Skip to main content

రేపటి విజయానికి నేటినుంచే శ్రమించాలి

ఇండియాలో మీ డిగ్రీ పూర్తవుతూనే యూఎస్ యూనివర్సిటీలో చేరడం మీ అభిమతమైతే కాలేజీలో చేరిన మొదటి సంవత్సరం నుంచే మీ సమీపంలోని యు.ఎస్.ఐ.ఇ.ఎఫ్.కి లేదా వారి శాటిలైట్ సెంటర్‌కి తరచూ వెళ్లిరావడం ఒక ముఖ్యమైన అలవాటుగా మార్చుకోండి. దానివల్ల అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసానికి మీరు పాటించవలసిన నిబంధనలు, పరిపూర్తి చేయవలసిన అంశాల మీద మీకు క్రమేణా అవగాహన ఏర్పడి ఒకనాటికి యు.ఎస్. యూనివర్సిటీకి మీ దరఖాస్తులను మీరే పంపించగలిగే స్థాయికి చేరుకుంటారు. అలాగే దీనివల్ల టోఫెల్, జి.ఆర్.ఇ. లాంటి పరీక్షలకు మీకు మీరుగా సంసిద్ధులు కాగలుగుతారు.

దానితోపాటు మీ యూఎస్ వీసా ఇంటర్వ్యూకి ఎవరి సహాయం లేకుండా మీకు మీరుగా అన్నీ సమకూర్చుకుని అక్కడ విజయం సాధించడానికి అవసరమైన ఆత్మవిశ్వాసం కూడా యూఎస్ ఇండియా ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ అందించే సమాచార వనరులను మీరు తరచూ అక్కడికి వెళ్లి సద్వినియోగం చేసుకోవడం వల్ల మీకు లభిస్తుంది.

మీకు దగ్గరలో అమెరికన్ లైబ్రరీ గాని, దానికి అనుబంధంగా ఉండే అమెరికన్ కార్నర్ గాని ఉంటే అప్పుడప్పుడు అక్కడికి వెళ్లి అమెరికన్ చరిత్ర, సంస్కృతి, పాలనా వ్యవస్థ, సాహిత్యం తదితర అంశాలపై పుస్తకాలు, వీడియోలు, ఇంకా ఫిలిం షోలు చూడటం అలవాటు చేసుకోండి.

(చెన్నైలోని అమెరికన్ కాన్సులేట్‌లోని అమెరికన్ లైబ్రరీకి అనుబంధంగా బెంగళూరు రేస్ కోర్స్ రోడ్‌లో ఉన్న అమెరికన్ భారతీయ విద్యాభవన్ భాగస్వామ్యంతో నడుస్తోంది).

ఇది మిమ్మల్ని అమెరికన్ వాతావరణానికి మానసికంగా దగ్గరచేసి వీసా ఇంటర్వ్యూలోను, యూఎస్ యూనివర్సిటీలో చేరిన తర్వాత మీకు యూఎస్ కల్చర్, భాష మొదలైన వాటిలోను కొత్తదనం, బెరుకు లేకుండా చేస్తుంది.

అమెరికన్ లైబ్రరీ తమకు దగ్గరలో లేనివారు ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా, ఈ-మెయిల్ ద్వారా వారితో సంప్రదించి తమకు అవసరమైన సమాచారాన్ని పొందవచ్చు. అలాగే అమెరికన్ లైబ్రరీకి సుదూరంగా ఉన్నవారు తమ కాలేజీ తరఫున ఎడ్యుకేషన్ టూర్‌కి అవకాశం ఉన్నప్పుడు దాని ద్వారా అమెరికన్ లైబ్రరీకి, యు.ఎస్.ఐ. ఇ.ఎఫ్.కి వెళ్లి రావడానికి (ముందుగానే అపాయింట్‌మెంట్ తీసుకుని) ప్రయత్నించవచ్చు.

అమెరికన్ కాన్సులేట్లకి చెందిన పబ్లిక్ అఫైర్స్ విభాగాలు తరచూ కొన్ని ముఖ్యమైన పట్టణాల్లో అమెరికన్ సంస్కృతి, సమాజానికి చెందిన అనేక అంశాలపైన యూఎస్ నుంచి వచ్చే ‘స్పీకర్ల’ (వక్తల)తోను, స్థానిక యూఎస్ డిప్లొమాట్లతోను కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తుంటాయి. వీటిలో పాల్గొనడం కూడా యూఎస్ వెళ్లే విద్యార్థులకు బాగా ఉపయోగపడుతుంది.

మామూలుగా అయితే మనం జీవితకాలంలో ప్రత్యక్షంగా చూడలేని, కలుసుకోలేని ప్రముఖ అమెరికన్ వక్తలు (సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాహిత్య, కళారంగాలవారు) కూడా యూఎస్ కాన్సులేట్లు, పబ్లిక్ అఫైర్స్ విభాగాలు నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొని ముఖ్య భారతీయ నగరాల్లో పర్యటిస్తుంటారు.

అమెరికాలో విదేశీ విద్యార్థులకు అవకాశాలు ముందు ముందు ఇంకా విస్తృతమవుతాయి. రోజుకొక నూతన ఆవిష్కరణ మన ముందుకొస్తున్న ప్రపంచంలో అమెరికాలాంటి అత్యాధునిక దేశంలో ఉన్నత విద్యను ఆర్జించగలగడం నిజంగానే ఒక సువర్ణావకాశం. దీనిని అందుకోవాలనుకునేవారు ఇక్కడ తాము కాలేజీలో చేరినప్పటి నుంచీ కృషి మొదలుపెట్టాలి. మీ అమెరికా కల నెరవేరడం లేదా చేజారడం అనేది ఏ యూనివర్సిటీ అడ్మిషన్ కమిటీ నిర్ణయంలోనో, ఏ వీసా ఆఫీసర్ చేతుల్లోనో ఉండదు. అది మీ చేతుల్లోనే, శ్రమతో కూడుకుని ఉండే మీ చేతల్లోనే ఉంటుంది.

Published date : 13 Mar 2013 02:28PM

Photo Stories