‌తో పాటు ఇద్దరు కుమార్తెలు. 2019లో ఓపెన్ డిగ్రీ పూర్తి చేశారు. ఇటీవలనే జిల్లా న్యాయస్థానంలో టైపిస్ట్‌గా ఉద్యోగం పొందారు. ఎస్సై నోటిఫికేషన్ రావడంతో ఎలాంటి శిక్షణ తీసుకోలేదు. ఉద్యోగం చేస్తూ నిత్యం సాధన చేసి పరీక్షలో విజయం సాధించి నేటి యువతకు ఆదర్శంగా నిలిచారు.
మంచిర్యాల పట్టణంలోని మోయినిపురకు చెందిన సర్ధార్‌పాషా ఎస్సైగా ఎంపికయ్యారు. ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగి మహ్మద్ రఫిక్, అహ్మద్ ఉన్నీసాబేగంల కుమారుడు సర్ధార్‌పాషా 2014లో బీటెక్ పూర్తి చేశారు. కానిస్టేబుల్ కోసం సాధన చేయగా 2017లో రెండో ప్రయత్నంలో విజయం పొందారు. ఆదిలాబాద్ రెండో టీఎస్‌ఎస్‌పీ బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా ఉద్యోగం చేస్తూనే ఎస్సై కోసం ప్రయత్నించగా, ఎస్సై కావాలన్న దృఢ సంకల్పంతో శిక్షణ లేకుండానే సొంతంగా సాధన చేసి కొలువు కొట్టారు.
పట్టుబట్టి లక్ష్యాన్ని కొట్టాడు
ఎప్పటికైనా పోలీస్ శాఖలో కొలువు సాధించాలన్న తపనే ఆయనను విజయ తీరాలకు చేర్చింది. ఇతను కోటపల్లి మండలంలోని మారుమూల అన్నారం గ్రామానికి చెందిన కోడూరి రాజశేఖర్. ఎస్సై ఉద్యోగానికి ఎంపికయ్యారు. కోడూరి జయ - శంకర్ దంపతులకు కుమారుడు రాజశేఖర్‌తో పాటు బీటెక్ చదువుతున్న కూతురు ఉంది. టైలర్ వృత్తి చేస్తూ తమ పిల్లలకు చక్కటి విద్యాభ్యాసం అందించారు. రాజశేఖర్ ఒకటి నుంచి నాలుగో తరగతి వరకు స్థానికంగా ఐదు నుంచి పదో తరగతి వరకు గురుకుల విద్యాలయం బెల్లంపల్లి, ఇంటర్ కరీంనగర్, బీటెక్ జేఎన్‌టీయూ సుల్తాన్ పూర్‌లో అభ్యసించారు.
2018లో జరిగిన కానిస్టేబుల్, ఎస్సై అర్హత పరీక్షల్లో కానిస్టేబుల్‌గా ఎంపికై కుమురం భీం జిల్లా ఆసిఫాబాద్‌లో ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్నారు. మూడు నెలలు సెలవు పెట్టి ఇంటి దగ్గర ఉంటూనే ఎస్ఐ పరీక్షల కోసం తనను తాను సిద్ధం చేసుకోగా, ఎస్సై కల సాకారం చేసుకున్నారు. తన తల్లిదండ్రులతో పాటు భార్య యోగిత అందించిన ప్రోత్సాహంతోనే ఎస్సై ఉద్యోగాన్ని సాధించానని రాజశేఖర్ తెలిపారు.