Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేలమంది టెకీలకు ఉద్వాసన
ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ కంపెనీలలో లేఆఫ్‌ల పరంపర కొనసాగుతూనే ఉంది. ఆర్థిక అనిశ్చితి, ప్రాజెక్ట్‌లు తగ్గిపోవడం వంటి కారణాలతో ఖర్చులు తగ్గించుకునేందుకు అనేక కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. టెక్ కంపెనీల్లో లేఆఫ్‌లకు సంబంధించి షాకింగ్ రిపోర్ట్ ఒకటి వెల్లడైంది. ఒక్క ఏప్రిల్ నెలలోనే 21 వేల మందికి పైగా ఉద్యోగులను తొలగించాయి టెక్ కంపెనీలు.
layoffs.fyi ప్రచురించిన తాజా డేటా ప్రకారం.. టెక్నాలజీ రంగంలోని 50 కంపెనీల నుండి ఒక్క ఏప్రిల్ నెలలోనే 21,473 మంది ఉద్యోగులు ఉద్వాసనకు గురయ్యారు. ఈ ఏడాది లేఆఫ్‌ల ధోరణికి ఏప్రిల్ నెల తొలగింపులు అద్దం పడుతున్నాయి. ఈ సంవత్సరం ప్రారంభం నుంచి కనీసం ఇప్పటి వరకూ 271 కంపెనీలు 78,572 మంది ఉద్యోగులను తొలగించాయి.
జనవరిలో 122 కంపెనీలలో 34,107 ఉద్యోగాల కోతలు జరిగాయి. ఫిబ్రవరిలో 78 కంపెనీలు 15,589 మందిని తొలగించాయి. ఇక మార్చిలో 37 కంపెనీల్లో 7,403 మంది ఉద్యోగాలను కోల్పోయారు. మార్చి నుంచి ఏప్రిల్‌కు ఒక్క నెలలో ఉద్యోగుల తొలగింపులు మూడు రెట్లు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.
ఏప్రిల్‌లో టెక్ తొలగింపులు
► యాపిల్ ఇటీవల 614 మంది ఉద్యోగులను తొలగించింది. ఇది మొదటి ప్రధాన రౌండ్ ఉద్యోగ కోత.
► పైథాన్, ఫ్లట్టర్, డార్ట్‌లో పనిచేస్తున్న వారితో సహా వివిధ టీమ్‌లలో గణనీయమైన సంఖ్యలో ఉద్యోగులను గూగుల్ తొలగించింది.
► అమెజాన్ క్లౌడ్ కంప్యూటింగ్ విభాగంలో వందలాది ఉద్యోగాలను తగ్గించింది.
► ఇంటెల్ దాని ప్రధాన కార్యాలయంలోని దాదాపు 62 మంది ఉద్యోగులను లేఆఫ్ చేసింది.
► ఎడ్టెక్ కంపెనీ బైజూస్ సుమారు 500 మంది ఉద్యోగులను తొలగించింది.
► ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా అత్యధికంగా 14 వేల మందిని లేఆఫ్ చేసింది.
► ఓలా క్యాబ్స్ దాదాపు 200 ఉద్యోగాలను తొలగించింది.
► హెల్త్ టెక్ స్టార్టప్ హెల్తీఫైమ్ దాదాపు 150 మంది ఉద్యోగులను తొలగించింది.
► గృహోపకరణాలను తయారు చేసే వర్ల్‌పూల్ సుమారు 1,000 మందిని లేఆఫ్ చేసింది.
► టేక్-టూ ఇంటరాక్టివ్ కంపెనీ తమ వర్క్‌ఫోర్స్‌లో దాదాపు 5% మందిని తొలగించింది.
► నార్వేలోని టెలికాం కంపెనీ టెలినార్ 100 మంది ఉద్యోగులను తొలగించింది.