Skip to main content

Infosys: ఐటీ ఉద్యోగులకు శుభవార్త.. ఉద్యోగులను తొలగించే ఆలోచన లేదని స్పష్టం చేసిన CEO

Infosys Layoffs  Generative AI technology concept  Tech industry trends and layoffs

ఇన్ఫోసిస్‌ కంపెనీలో ఉద్యోగులను తొలగించే ఆలోచన లేదని సంస్థ సీఈఓ సలీల్‌ఫరేఖ్‌ స్పష్టం చేశారు. ఓ ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. జనరేటివ్‌ఏఐ వల్ల టెక్ కంపెనీలు లేఆఫ్స్‌ ప్రకటిస్తున్నప్పటికీ ఇకపై తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించబోమని తేల్చి చెప్పారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘సంస్థలో జనరేటివ్‌ఏఐతో సహా వివిధ టెక్నాలజీలను ఏకీకృతం చేస్తున్నాం. ప్రస్తుతం ఉన్న ఉద్యోగులను తొలగించే బదులు సాంకేతిక పురోగతి కొత్త అవకాశాలను సృష్టిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీ క్లయింట్లకు మెరుగైన సేవలందించేందుకు జనరేటివ్ ఏఐలో నియామకాలు కొనసాగిస్తాం.

ఇతర కంపెనీల్లాగా ఉద్యోగులను తొలగించాలనే ఆలోచన లేదు. సమీప భవిష్యత్తులో జనరేటివ్‌ఏఐ విభాగానికి భారీ డిమాండ్‌ ఏర్పడుతుంది. అప్పటివర​కు కంపెనీలో నైపుణ్యాలు కలిగిన ఉద్యోగులు తయారవుతారు. దాంతో ప్రపంచంలోని మరిన్ని పెద్ద సంస్థలకు సేవలందిస్తాం’ అన్నారు.

Online Evaluation: ఇకపై ఆన్‌లైన్‌లోనే పరీక్షల మూల్యంకనం.. ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించిన ఇంటర్‌ బోర్డు

ఇన్ఫోసిస్ ఇటీవల ఉద్యోగుల పనితీరుపై బోనస్‌ ప్రకటించింది. బ్యాండ్ సిక్స్‌, అంతకంటే తక్కువ స్థాయి ఉద్యోగులు జనవరి-మార్చి త్రైమాసిక పనితీరుపై బోనస్‌ను అందుకున్నారు. అయితే, బోనస్‌ రూపంలో ఇచ్చిన సగటు చెల్లింపులు మునుపటి త్రైమాసికంలోని 73 శాతంతో పోలిస్తే 60 శాతానికి పడిపోయాయి.

టెక్‌ కంపెనీలు ఇటీవల ప్రకటించిన త్రైమాసిక ఫలితాల్లో భవిష్యత్తు అంచనాలపై ఆశించిన వ్యాఖ్యలు చేయలేదు. వచ్చే ఒకటి-రెండు త్రైమాసికాల్లోనూ కంపెనీలకు పెద్దగా లాభాలు రావని తేల్చిచెప్పాయి. కొన్ని నివేదికల ప్రకారం..ఈ ఏడాది కూడా గతేడాది మాదిరిగానే టెక్‌ ఉద్యోగాల్లో కోత తప్పదని తెలిసింది.

కాస్టకటింగ్‌ పేరిట లేఆఫ్స్‌ ప్రకటిస్తున్న కంపెనీల్లో తిరిగి కొలువులు పుంజుకోవడానికి మరింత సమయం పడుతుందని టెక్‌ నిపుణులు చెబుతున్నారు. ఇన్ఫోసిస్‌ మాత్రం ఇకపై ఉద్యోగులను తొలగించమని ప్రకటించడం నిరుద్యోగ టెకీలకు కొంత ఊరట కలిగించే అంశమని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి.

Published date : 28 May 2024 05:01PM

Photo Stories