Singareni Job Notification: 485 పోస్టులు భర్తీ చేస్తాం.. పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ
ఫిబ్రవరి 22న ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తామని, సంస్థ ఇన్‌చార్జ్ సీఎండీ ఎన్.బలరామ్ వెల్లడించారు. సింగరేణి సంస్థపై బుధవారం భట్టి విక్రమార్క రాష్ట్ర సచివాలయంలో సమీక్షించారు. సంస్థలో డిపెండెంట్ ఉద్యోగ నియామకాలు వేగిరం చేయాలని, కనీసం వెయ్యి మంది ఉద్యోగుల వారసులకు ఈ ఏడాది ఉద్యోగాలు ఇవ్వాలన్నారు.
సింగరేణి ఉద్యోగ నియామకాలు పారదర్శకంగా చేపట్టాలని, అవకతవకలు జరిగితే ఉపేక్షించేది లేదని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవల సింగరేణి ఉద్యోగమేళాలో ఇచ్చిన హామీ మేరకు డిపెండెంట్ ఉద్యోగాల గరిష్ట వయో పరిమితిని 35 ఏళ్ల నుంచి 40 ఏళ్లకు పెంచేందుకు సత్వరమే చర్యలు తీసుకోవాలన్నారు.
చదవండి: SCCL: సింగరేణి నియామకాల్లో అవకతవకలు.. రంగంలోకి ఏసీబీ..
ప్రీమియం లేకుండానే రూ.కోటి ప్రమాద బీమాను 43 వేల మంది సింగరేణి కార్మికులకు వర్తింపజేసేందుకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో అవగాహన ఒప్పంద పురోగతిపై ఆరా తీశారు. కొత్తగూడెంలో నిర్మించిన 10.5 మెగావాట్ల సోలార్ ప్లాంట్‌ను ఈ నెల 26న ప్రారంభిస్తామన్నారు.
సింగరేణి ఉద్యోగులు, అధికారుల సౌకర్యార్థం హైదరాబాద్‌లో నిర్మించతలపెట్టిన అతిథి గృహం భూమిపూజ కార్యక్రమానికి ఏర్పాట్లు చేయాలని చెప్పారు. గోదావరిఖని, మంచిర్యాలలో సురక్షిత నీటిసరఫరాకు నిర్మించిన ర్యాపిడ్ గ్రావిటీ ఫిల్టర్లను ప్రారంభించడానికి ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ వేసవిలో విద్యుత్ డిమాండ్ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో బొగ్గు ఉత్పత్తి, రవాణాలపై రోజువారీ సమీక్ష నిర్వహించాలని ఆదేశించారు.