How AI Is Transforming Jobs: ఉద్యోగాలపై ఏఐ ప్రభావం, ఆ నైపుణ్యాలు లేకపోతే జాబ్ లేనట్లే..
మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్, లింక్డ్‌ఇన్ సంయుక్తంగా వర్క్ ట్రెండ్ ఇండెక్స్-2024ను విడుదల చేశాయి. 31 దేశాల్లోని దాదాపు 31వేల మంది ఈ సర్వేలో పాల్గొన్నారు. ఫార్చున్ 500 కంపెనీల కస్టమర్లు కూడా ఇందులో భాగమైనట్లు మైక్రోసాఫ్ట్ తెలిపింది. భారత్‌లో 92 శాతం మంది ప్రొఫెషనల్స్ తమ పనిలో ఏఐని వాడుతున్నారని నివేదికలో తెలిపారు. 91 శాతం కంపెనీలు ఏఐను స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు నివేదికలో వెల్లడించారు.
గడిచిన ఏడాది కాలంలో ఉద్యోగాల కల్పనలో, నిత్యం చేస్తున్న పనిలో, నాయకత్వంలో కృత్రిమమేధ ప్రభావం ఎలాఉందో ఈ సర్వే ద్వారా తెలియజేశామని మైక్రోసాఫ్ట్ పేర్కొంది. ‘గత ఆరునెలల్లో జనరేటివ్ ఏఐ వల్ల పనిలో ఉత్పాదక దాదాపు రెండింతలు పెరిగింది. ఉద్యోగాలకోసం వెతికే వారి ప్రొఫైల్‌లో ఏఐ నైపుణ్యాలు తోడైతే వారికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. అవి లేనివారిని చాలా కంపెనీలు చేర్చుకోవడం లేదు.
అన్ని రంగాలపై ఏఐ ప్రభావం
అయితే కొన్ని సంస్థలు ఏఐని అందిపుచ్చుకోవడంలో వెనకబడ్డామని భావిస్తున్నాయి. కొంతమంది ఉద్యోగులు తమ సొంత ఏఐ టూల్స్‌ను వాడుతున్నారు. ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తి దాన్ని పరిష్కరించాలంటే మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాంతో వారి వ్యాపారంపై ప్రభావం పడుతుంది. ఏఐ ఆర్థిక వ్యవస్థతోపాటు ఇప్పటికే చాలా రంగాలను మారుస్తుంది.
వినియోగదారులకు అందించే ఉత్పత్తుల్లో నాణ్యత మెరుగుపరిచి యూజర్ల ఆసక్తులను ప్రోత్సహిస్తే 2030 నాటికి దాదాపు సగంకంటే ఎక్కువ లాభాలు పొందవచ్చని పీడబ్ల్యూసీ పరిశోధన విడుదల చేసింది. ఏఐ ప్రభావంతో 2030 నాటికి దక్షిణ యూరప్ జీడీపీ 11.5% వరకు పెరుగుతుంది. ఇది 700 బిలియన్ డాలర్లకు సమానం’ అని నివేదికలో తెలిపారు.
కంపెనీ యాజమాన్యాలు, లేబర్ మార్కెట్‌కు సంబంధించి కృత్రిమమేధ ఏమేరకు ప్రభావం చూపుతుందో నివేదికలో తెలిపారు. ఈ వివరాలు కింద తెలియజేశాం.
ఏఐతో ఆ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు..
అధికశాతం ఉద్యోగులు తాము చేస్తున్న పనిలో ఏఐను వాడాలనుకుంటున్నారు. 75 శాతం వర్కర్లు ప్రస్తుతం పనిలో ఏఐను ఉపయోగిస్తున్నారు. అయితే దీన్ని వాడకంతో పనిలో వేగాన్ని పెంచడానికి కష్టపడుతున్నారు. ఏఐ తమ సమయాన్ని ఆదా చేస్తుందని, సృజనాత్మకతను పెంచుతుందని, ముఖ్యమైన పనిపై దృష్టి పెట్టడానికి వీలు కల్పిస్తుందని చెప్పారు.
79 శాతం మంది తమ పనిలో ఏఐ కీలకంగా ఉంటుందని అంగీకరించినప్పటికీ, అందులో 60 శాతం మంది తమ కంపెనీలో కృత్రిమమేధ వినియోగానికి సంబంధించి సరైన ప్రణాళిక లేదని తెలిపారు. 78 శాతం మంది తమ పనిలో సొంత ఏఐటూల్స్‌ను వాడుతున్నారు. కానీ ఎలాంటి ప్రణాళిక, నియంత్రణ లేకుండా వాడుతున్న ఈ టూల్స్ వల్ల కంపెనీ డేటా ప్రమాదంలో పడుతుందని కొందరు చెబుతున్నారు.
కృత్రిమమేధ వల్ల ఉద్యోగాలు కోల్పోతామనే భయం చాలా మందికి ఉన్నప్పటికీ, డేటా భిన్నమైన అభిప్రాయాన్ని తెలియజేస్తుంది. ఏఐ నైపుణ్యాలను నేర్చుకునే వారికి సైబర్ సెక్యూరిటీ, ఇంజినీరింగ్, క్రియేటివ్ డిజైన్..వంటి రంగాల్లో అవకాశాలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 46 శాతం మంది రాబోయే సంవత్సరంలో తాము చేస్తున్న ఉద్యోగం మారాలని చూస్తున్నారు.
66 శాతం కంపెనీలు ఏఐ నైపుణ్యాలు లేనివారిని నియమించుకోవడం లేదు. కోపైలట్, చాట్‌జీపీటీ వంటే ఏఐ నైపుణ్యాలు కలిగిన వారికి కంపెనీలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. మొత్తం కంపెనీల్లో 39శాతం మాత్రమే వారి ఉద్యోగులకు ఏఐ శిక్షణ అందించాయి. కేవలం 25 శాతం కంపెనీలు మాత్రమే ఈ సంవత్సరం ఏఐ ట్రెయినింగ్ అందిస్తున్నాయి.