Salary Hike: గూగుల్‌లో ఉద్యోగికి మూడు రెట్లు వేతనం పెంపు.. కారణం ఇదే!!
ద్రవ్యోల్బణ భయాలు క్రమంగా పెరుగుతున్నాయి. దాంతో చాలా టెక్ కంపెనీలు కాస్ట్‌కటింగ్ పేరిట ఉన్న ఉద్యోగులకు ఉద్వాసన పలకడం, వేతనాల్లో కోత విధించడం వంటి చర్యలకు పూనుకుంటున్నాయి. ఇలాంటి సందర్భంలో కూడా గూగుల్ ఓ ఎంప్లాయిని వదులుకోవడానికి ఇష్ట పడడం లేదు. అందుకు భిన్నంగా గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంటుంది. మంచి నైపుణ్యాలు కలిగి ఉండే ఉద్యోగులకు మరింత జీతం ఎక్కువ ఇచ్చైనా వారి సేవలు వినియోగించుకునేందుకు ముందుకొస్తుంది. తాజాగా ఒక నిపుణుడిని అట్టేపెట్టుకునేందుకు టెక్ దిగ్గజం గూగుల్ అతడి జీతాన్ని 300 శాతం పెంచేందుకు సిద్ధమయ్యింది.
గూగుల్‌లో పనిచేస్తున్న సదరు నిపుణుడు పర్‌ప్లెక్సిటీ ఏఐకి మారాలని నిర్ణయించుకున్నాడు. దాంతో గూగుల్ అతడి జీతాన్ని గణనీయంగా పెంచడం ద్వారా ఆ ఉద్యోగ మార్పును నిలువరించిందని పర్‌ప్లెక్సిటీ సీఈఓ అరవింద్ శ్రీనివాస్ ఇటీవల బిగ్ టెక్నాలజీ పాడ్‌కాస్ట్‌లో వెల్లడించారు. ఐఐటీ మద్రాస్ పూర్వ విద్యార్థి అయిన శ్రీనివాస్ ‘ప్రధాన టెక్ కంపెనీలు తమ కీలక నిపుణులను నిలబెట్టుకునేందుకు ఎలా ప్రవర్తిస్తాయన్న విషయాన్ని’ వివరించేందుకు ఉదాహరణగా ఈ సంఘటనను తెలిపారు.
ఆ నిపుణుడికి కృత్రిమమేధ (ఏఐ) విభాగంతో ప్రత్యక్ష సంబంధం లేదనీ, సెర్చ్ బృందంలో సభ్యుడిగా ఉన్నారని శ్రీనివాస్ పేర్కొన్నారు. అయినా, ఏఐ సంస్థకు మారేందుకు ప్రయత్నించినప్పుడు గూగుల్ ఈ చర్యలకు పూనుకుందన్నారు. టెక్ పరిశ్రమలో తొలగింపుల గురించి ఆయన మాట్లాడుతూ.. కంపెనీ ఉత్పాదకతకు పెద్దగా ఉపకరించకున్నా, అధిక జీతాలు పొందుతున్న ఉద్యోగులనే లక్ష్యంగా చేసుకుంటున్నాయని పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరిలో ఐటీ రంగంలో 32,000 మంది ఉద్యోగులను తొలగించినట్లు తెలిసింది.