Skip to main content

ఒక జాతిగా భారతదేశం

భారతదేశం విశాలమైన దేశం. విభిన్న వాతావరణ పరిస్థితులు, సాంస్కృతిక, వైవిధ్యాల కూడలి. వివిధ ఆచార వ్యవహారాలకు, మతాలకు నిలయం. ఇక్కడ 82 శాతం హిందువులు, 12 శాతం ముస్లింలు, 2.4 శాతం క్రైస్తవులు, 2 శాతం సిక్కులు ఉన్నారు. మిగతా ఒక శాతం బౌద్ధ, జైన మతస్థులు ఉన్నారు. మనదేశంలో సుమారు 6,748 కులాలున్నాయి. దీని ద్వారా భారతదేశం భిన్న సంస్కృతుల సమాజమని చెప్పొచ్చు. ఇన్ని ప్రత్యేకలు ఉండటం వల్లే మనదేశాన్ని ఉపఖండమని అంటారు.
ప్రజలంతా కలిసి జీవించడం ద్వారా సామాజిక అవరోధాలైన కుల, మత, భాషా సమస్యలను అధిగమించొచ్చు. జాతీయ సమైక్యత వాస్తవంగా సామాజిక, సాంస్కృతిక సమైక్యతల సమాహార రూపం.
ప్రపంచంలో జనాభా ఎక్కువ ఉన్న దేశాల్లో భారతదేశం రెండోది. 2011 నాటికి భారతదేశ జనాభా 121 కోట్లు. భారతదేశంలో బహుళ భాషలు ఉన్నాయి. మన దేశ ప్రజలు మాట్లాడే భాషలు సుమారు 1652. భారత రాజ్యాంగం 22 భాషలను అధికార భాషలుగా గుర్తించింది. ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే 30 భాషల్లో 9 భాషలను మనదేశంలోనే మాట్లాడుతున్నారు. తెలుగు 8 కోట్ల మందికి వ్యవహార భాషగా ఉంది. ఎక్కువ మంది మాట్లాడే భాషల్లో తెలుగు ప్రపంచంలోనే 16వ స్థానంలో ఉంది.
మనదేశంలో 29 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ (1911 డిసెంబర్ నుంచి). ఇది కేంద్రపాలిత ప్రాంతం. ఇది 1991లో ప్రత్యేక హోదా పొందింది. 18 ఏళ్లు నిండిన వారందరికీ 1989లో 61వ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటుహక్కు కల్పించారు. ప్రజాస్వామ్యంలో సర్వసత్తాక సార్వభౌమాధికారం ప్రజలదే. సమన్యాయ పాలన ద్వారా ప్రజలందరికీ ఒకటే న్యాయం అమలవుతోంది. ప్రాథమిక హక్కుల పరిరక్షణకు రాజ్యాంగ పరిహార హక్కును పౌరులందరికీ రాజ్యాంగం కల్పించింది. ఏ రాజకీయ పదవికైనా వయస్సు అనే అర్హత ఆధారంగా పౌరులు పోటీ చేయొచ్చు. ఉదా: రాష్ర్టపతి, ఉపరాష్ర్టపతి, గవర్నర్ పదవులకు 35 ఏళ్లు నిండినవారెవరైనా పోటీపడొచ్చు.

లౌకిక రాజ్యం:

పాలనలో మత ప్రమేయం లేని రాజ్యాన్ని లౌకిక రాజ్యం అని అంటారు. 1976లో 42వ సవరణ ద్వారా రాజ్యాంగ ప్రవేశికలో సెక్యులర్ (లౌకిక) అనే పదాన్ని చేర్చారు. ఇదే సవరణ ద్వారా సామ్యవాద రాజ్యంగా కూడా మనదేశాన్ని ప్రకటించారు. ప్రాచీన భారతీయ జీవనంలో సర్వధర్మ సమ భావనను మనం చూడొచ్చు. 1955, జూలై 14న పార్లమెంట్ అంటరానితనాన్ని నిషేధించే చట్టాన్ని చేసింది.

ప్రజాస్వామ్యం

ఆంగ్లంలో ‘డెమోక్రసీ’ అనే పదం తెలుగులోని ప్రజాస్వామ్యానికి సమానమైంది. ‘డెమోక్రసీ’ అనే పదం ‘డెమోస్’, ‘క్రోషియో’ అనే గ్రీకు పదాల నుంచి వచ్చింది. ‘డెమోస్’ అంటే ప్రజలు. ‘క్రోషియో’ అంటే అధికారం. ప్రజాస్వామ్యం అంటే ప్రజా పరిపాలన అని అర్థం.
స్థూలంగా చెప్పాలంటే ప్రజా ప్రభుత్వమే ప్రజాస్వామ్యం. ‘ప్రజలతో, ప్రజల కోసం, ప్రజలే ప్రభుత్వంగా ఏర్పడింది ప్రజాస్వామ్యమని’ అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహాం లింకన్ నిర్వచించారు.
ప్రజాస్వామ్యం:
సార్వభౌమాధికారం ప్రజలందరి చేతుల్లో ఉంటే ఆ ప్రభుత్వాన్ని ‘ప్రజాస్వామ్యం’ అంటారు. ప్రజాస్వామ్య ప్రభుత్వం విజయవంతం కావాలంటే ఉండాల్సినవి.. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, న్యాయం. ప్రజాస్వామ్యాన్ని ప్రభుత్వ విధానమే కాకుండా ఒక జీవన విధానంగా కూడా భావించాలి. ప్రజాస్వామ్యం ప్రాథమిక హక్కులను ప్రసాదిస్తుంది. ప్రజలు ఓటు హక్కు ద్వారా నిర్ణీత కాల వ్యవధికి ప్రతినిధులను ఎన్నుకుంటారు. వీరు ప్రజలకు జవాబుదారీగా ఉంటారు. సమన్యాయ పాలన విధానంలో పౌరులందరూ సమానులే. వ్యక్తుల కంటే చట్టాలకే ఆధిక్యత ఉంటుంది.భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన వెంటనే ఆనాటి నాయకులు ప్రజాస్వామ్య ప్రభుత్వ విధానాన్ని దేశంలో ప్రవేశపెట్టారు. ప్రజాసేవల్లో భాగంగా ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్), ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) వంటి వాటిని దేశంలో ప్రవేశపెట్టారు. మనదేశంలో ఒకే న్యాయ వ్యవస్థ ఉంది. అత్యున్నత న్యాయస్థానంగా సుప్రీంకోర్టును ఏర్పాటు చేశారు. ప్రజాస్వామ్యం రెండు రకాలు. అవి.. ప్రత్యక్ష ప్రజాస్వామ్యం: పరిపాలనలో ప్రజలందరూ ప్రత్యక్షంగా పాల్గొనే ప్రభుత్వాన్ని ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అంటారు.
ఉదా: ప్రాచీన గ్రీకు దేశంలోని ఏథెన్‌‌స, స్పార్టా వంటి నగర రాజ్యాల్లో, ఆధునిక కాలంలో స్విట్జర్లాండ్‌లో ప్రత్యక్ష ప్రజాస్వామ్యం ఉంది. తక్కువ జనాభా ఉన్న చిన్న దేశాలకు ఈ పద్ధతి ఉపయోగకరం.

పరోక్ష ప్రజాస్వామ్యం: ప్రజలు తమ ప్రతినిధులను ఒక నియోజక గణం ద్వారా ఎన్నుకోవడాన్ని పరోక్ష ప్రజాస్వామ్యం అంటారు.
ఉదా: U.K.(యునెటైడ్ కింగ్‌డమ్), ఫ్రాన్స్‌.
ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు భారత్, అమెరికా. ప్రజాస్వామ్యంలో అతి ప్రధాన సమస్య నాయకత్వం.

రాచరికం:
సార్వభౌమాధికారం ఒక్కరి చేతిలోనే ఉంటే దాన్ని ‘రాచరికం’ అంటారు. రాచరికంలో వంశపారంపర్యత ఉంటుంది. పౌరులకెవరికీ భద్రత ఉండదు. హక్కులు ఉండవు.

కులీన పాలన:
సార్వభౌమాధికారం కొద్దిమంది పెద్దల చేతుల్లో ఉంటే దాన్ని ‘కులీన పాలన’ అంటారు.

ఎన్నికలు:
ప్రజాస్వామ్య మౌలిక సూత్రాల్లో ఎన్నికలు ఒకటి. మనదేశంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి సర్వోన్నతమైన, స్వతంత్రమైన ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఈ సంఘం ఎన్నికలను నిర్వహించడానికి కావాల్సిన అన్ని అధికారాలను కలిగి ఉంటుంది. ప్రజాప్రాతినిధ్య చట్టంలో ఎన్నికలకు సంబంధించిన విధివిధానాలను పొందుపరిచారు.
సార్వత్రిక ఓటింగ్ హక్కు వల్ల ప్రజాభిప్రాయం చక్కగా వ్యక్తం అవుతుంది. సామాజిక అసమానతలను తొలగించడానికి, పౌరుల సర్వతోముఖాభివృద్ధికి, స్వేచ్ఛా స్వాతంత్య్రాల పరిరక్షణకు ప్రజాస్వామ్యం ఒక మంచి సాధనం.
దేశంలో అన్ని లేదా చాలా నియోజక వర్గాల్లో నిర్ణీత కాల పరిమితిని అనుసరించి జరిగే ఎన్నికల ప్రక్రియను సాధారణ ఎన్నికలు అంటారు. రెండు సాధారణ ఎన్నికల మధ్య అనివార్య కారణాల వల్ల లోక్‌సభకు, రాష్ర్ట విధానసభకు జరిపే ఎన్నికలను మధ్యంతర ఎన్నికలు అంటారు.

మనదేశంలో ఎన్నికలు

ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలకు పరిమితులున్నాయి. నిరంకుశ ప్రభుత్వ విధానంలో అధికార పార్టీ నాయకుడు రాజ్యంపై సర్వాధికారాలు కలిగి ఉంటాడు. ప్రజాస్వామ్యంలో ఇలా జరగదు. ఓటర్లు ఓటుహక్కు ద్వారా ప్రజాస్వామ్యాన్ని ప్రభావితం చేస్తారు. మన దేశంలో మొదటిసారిగా 1884లో (రిప్పన్ కాలంలో) స్థానిక సంస్థలకు, 1892లో ప్రాంతీయ మండళ్లకు నిర్వహించిన ఎన్నికల నాటి నుంచి ఎన్నికలు మొదలయ్యాయి. బ్రిటీష్ వారి పరిపాలన కాలంలో 1937లో నిర్వహించిన చివరి ఎన్నికల్లో కేవలం 14 శాతం జనాభాకు మాత్రమే ఓటుహక్కు ఉండేది. రాజ్యాంగంలోని 326వ అధికరణం లోక్‌సభకు, రాష్ట్రాల విధాన సభలకు వయోజన ఓటింగ్ హక్కు ప్రాతిపదికన ప్రతినిధుల ఎన్నిక జరగాలని నొక్కి చెప్పింది. మనదేశంలో మొదటి సాధారణ ఎన్నికలు 1952లో జరిగాయి. ఇప్పటివరకు 16 సార్లు లోక్‌సభకు ఎన్నికలు నిర్వహించారు. 16వ లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మొదటిసారి సంపూర్ణ మెజారిటీ సాధించింది. నరేంద్రమోడీ ప్రధానమంత్రిగా ఎంపికయ్యారు.

ప్రాథమిక హక్కులు: మానవుని అభివృద్ధికి, జీవనానికి తప్పనిసరిగా ఉండాల్సిన హక్కులను ప్రాథమిక హక్కులు అంటారు.
ఉదా: అమెరికా, ఫ్రాన్‌‌స, భారతదేశం వంటి దేశాల్లో పౌరులకు ప్రాథమిక హక్కులు ఉన్నాయి. మన దేశంలో రాజ్యాంగం మూడో భాగంలో ప్రాథమిక హక్కులను పొందుపరిచారు. సుప్రీంకోర్టు, హైకోర్టులు పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడతాయి. ఆస్తిహక్కును 1978లో 44వ సవరణ ద్వారా రద్దు చేశారు. ప్రస్తుతం ఆరు ప్రాథమిక హక్కులు ఉన్నాయి.

ప్రాథమిక విధులు: మానవుడు సంఘజీవి. తోటి పౌరులతో కలిసి నెరవేర్చాల్సిన బాధ్యతలను ‘పౌర విధులు’ అంటారు. చట్టప్రకారం నిర్ణయించిన వీటిని చట్టపరమైన విధులు అంటారు. వీటిని పాటించనివారు శిక్షార్హులు.
ఉదా: రాజ్యాంగాన్ని గౌరవించడం, పన్నులు చెల్లించడం, రాజ్యాంగం పట్ల విధేయత మొదలైనవి. భారత రాజ్యాంగం పౌరుల ప్రాథమిక విధులను స్పష్టంగా తెలిపింది. రాజ్యాంగంలో 4A భాగంలో వీటిని పొందుపరిచారు. ప్రాథమిక విధులను తెలిపే నిబంధన 51A. ప్రాథమిక విధులను ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి గ్రహించారు.

పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానం

పార్లమెంటరీ ప్రభుత్వ విధానంలో కార్యనిర్వాహక శాఖలోని మంత్రివర్గం పార్లమెంటుకు బాధ్యత వహిస్తుంది. పార్లమెంటరీ తరహా విధానంలో రెండు రకాల కార్యనిర్వాహక శాఖలుంటాయి. నామమాత్రపు కార్యనిర్వాహక శాఖాధిపతి రాష్ర్టపతి. ఈయన పరోక్షంగా ఎన్నికవుతారు. పదవీ కాలం 5 ఏళ్లు. వాస్తవ కార్యనిర్వాహక శాఖ అధిపతి ప్రధాని. ఈయన పార్లమెంటులోని ఏదో ఒక సభలో సభ్యుడై ఉంటారు. ప్రధాని పదవీ కాలం 5 ఏళ్లు. ప్రధాని, మంత్రిమండలికి నాయకత్వం వహిస్తాడు.

అధ్యక్ష తరహా ప్రభుత్వం

శాసన, కార్యనిర్వాహక శాఖల్లో సన్నిహిత సంబంధం లేకపోయినట్లయితే దాన్ని అధ్యక్ష తరహా ప్రభుత్వం అంటారు. అధ్యక్ష విధానాన్ని ‘స్థిర కార్యనిర్వాహక వర్గం’ అంటారు. అధ్యక్షుడు ప్రజలకు బాధ్యత వహించడు. కాబట్టి దీన్ని ‘బాధ్యతారాహిత్య ప్రభుత్వం’ అంటారు. అధ్యక్ష తరహా విధానంలో అధ్యక్షుడు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటాడు. అధ్యక్షుడి అధికారాలను కొంతమేరకు సెనెట్ అదుపుచేస్తుంది.

ప్రాక్టీస్ బిట్స్

  1. భారతదేశంలో సుమారు వాడుకలో ఉన్న భాషలెన్ని?
    1) 1652
    2) 1651
    3) 1653
    4) 1650
  2. రిజర్వేషన్లు దేనికి దోహదపడతాయి?
    1) సామాజిక న్యాయసాధన
    2) రాజకీయ సాధన
    3) లౌకిక సాధన
    4) ప్రజాస్వామ్య సాధన
  3. ఢిల్లీకి ప్రత్యేక హోదా ఎప్పుడు కల్పించారు?
    1) 1991
    2) 1990
    3) 1992
    4) 1989
  4. ప్రపంచంలో పెద్ద భాషల్లో తెలుగు భాషా స్థానం?
    1) 14
    2) 15
    3) 16
    4) 17
  5. మొదటి రాజ్యాంగ సవరణ దేనికి సంబంధించింది?
    1) భూ సంస్కరణలు
    2) పారిశ్రామికీకరణ
    3) రిజర్వేషన్లు
    4) సమాన అవకాశాల కల్పన
  6. మన దేశంలో ముస్లిం జనాభా శాతం?
    1) 12%
    2) 14%
    3) 10%
    4) 16%
  7. ప్రాథమిక హక్కులను భారతదేశం ఏ దేశం నుంచి స్వీకరించింది?
    1) ఫ్రాన్స్‌
    2) కెనడా
    3) రష్యా
    4) అమెరికా
  8. ప్రత్యక్ష ప్రజాస్వామ్యం ఏ దేశంలో ఉంది?
    1) హైతీ
    2) అమెరికా
    3) స్విట్జర్లాండ్
    4) బ్రిటన్
  9. నిర్బంధ సైనిక శిక్షణ ఏ దేశంలో ఉంది?
    1) తైవాన్
    2) రష్యా
    3) చైనా
    4) 1, 3 మాత్రమే
  10. వృద్ధాప్యంలో తమ పిల్లల సేవలు పొందడం వృద్ధుల ఏ హక్కు?
    1) నైతిక హక్కు
    2) సామాజిక హక్కు
    3) రాజకీయ హక్కు
    4) ఆర్థిక హక్కు
  11. రాజనీతి శాస్త్ర పితామహుడు?
    1) గాంధీజీ
    2) అబ్రహాం లింకన్
    3) అరిస్టాటిల్
    4) ప్లేటో
  12. డెమోక్రసీ అనే పదం ఏ భాషలోని రెండు పదాల కలయిక?
    1) గ్రీకు
    2) హీబ్రూ
    3) ఫ్రెంచి
    4) లాటిన్
  13. ఏ లోక్‌సభ ఎక్కువ కాలం కొనసాగింది?
    1) 6
    2) 5
    3) 7
    4) 4
  14. కమ్యూనిస్టు పార్టీని ఎప్పుడు స్థాపించారు?
    1) 1922
    2) 1930
    3) 1921
    4) 1920
  15. ద్విసభా విధానం ఉన్న రాష్ట్రాలు ఎన్ని?
    1) 4
    2) 7
    3) 5
    4) 6
  16. ఎలక్టోరేట్ అంటే ఏమిటి?
    1) ప్రజా సముదాయం
    2) ఓటర్ల సముదాయం
    3) రాజకీయ సముదాయం
    4) పార్టీల సముదాయం
  17. ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
    1) చెన్నై
    2) ముంబై
    3) ఢిల్లీ
    4) కోల్‌కతా
  18. ప్రజాస్వామ్యంలో అంతిమ సార్వభౌమాధికారం ఎవరికి చెందుతుంది?
    1) ప్రతినిధులు
    2) రాష్ర్టపతి
    3) ప్రజలు
    4) ఏదీకాదు
  19. సార్వజనీన వయోజన ఓటుహక్కు గురించి ఎన్నో నిబంధన తెలియజేస్తుంది?
    1) 327
    2) 326
    3) 328
    4) 329
  20. రాజ్యసభకు మరో పేరు?
    1) తాత్కాలిక సభ
    2) ప్రత్యేక సభ
    3) ప్రజల సభ
    4) రాష్ట్రాల సభ
  21. మనదేశంలో ఎన్నిసార్లు లోక్‌సభకు ఎన్నికలు నిర్వహించారు?
    1) 13
    2) 14
    3) 15
    4) 16
  22. పరోక్ష పద్ధతిలో ఎన్నికయ్యే పదవి ఏది?
    1) రాష్ర్టపతి
    2) ముఖ్యమంత్రి
    3) జిల్లా కలెక్టర్
    4) ప్రధానమంత్రి

సమాధానాలు

1) 1 2) 1 3) 1 4) 3 5) 1 6) 1 7) 4 8) 3 9) 4 10) 1 11) 3
12) 1 13) 2 14) 4 15) 2 16) 2 17) 3 18) 3 19) 2 20) 4 21) 4 22) 1
Published date : 11 Feb 2015 05:48PM

Photo Stories