Staff Nurse Exam Results: స్టాఫ్ నర్స్ రాత పరీక్ష ఫలితాలు విడుదల
డిసెంబర్ 19న మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ సభ్య కార్యదర్శి గోపీకాంత్‌రెడ్డి ఫలితాలను ప్రకటించారు. 40 వేల మందికిపైగా పరీక్ష రాయగా వారందరి మార్కుల జాబితా విడుదల చేశారు. ప్రత్యేకంగా అర్హత మార్కులు వీటికి లేకపోవడంతో అందరి పేర్లతో జాబితాను విడుదల చేశారు. ఎవరికి వారు అభ్యర్థులు తమకు ఎన్ని మార్కులు వచ్చాయో బోర్డ్ వెబ్‌సైట్లో చూసుకోవచ్చు.
అభ్యర్థులు కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్‌ల అనుభవానికి వెయిటేజీ మార్కులుంటే, వాటిని కలిపే జాబితా తయారు చేశారు. ఈ ఫలితాలపై అభ్యర్థులకు ఏమైనా అభ్యంతరాలుంటే డిసెంబర్ 20 సాయంత్రం 5.30 గంటల వరకు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయొచ్చు.
చదవండి: Telangana Medical Jobs : 1,800 నర్సింగ్ పోస్టుల భర్తీకి తొలి సంతకం.. అలాగే 7,356 ఉద్యోగాలకు కూడా..
అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత ప్రొవిజనల్ మెరిట్ జాబితా విడుదల చేస్తారు. ఈ జాబితా ఆధారంగా ఎంపిక చేసిన జోన్‌లోకి వచ్చిన అభ్యర్థులను సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం పిలుస్తారు. ఇందులో ఒరిజినల్ సర్టిఫికెట్లను పరిశీలిస్తారు. ఆ తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్, సెలెక్షన్ లిస్ట్ విడుదల చేస్తారు.
అనంతరం జోన్ల వారీగా కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగ్‌లు ఇస్తారు. ఈ ప్రక్రియ వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని బోర్డు వెల్లడించింది. కాగా, తొలుత 5,204 స్టాఫ్ నర్స్ ఖాళీల భర్తీకి గత ఏడాది డిసెంబర్‌లో నోటిఫికేషన్ జారీ చేయగా, మూడు రోజుల క్రితమే మరో 1,890 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుబంధ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో మొత్తం 7,094 ఖాళీలను (5,204+ 1,890) భర్తీ చేస్తారు. గతేడాది డిసెంబర్ 30న స్టాఫ్‌నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
ఈ నోటిఫికేషన్‌కు అనుగుణంగా ’కంప్యూటర్ ఆధారిత పరీక్ష’ ఈ ఏడాది ఆగస్ట్ 2న జరిగింది. అనంతరం ప్రొవిజనల్ కీ విడుదల చేసి దరఖాస్తుదారుల నుంచి అభ్యంతరాలను స్వీకరించారు. సబ్జెక్ట్ నిపుణుల నుంచి వచ్చిన ఇన్‌పుట్‌ల ఆధారంగా ‘కీ కమిటీ’ తుది కీని ఖరారు చేసింది. ప్రిలిమినరీ కీకి, ఫైనల్ కీకి మధ్య ఎలాంటి తేడా లేదు. దీంతో ప్రిలిమినరీ కీని తుది కీగా పరిగణించారు.