Skip to main content

భారత రాజ్యాంగం

పౌరుల సమాజమే రాజ్యం, రాజ్యాన్ని నిర్వహించే పౌరవర్గమే ప్రభుత్వం అని అరిస్టాటిల్ పేర్కొన్నారు. ప్రతి రాజ్యానికి ఒక రాజ్యాంగం ఉంటుంది. ఇది రాజ్యానికి సంబంధించిన ఒక అత్యున్నత చట్టం. రాజకీయ కార్యకలాపాలను క్రమబద్ధం చేసే ముఖ్యమైన నియమావళి ఇందులోనే ఉంటుంది. రాజ్యం స్వరూపాన్ని నిర్ణయించే సూత్ర సముదాయాన్ని రాజ్యాంగంగా పేర్కొనవచ్చని గెటిల్ అన్నారు.

భారతీయులకు ఒక రాజ్యాంగం, ఒక రాజకీయ పరిషత్ అవసరమని తొలిసారిగా గాంధీజీ 1922లో పేర్కొన్నారు. 1928లో మోతీలాల్ నెహ్రూ రూపొందించిన నివేదిక రాజ్యాంగానికి మూలాధారమైంది. 75 శాతానికి పైగా పాలనాంశాలను 1935 చట్టం నుంచి స్వీకరించారు.

అమెరికా రాజ్యాంగం ప్రపంచంలో తొలి లిఖిత రాజ్యాంగం. ప్రపంచంలో అతి చిన్న రాజ్యాంగం కూడా ఇదే. ఫ్రాన్స్‌ 1789 విప్లవం అనంతరం రాజ్యాంగాన్ని లిఖిత రూపంలో పొందుపరిచింది.

భారత రాజ్యాంగం ప్రపంచంలో అతి పెద్దది. ఇది కూడా లిఖిత రూపంలోనే ఉంది. ఇది 1950 జనవరి 26న అమల్లోకి వచ్చింది. దీన్ని రాజ్యాంగ సభ రూపొందించింది. రాజ్యాంగ సభను 1946 నవంబర్‌లో కేబినెట్ మిషన్ ప్రణాళిక ప్రకారం ఏర్పాటు చేశారు. ఇందులో ఒక సభ్యుడు ఒక మిలియన్ జనాభాకు ప్రాతినిధ్యం వహించాడు.

రాజ్యాంగ పరిషత్‌కు 1946 జూలైలో ఎన్నికలు నిర్వహించారు. మైనారిటీలు, ఆంగ్లో ఇండియన్‌లు, మహిళలకు రాజ్యాంగ పరిషత్ ఎన్నికల్లో పాల్గొని, ఓటుహక్కు వినియోగించుకునే అవకాశం కల్పించారు. ప్రతి 10 లక్షల జనాభాకు ఒక నియోజకవర్గాన్ని ఏర్పాటు చేశారు. 1946 డిసెంబర్ 11న డాక్టర్ రాజేంద్రప్రసాద్ రాజ్యాంగ సభకు పూర్తి కాలం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1952లో మొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగే వరకు రాజ్యాంగ సభ పార్లమెంటు బాధ్యతలను నిర్వహించింది.

రాజ్యాంగ పరిషత్ తొలి సమావేశాన్ని 1946 డిసెంబర్ 9న ఢిల్లీలో నిర్వహించారు. తొలి సమావేశానికి 211 మంది హాజరయ్యారు. ఫ్రెంచ్ సాంప్రదాయాన్ని ఆదర్శంగా తీసుకొని సభ్యులందరిలో పెద్దవారైన డాక్టర్ సచ్చిదానందా సిన్హాకు అధ్యక్షుడిగా పనిచేసే అవకాశం కల్పించారు. ఈయన 2 రోజుల పాటు తాత్కాలిక అధ్యక్షుడిగా పనిచేశారు. రాజ్యాంగ పరిషత్ రెండో సమావేశం 1947 జనవరి 22న జరిగింది. దీంట్లో ‘లక్ష్యాలు-ఆశయాలు’ తీర్మానాన్ని ఆమోదించారు.

రాజ్యాంగ రచన కోసం రాజ్యాంగ పరిషత్ 22 కమిటీలను నియమించింది. 10 విధాన, 10 నిర్ణయ కమిటీలతో పాటు అతిపెద్ద సలహా సంఘం, ముసాయిదా కమిటీలు దీని కోసం పనిచేశాయి. అతిపెద్ద సలహా సంఘంలో చైర్మన్, 54 మంది సభ్యులు ఉంటారు.

ముసాయిదా కమిటీని 1947 ఆగస్టు 29న ఏడుగురు సభ్యులతో ఏర్పాటు చేశారు. రాజ్యాంగ ముసాయిదాను 1948 ఫిబ్రవరిలో రాజ్యాంగ పరిషత్‌కు సమర్పించారు. రాజ్యాంగ పరిషత్ దీన్ని 1946 నవంబర్ 26న ఆమోదించింది.

రాజ్యాంగం అమల్లోకి వచ్చినపుడు 395 నిబంధనలు, 8 షెడ్యూళ్లు, 22 భాగాలు, 3 అనుబంధాలు, 403 పుటలతో ఉంది. రాజ్యాంగాన్ని రూపొందించడానికి రాజ్యాంగ పరిషత్‌కు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయం పట్టింది. రాజ్యాంగాన్ని రూపొందించడానికి అయిన మొత్తం ఖర్చు రూ. 64 లక్షలు.

ప్రపంచంలో లిఖిత, అలిఖిత అనే రెండు రకాల రాజ్యాంగాలు అమల్లో ఉన్నాయి. పౌరుల ప్రాథమిక స్వేచ్ఛకు తగిన రక్షణ కల్పించడానికి, ప్రభుత్వ అధికారాలను పరిమితం చేయడానికి లిఖిత రాజ్యాంగం ఏర్పడిందని లార్డ్‌ బ్రైస్ అభిప్రాయపడ్డారు. అలిఖిత రాజ్యాంగంలో శాసన నిర్మాణం చేసే పార్లమెంటు సార్వభౌమ సంస్థగా గుర్తింపు పొందింది. అలిఖిత రాజ్యాంగ సవరణ చాలా సులభం. ఆచరణ యోగ్యమైన అంశాలకు చట్టాల్లో ప్రాధాన్యం ఉంటుంది.

మొదటి సాధారణ ఎన్నికల్లో (1952) స్త్రీ, పురుష విచక్షణ లేకుండా 21 ఏళ్లు నిండిన వారందరికీ వయోజన ఓటు హక్కు కల్పించారు. వయోజన ఓటుహక్కు పరిమితిని 1988లో యువ ప్రధాని రాజీవ్ గాంధీ 61వ సవరణ ద్వారా 21 సంవత్సరాల నుంచి 18 ఏళ్లకు తగ్గించారు. 18 సంవత్సరాలు నిండిన, పౌరులు వయోజన ఓటుహక్కును తొలిసారిగా 1989 ఎన్నికల్లో ఉపయోగించుకున్నారు.

పాలనాంశాలను 3 జాబితాలుగా విభజించారు. అవి:

1. కేంద్ర జాబితా: ఇందులో 100 అంశాలు ఉన్నాయి. కీలకమైన రక్షణ, విదేశాంగ విధానం, బీమా, రైల్వే తదితర అంశాలు దీంట్లోనే ఉన్నాయి.

2. రాష్ట్ర జాబితా: ఇందులో 61 అంశాలు ఉన్నాయి. వ్యవసాయం, శాంతి భద్రతలు లాంటివి ఈ జాబితాలోనే ఉన్నాయి.

3. ఉమ్మడి జాబితా: ఇందులో 52 అంశాలు ఉన్నాయి. విద్య, విద్యుత్, వివాహం, విడాకులు లాంటివి ఇందులో ఉన్నాయి.

మిగిలిపోయిన పాలనాంశాలను అవశిష్ట అధికారాలు అంటారు. ఇవి కేంద్రం పరిధిలోనే ఉంటాయి. ఉదా: అంతరిక్ష పరిశోధన, గ్రహాలు, గ్రహాంతర అధ్యయనం.

 

అరిస్టాటిల్ రచించిన ప్రధాన గ్రంథం పాలిటిక్స్. ఈయన 158 గ్రీకు రాజ్యాలను తులనాత్మకంగా అధ్యయనం చేశారు. ఉత్తమ రాజ్యాంగానికి ఉండాల్సిన లక్షణాలను వివరించారు.

ఐవర్‌జెన్నింగ్స్‌ భారత రాజ్యాంగాన్ని న్యాయవాదుల స్వర్గంగా అభివర్ణించారు. రాజ్యాంగ ముఖ్య లక్షణాల్లో సుదీర్ఘ, వివరణాత్మక లిఖిత రాజ్యాంగం ఒకటని ఈయన పేర్కొన్నారు.

మన జాతీయ చిహ్నాన్ని సారనాథ్‌లోని అశోకుని స్తంభం నుంచి స్వీకరించారు.

రాజ్యాంగ సభ జాతీయ జెండాను ఆమోదించిన తేది 1947 జూలై 22.

న్యాయస్థానాలకు న్యాయ సమీక్ష చేసే అధికారం ఉండదు.

స్టడీస్ ఇన్ హిస్టరీ అండ్ జురిస్ప్రూడెన్స్‌ అనే గ్రంథంలో లార్డ్‌ జేమ్స్ బ్రైస్ రాజ్యాంగాలను రెండు రకాలుగా వివరించారు.

సాధారణ చట్టాలను రూపొందించే శాసనసభకు సామాన్య ప్రక్రియ ద్వారా రాజ్యాంగాన్ని సవరించడానికి వీలుంటే దాన్ని అదృఢ రాజ్యాంగంగా ఆర్.జి. గెటిల్ అభిప్రాయపడ్డారు.

కాన్‌స్ట్టిట్యూషనల్ లా అనే గ్రంథంలో ఎ.వి. డైసీ దృఢ రాజ్యాంగం గురించి వివరించారు. రాజ్యాంగ చట్టాలను ఇతర సాధారణ చట్టాల మాదిరిగా మార్చడానికి వీలులేని రాజ్యాంగమే దృఢ రాజ్యాంగం.

ఉదా: అమెరికా రాజ్యాంగం.

రాజ్యాంగ సవరణ విధానాన్ని దక్షిణాఫ్రికా రాజ్యాంగం నుంచి స్వీకరించారు. రాజ్యాంగంలో మొదటి సవరణ (1951, జూన్) భూ సంస్కరణలకు సంబంధించింది.

86వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తించారు. 2002, మార్చిలో ఈ రాజ్యాంగ సవరణ చట్టం చేశారు. దీని ద్వారా అధికరణం 21ఎ లో 6-14 సంవత్సరాల మధ్య ఉన్న బాలబాలికలకు తప్పనిసరిగా ఉచిత నిర్బంధ విద్యను రాజ్యం అందించాల్సి ఉంటుందనే అంశాన్ని చేర్చారు.

1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తిహక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించారు.

113వ సవరణ ద్వారా ఒరిస్సా రాష్ట్రాన్ని ఒడిశాగా, ఒరియా భాషను ఒడియా భాషగా మార్చారు.

భారతీయులు స్వతంత్రంగా రాజ్యాంగాన్ని రచించుకోవచ్చునని లార్ట్‌ లిన్‌లిత్ గో అనే గవర్నర్ జనరల్ 1940 ఆగస్టు 8న పేర్కొన్నారు.

ప్రవేశికకు జరిగిన ఏకైక సవరణ 42వ రాజ్యాంగ సవరణ. ఇందిరాగాంధీ ప్రభుత్వ హయాంలో 1976లో ఈ సవరణ చేశారు. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సామ్యవాద, లౌకిక అనే రెండు పదాలను చేర్చారు.

రాజ్యాంగ పీఠిక ‘భారత ప్రజలమైన మేము’ అనే వాక్యంతో ప్రారంభమై, ‘ఎంపిక చేసుకొని శాసనంగా రూపొందించుకొని ఈ రాజ్యాంగాన్ని మాకు మేమే ఇచ్చుకున్నాం’ అనే పదాలతో ముగుస్తుంది.

ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం కాదని బెరుబారి కేసులో సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది.

బ్రిటిషర్ల పాలనా కాలంలోనే 1946 సెప్టెంబర్ 2న నెహ్రూ తాత్కాలిక పార్లమెంటరీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. నెహ్రూ తాత్కాలిక ప్రధానిగా వ్యవహరించారు.

రాజ్యాంగం మొత్తం 22 భాషలను గుర్తించింది. 21వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1967లో సింధిని 15వ భాషగా చేర్చారు.

భారత్‌లో అత్యధిక శాతం నివసించే గిరిజన తెగ సంతాల్. వీరు ఎక్కువగా మధ్యప్రదేశ్‌లో ఉన్నారు.

భారతదేశ పార్లమెంటరీ తరహా విధానం బ్రిటిష్ వెస్ట్ మినిస్టర్ నమూనాను పోలి ఉంది. పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని ప్రధాని తరహా ప్రభుత్వం, మంత్రిమండలి తరహా ప్రభుత్వం, సమష్టి బాధ్యతాయుత ప్రభుత్వంగా పేర్కొంటారు. పార్లమెంటరీ తరహా వ్యవస్థలో సమష్టి బాధ్యతాయుత సూత్రం లోక్‌సభకు వర్తిస్తుంది.

చట్టం ముందు అందరూ సమానులే అనే భావనను ఎ.వి. డైసీ రూపొందించారు. రాజ్యాంగంలో 14వ ఆర్టికల్ చట్ట సమానత్వం గురించి తెలియజేస్తుంది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్‌లకు దీని నుంచి మినహాయింపు ఉంది. సివిల్, క్రిమినల్ చర్యలకు సంబంధించి పదవీకాలంలో వీరిని అరెస్ట్ చేయకూడదు.

అమెరికాలో 1803లో మార్బరీ వర్సెస్ మారిసన్ కేసులో సర్‌జాన్ మార్షల్ తీర్పు ఫలితంగా న్యాయ సమీక్ష అనే అంశం ప్రస్తావనకు వచ్చింది. ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్న చట్టాలు చెల్లవని న్యాయస్థానాలు నిష్పక్షపాతంగా తీర్పునిచ్చే ఒక అత్యున్నత అధికారమే న్యాయసమీక్ష.

మాదిరి ప్రశ్నలు

  1. రాడికల్ డెమోక్రటిక్ పార్టీ స్థాపకుడెవరు?
    1) ఎం.ఎన్. రాయ్
    2) జయప్రకాశ్ నారాయణ్
    3) ఆచార్య వినోబాభావే
    4) గాంధీజీ
  2. ప్రజాస్వామ్య రాజ్యాంగ రాజ్యాధినేతగా ఎన్నికైన ప్రజాప్రతినిధి ఉంటే ఆ రాజ్యాన్ని ఏమంటారు?
    1) ప్రజాస్వామ్య రాజ్యం
    2) సామ్యవాద రాజ్యం
    3) గణతంత్ర రాజ్యం
    4) లౌకిక రాజ్యం
  3. రాజ్యాంగానికి మూలకారకుడిగా ఎవరిని పేర్కొంటారు?
    1) మనువు
    2) ప్లేటో
    3) గార్నర్
    4) అరిస్టాటిల్
  4. ప్రపంచంలో తొలి లిఖిత రాజ్యాంగం ఏ దేశానిది?
    1) భారత్
    2) అమెరికా
    3) కెనడా
    4) బ్రిటన్
  5. పూర్ణ స్వరాజ్ తీర్మానం కిందివాటిలో ఏ సమావేశానికి సంబంధించింది?
    1) ఢిల్లీ
    2) పుణే
    3) లాహోర్
    4) నాగపూర్
  6. జీవించే హక్కును ఏ దేశ రాజ్యాంగం నుంచి స్వీకరించారు?
    1) జపాన్
    2) జర్మనీ
    3) అమెరికా
    4) కెనడా
  7. భారత రాజ్యాంగానికి సంబంధించి మూలాధారమైన చట్టం ఏది?
    1) 1935
    2) 1919
    3) 1947
    4) 1909
  8. కింద పేర్కొన్నవారిలో రాజ్యాంగ పరిషత్ తాత్కాలిక అధ్యక్షుడిగా పని చేసినవారు?
    1) డాక్టర్ సచ్చిదానంద సిన్హా
    2) సర్దార్ వల్లభాయ్ పటేల్
    3) కె.ఎం. మున్షీ
    4) నెహ్రూ
  9. భారత రాజ్యాంగ రచనకు సుమారుగా ఎన్నేళ్లు పట్టింది?
    1) 5
    2) 4
    3) 3
    4) 2
  10. ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగం ఏ దేశానికి ఉంది?
    1) కెనడా
    2) అమెరికా
    3) ఆస్ట్రేలియా
    4) భారత్
  11. రాజ్యాంగ పరిషత్ తొలి సమావేశాన్ని ఎప్పుడు నిర్వహించారు?
    1) 1946 డిసెంబర్ 8
    2) 1946 డిసెంబర్ 9
    3) 1946 డిసెంబర్ 6
    4) 1947 జనవరి 26
  12. రౌండ్ టేబుల్ సమావేశాలను ఏ నగరంలో నిర్వహించారు?
    1) వాషింగ్టన్
    2) ఢిల్లీ
    3) బ్రస్సెల్స్
    4) లండన్
  13. రాజ్యాంగ పరిషత్‌కు ఎన్నికలను ఎప్పుడు నిర్వహించారు?
    1) 1946 ఆగస్టు
    2) 1946 జనవరి
    3) 1947 సెప్టెంబర్
    4) 1946 జూలై
  14. భారత రాజ్యాంగం అమల్లోకి రాకముందు అమల్లో ఉన్న చట్టం ఏది?
    1) 1935 చట్టం
    2) 1909 చట్టం
    3) 1919 చట్టం
    4) 1833 చట్టం
  15. క్రిప్స్‌ కమిషన్‌ను ఎప్పుడు నియమించారు?
    1) 1943
    2) 1946
    3) 1942
    4) 1932
  16. ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా లౌకిక రాజ్యం అనే పదాన్ని రాజ్యాంగ ప్రవేశికలో చేర్చారు?
    1) 44
    2) 45
    3) 43
    4) 42
  17. భారతదేశం ఏ ప్రభుత్వ విధానాన్ని స్వీకరించింది?
    1) పెట్టుబడిదారీ
    2) అధ్యక్ష తరహా
    3) పార్లమెంటరీ
    4) కమ్యూనిస్టు
  18. దేశ రక్షణ, కరెన్సీ ఏ జాబితాలో ఉన్నాయి?
    1) కేంద్ర
    2) రాష్ట్ర
    3) ఉమ్మడి
    4) ఏదీకాదు
  19. మనదేశంలో ఏ రకమైన పౌరసత్వం అమల్లో ఉంది?
    1) ద్వంద్వ
    2) ఏక
    3) 1, 2
    4) ఏదీకాదు
  20. మత ప్రమేయం లేని (మత విషయాల్లో తటస్థంగా ఉండే)రాజ్యాన్ని ఏమంటారు?
    1) సోషలిస్టు రాజ్యం
    2) లౌకిక రాజ్యం
    3) ఫ్యూడలిజం
    4) థియోక్రటిక్ రాజ్యం
  21. ‘సామ్యవాదం’ అనే పదాన్ని రాజ్యాంగ ప్రవేశికలో ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు?
    1) 44
    2) 41
    3) 42
    4) 43
  22. భారత రాజ్యాంగం మొదటి ప్రకరణ భారతదేశాన్ని ఏవిధమైన రాజ్యంగా ప్రకటిస్తుంది?
    1) ఏకకేంద్ర రాజ్యం
    2) అర్ధ సమాఖ్య రాజ్యం
    3) సమాఖ్య రాజ్యం
    4) రాష్ట్రాల యూనియన్

సమాధానాలు

1) 1 2) 3 3) 4 4) 2 5) 3 6) 1 7) 1 8) 1 9) 3 10) 4
11) 2 12) 4 13) 4 14) 1 15) 3 16) 4 17) 3 18) 1 19) 2 20) 2
21) 3 22) 4
Published date : 24 Feb 2015 04:07PM

Photo Stories