ఇష్టమైన చోట డాక్టర్లకు పోస్టింగ్
భర్తీకి ముందు నిర్వహించే కౌన్సెలింగ్ సందర్భంగా డాక్టర్లు ఆప్షన్లు సమర్పిస్తే అందులో ప్రాధాన్యం ప్రకారం పోస్టింగ్ లభిస్తుందని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ప్రజారోగ్య సంచాలకుడి పరిధిలో 751 సివిల్ అసిస్టెంట్ సర్జన్, తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలో 211 జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం)లో 7 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి జూలై నెలలో రాష్ట్ర మెడికల్, హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేయడం తెలిసిందే. ప్రస్తుతం ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ జరుగుతుంది. ఈ 14న సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. తదుపరి దరఖాస్తుల గడువు పొడిగించే అవకాశం లేదని అధికారులు తెలిపారు.
చదవండి: దేశంలో 10 వేల జనాభాకు 8 మందే డాక్టర్లు
ఇప్పటివరకు 1,600 మంది దరఖాస్తు...
మొత్తం 969 పోస్టులకుగాను ఇప్పటివరకు 1,600 మంది డాక్టర్లు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. గడువు ముగిసే నాటికి మొత్తం 3 వేల వరకు దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. అంటే ఒక పోస్టుకు ముగ్గురు పోటీ పడే అవకాశముంది. అయితే అనుకున్న స్థాయిలో దరఖాస్తులు వచ్చే అవకాశాలు కనిపించడంలేదు. అందుకు ప్రైవేట్ ప్రాక్టీస్ రద్దు నిబంధన ప్రధాన అడ్డంకిగా భావిస్తున్నారు. ఎంబీబీఎస్ పూర్తి చేసిన వారిలో చాలా మంది పీజీ మెడికల్ కోర్సు చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఒకవేళ ఇప్పుడు ఈ పోస్టులో చేరితే మూడేళ్ల వరకు పీజీ చేసే అవకాశం ఉండదు. ఎందుకంటే వారు ఉద్యోగంలో చేరాక ఇన్‌సర్వీస్ కోటా పీజీ మెడికల్ సీట్లకు అర్హత పొందాలంటే మూడేళ్లు ఆగాలి. ఆలోగా నీట్‌లో పీజీ సీటు వస్తే చేరేందుకు ఉద్యోగాన్ని వదులుకోవాల్సిందేనని అధికారులు అంటున్నారు. ఈ కారణాలతో కొందరు ఎంబీబీఎస్ అభ్యర్థులు దరఖాస్తుకు దూరంగా ఉంటున్నారని తెలిసింది.
చదవండి: నెలలో 26 రోజులు గ్రామాల్లోనే వైద్య సేవలు
కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ వారికే ఎక్కువ చాన్స్...
దరఖాస్తు గడువు ముగిసిన దాదాపు నెలకు అంటే వచ్చే నెల రెండో వారంలో పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను బోర్డు ప్రకటించనుంది. రూల్ ఆఫ్ రిజర్వేషన్, సర్వీస్ రూల్స్, అనుభ వం, ఔట్‌సోర్సింగ్ లేదా కాంట్రాక్టు వెయిటేజీని అనుసరించి అభ్యర్థులను ఎంపిక చేయనుంది. దరఖాస్తు చేసుకుంటున్న వారిలో ఎక్కువ మంది ఇప్పటికే కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నందున వారే ఎక్కువగా ఈ పోస్టులకు ఎంపికయ్యే అవకాశం ఉంది.