Skip to main content

GD Constable Jobs: సత్తాచాటిన సీవోఈ విద్యార్థులు

బెల్లంపల్లి: పోటీ పరీక్ష ఏదైనా సరే బెల్లంపల్లి ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సీ (సీఓఈ) కళాశాల విద్యార్థులకు తిరుగులేకుండా పోతోంది.
Bellampally Govt Social Welfare Boys Gurukula College Students
విద్యార్థి కార్తికేయకు మిఠాయి తినిపిస్తున్న ప్రిన్సిపాల్‌ సైదులు

పరీక్షలో సునాయాసంగా నెగ్గి సర్కారు కొలువులు సాధిస్తున్నారు. ఆగ‌స్టు 20న‌ స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్సెస్సీ) ప్రకటించిన జీడీ కానిస్టేబుల్స్‌ ఫలితాల్లో సీఓఈ విద్యార్థులు సత్తా చాటారు. ఇక్కడ విద్యాభ్యాసం చేసిన ముగ్గురు విద్యార్థులు జీడీ కానిస్టేబుల్స్‌గా ఎంపికై మరోమారు సీఓఈ కళాశాల పేరును ఎలుగెత్తి చాటారు. ఈపాటికే సీఓఈ విద్యార్థులు ఇద్దరు జీడీ కానిస్టేబుల్స్‌గా ఎంపికై ఉద్యోగం చేస్తుండగా మరో ముగ్గురు విద్యార్థులు వారికి జత కలవడం విశేషం. సీవోఈలో ఇంటర్మీడియెట్‌ చదివిన చుంచు కార్తీకేయ, గొడిసెల అనిల్‌, బుజాడి నరేందర్‌ స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ప్రటించిన జీడీ కానిస్టేబుల్‌ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నారు.

2022లో ఉద్యోగాల భర్తీకోసం నోటిఫికేషన్‌ జారీ కాగా ప్రస్తుత ఏడాది జనవరిలో పోటీ పరీక్ష జరిగింది. రాత పరీక్షల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు గత జులై నెలలో మెడికల్‌ టెస్టులు నిర్వహించారు. వివిధ దశల్లో నిర్వహించిన పరీక్షల్లో సదరు విద్యార్థులు మెరుగ్గా రాణిస్తూ తాజాగా ప్రకటించిన ఫైనల్‌ రిజల్ట్స్‌లో జీడీ కానిస్టేబుల్స్‌గా ఎంపికై రికార్డు సృష్టించారని సీవోఈ కళాశాల ప్రిన్సిపాల్‌ ఐనాల సైదులు ప్రకటించారు. చుంచు కార్తీకేయ బీఎస్‌ఎఫ్‌, గొడిసెల అనిల్‌ సీఆర్‌ఫీఎఫ్‌, బుజాడి నరేందర్‌ సీఐఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఎంపికయ్యారు.

చదవండి: SSC Recruitment 2023: ఇంటర్ అర్హతతో 1207 స్టెనోగ్రాఫర్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

సదరు విద్యార్థులకు మిఠాయి తినిపించి ప్రిన్సిపాల్‌, అధ్యాపకులు ప్రత్యేకంగా అభినందించారు. ఒకేసారి బెల్లంపల్లి సీఓఈ విద్యార్థులు ముగ్గురు ఉద్యోగాలు సాధించడం గొప్ప విషయమని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి డాక్టర్‌ నవీన్‌ నికోలస్‌, జాయింట్‌ సెక్రెటరీ సక్రూనాయక్‌, ఓఎస్డీ రంగారెడ్డి, ఆర్సీవో కొప్పుల స్వరూపారాణి విజేతలుగా నిలిచిన విద్యార్థులతో ఫోన్‌లో మాట్లాడి అభినందనలతో ముంచెత్తారు.

తొలి ప్రయత్నంలోనే ....

సీఓఈలో చదివిన ముగ్గురు విద్యార్థులు ఉన్నత చదువులకు సిద్ధమవుతూనే మరో వైపు స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ జాతీయస్థాయి పోటీ పరీక్షకు సిద్ధమయ్యారు. ప్రైవేట్‌గా ఎలాంటి కోచింగ్‌ తీసుకోలేదు. ఏమైనా అనుమానాలు కలిగితే సీఈవో ప్రిన్సిపాల్‌, అధ్యాపకులను సంప్రదించి నివృత్తి చేసుకున్నారు. ముఖ్యంగా కళాశాలలో నేర్చుకున్న అనేక అంశాలు, ఐఐటీ, నీట్‌ పరీక్షల ప్రిపరేషన్‌ సదరు విద్యార్థుల విజయానికి దోహదపడ్డాయి. పట్టుదలతో చదివి తొలి ప్రయత్నంలోనే స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ఉద్యోగాలను దక్కించుకోవడం గమనార్హం.

చదవండి: SSC CPO Notification 2023: 1876 ఎస్‌ఐ పోస్టులు.. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది ఇదే..

ముగ్గురివి నిరుపేద కుటుంబాలే ...

జీడీ కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఎంపికై న ముగ్గురు విద్యార్థులవి అత్యంత పేద కుటుంబాలు. రెక్కల కష్టం తప్పా ఆస్తిపాస్తులు లేని కుటుంబాల్లో జన్మించిన సదరు విద్యార్థులు సీఓఈలో నేర్చుకున్న క్రమశిక్షణ, అబ్బిన చదువుతో కేంద్ర ప్రభుత్వ సర్కారు కొలువులు దక్కించుకున్నారు. చుంచు కార్తీకేయది బెల్లంపల్లి. తండ్రి రమేష్‌ ఆటో డ్రైవర్‌ కాగా తల్లి రజిత గృహిణి. గొడిసెల అనీల్‌ది లక్సెట్టిపేట మండలం ఎల్లారం గ్రామం. తల్లిదండ్రులు లచ్చయ్య, సత్తవ్వ ఇద్దరు వ్యవసాయ కూలీలే. బుజాడి నరేందర్‌ది కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా దహెగాం మండలం అమరగొండ గ్రామం. తల్లిదండ్రులు శంకర్‌, లక్ష్మిలు. వీరిది అతిసాధారణ పేద కుటుంబం.

ప్రత్యేక ప్రణాళితోనే విజయాలు

సీఓఈలో చదువుతున్న విద్యార్థులంతా దాదాపు గ్రామీణ నేపథ్యం నుండే వస్తున్నారు. వీరికి క్రమబద్ధంగా, ప్రత్యేక ప్రణాళికతో బోధన చేస్తూ ముందుకు నడిపిస్తున్నాం. గ్రామీణ విద్యార్థుల్లో ఏదో సాధించాలనే పట్టుదల ఉంటోంది. కానీ ఎలా సాధించాలో అంచనా వేసుకోలేరు. వారిలోని శక్తి యుక్తులు, నైపుణ్యతను గుర్తించి బోధించడం ఓ కారణం కాగా ఏదైనా సరే సాధించగలరనే నమ్మకాన్ని కలిగిస్తుండడంతో పోటీ పరీక్షల్లో నెగ్గి ఉద్యోగాలకు ఎంపికవుతున్నారు. సీవోఈకి పేరు తీసుకొస్తున్నారు.
– ఐనాల సైదులు, ప్రిన్సిపాల్‌, సీఓఈ కళాశాల బెల్లంపల్లి

Published date : 21 Aug 2023 04:18PM

Photo Stories