TS Medical Jobs : వైద్య ఆరోగ్య శాఖలో 7,356 పోస్టులు.. భర్తీ ఇంకెప్పుడు..?
ఇందులో భాగంగా 5,204 మంది స్టాఫ్ నర్సుల నియామకానికి ఉద్యోగ ప్రకటన వెలువడింది. వీటికి సుమారు 40 వేల మందికిపైగా దరఖాస్తు చేసుకోగా, రాత పరీక్ష నిర్వహించి ‘కీ’ని కూడా విడుదల చేశారు. రెండు నెలల క్రితమే అభ్యంతరాలు స్వీకరించారు. మెరిట్ జాబితా విడుదలచేసి, నియామక ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంది.
ఇలాగే ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ పరిధిలో 1,996 మంది ANM ల నియామకానికి ఆగస్టులో ప్రకటన వెలువడగా దరఖాస్తుల స్వీకరణ పూర్తయింది. దరఖాస్తులు భారీగా వచ్చాయి. నవంబరు 10వ తేదీన రాతపరీక్ష నిర్వహించాల్సి ఉండగా వాయిదా పడింది. రాత పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తారనే సమాచారమూ బోర్డు నుంచి వెలువడకపోవడంతో దరఖాస్తుదారులంతా ఆందోళన చెందుతున్నారు. ఆయుష్ విభాగంలో 156 మంది వైద్యుల నియామక ప్రక్రియకు ఆగస్టులో ప్రకటన వెలువడింది. దరఖాస్తుల స్వీకరణ పూర్తయింది. తదుపరి నియామక ప్రక్రియ నిల్చిపోయింది. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో త్వరగా ఆయా పోస్టుల భర్తీపై స్పష్టత ఇవ్వాలని నిరుద్యోగులు కోరుతున్నారు.