లౌకికతత్వం - ప్రపంచశాంతి – భారతదేశం
‘లౌకిక’ అంటే మతంతో సంబంధం లేనిది అని అర్థం. ‘లౌకికతత్వం’ అంటే మతంతో ప్రమేయం లేని చింతన లేదా తత్వం. లౌకికతత్వాన్ని అనుసరించే దేశం ప్రజల మత సంబంధమైన విషయాల్లో జోక్యం చేసుకోదు. భారతదేశం వివిధ మతాలకు పుట్టినిల్లు. హిందూ, బౌద్ధం, జైనం, ఇస్లాం, క్రైస్తవం, పార్శీ మతాలు మనదేశంలో ఉన్నాయి. భారతదేశం ఒక లౌకిక రాజ్యం. క్రీస్తు పూర్వం నుంచి మతాలను పరిశీలిస్తే అశోకుడు మొదట హిందువు. తర్వాత ఉపగుప్తుడనే బౌద్ధమతాచార్యుని బోధనలతో బౌద్ధాన్ని స్వీకరించాడు. ఆ కాలంలోనే పరమత సహనాన్ని పాటించిన చక్రవర్తి అశోకుడు. హర్షుడు, చంద్రగుప్త విక్రమాదిత్యుడు కూడా లౌకికతత్వాన్ని అనుసరించారు. ఇక మధ్యయుగంలో తొలి లౌకిక చక్రవర్తి అక్బర్. దిన్-ఇ-ఇలాహీ అనే నూతన మతానికి అక్బర్ శ్రీకారం చుట్టాడు. అంతేకాకుండా ఇబాదత్ ఖానా అనే ప్రార్థన మందిరంలో సర్వమతాల వారు ప్రార్థనలు చేసుకొనే అవకాశం కల్పించాడు. ప్రస్తుతం మనదేశంలో హిందువులు, క్రిస్టియన్లు, ముస్లింలు, సిక్కులు, జైనులు, బౌద్ధులు మొదలైనవారు తమ మతాలు నిర్ణయించిన ఆచార వ్యవహారాలను పాటిస్తూ శాంతియుతంగా జీవిస్తున్నారు. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా లౌకిక అనే పదాన్ని భారత రాజ్యాంగ పీఠికలో ప్రవేశపెట్టారు. భారతీయ లౌకికవాదం ఉదారమైంది. ప్రేమ, సహనం, సర్వమత సమానత్వం అనే సూత్రాలకు ప్రాముఖ్యత ఇస్తుంది. మతవాదానికి బదులు మానవతావాదాన్ని పౌరులు అలవరుచుకోవాలి. మతం పేరుతో ఇతరులపై దాడులు చేస్తే ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతుంది. తద్వారా అల్ప సంఖ్యాకుల్లో భయాందోళనలను తొలగిస్తుంది.
ప్రపంచ శాంతి
యుద్ధ భయం మానవాళిని అనాదిగా వేధిస్తోంది. మానవుల శాంతియుత సహజీవనానికి యుద్ధాలు తీవ్రమైన అంతరాయం కలిగిస్తున్నాయి. వీటివల్ల ఎంతో నష్టం కలుగుతుంది. 20వ శతాబ్దంలో సంభవించిన రెండు ప్రపంచ యుద్ధాలు ప్రపంచవ్యాప్తంగా పెను విధ్వంసాన్ని సృష్టించాయి. మొదటి ప్రపంచ యుద్ధం 1914-18 మధ్య కాలంలో జరిగింది. రెండో ప్రపంచ యుద్ధ కాలం 1939-45. మొదటి ప్రపంచ యుద్ధంలో అమెరికా తటస్థంగా ఉంది. మళ్లీ ప్రపంచ యుద్ధమే సంభవిస్తే ప్రపంచం మొత్తం కొద్ది క్షణాల్లో ధ్వంసం అవుతుందని అంచనా. అందుకే ప్రపంచ శాంతి నెలకొల్పడం ఎంతో అవసరమని వివిధ దేశాలు గుర్తించాయి. ఈ లక్ష్యసాధన కోసం మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత నానాజాతి సమితి, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐక్యరాజ్య సమితి ఏర్పడ్డాయి. నానాజాతి సమితి 1920లో జెనీవా ప్రధాన కార్యాలయంగా ఏర్పాటైంది. 1945, అక్టోబర్ 24న న్యూయార్క్ కేంద్రంగా ఐక్యరాజ్యసమితి ఏర్పడింది.
భారతదేశం పాత్ర
ప్రపంచ శాంతి నెలకొల్పడానికి, కొన్ని దేశాలు గణనీయమైన కృషి చేస్తున్నాయి. వాటిలో భారతదేశం ఒకటి. ప్రపంచ శాంతిని కాపాడటం భారత విదేశాంగ విధాన ముఖ్య లక్ష్యాల్లో ఒకటి. జాతీయ ప్రయోజనాలను రక్షించుకోవడానికి ఇతర దేశాలతో సాంఘిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక సంబంధాల విషయంలో రూపొందించిన విధానాన్ని విదేశాంగ విధానం అంటారు. భారత విదేశాంగ విధానానికి మొదటి ప్రధాని నెహ్రూ రూపకల్పన చేశారు.
పంచశీల సూత్రాలు: టిబెట్ విషయంపై భారతదేశం, చైనా చేసుకున్న ఒడంబడికలో శాంతియుత సహజీవన సూత్రాలను పేర్కొన్నారు. వీటినే పంచశీల సూత్రాలు అంటారు. 1954 జూన్ 28న భారత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ, చైనా ప్రధాని చౌ-ఎన్-లై ఈ ఒప్పందాన్ని ఆమోదించారు.
అలీనోద్యమం (నామ్): భారత మొదటి ప్రధాని నెహ్రూ, యుగోస్లావియా అధ్యక్షుడు మార్షల్ టిటో, ఈజిప్టు అధ్యక్షుడు కమాలుద్దీన్ నాజర్ అలీనోద్యమానికి మూల పురుషులు. వీరికి ప్రపంచ శాంతి, సహజీవనం, సామరస్యం, సహకారం వంటి అంశాలపై అపార నమ్మకం ఉంది. అటు అమెరికా ఆధ్వర్యంలోని పెట్టుబడిదారి దేశాల కూటమి, ఇటు రష్యా నాయకత్వంలోని సామ్యవాద దేశాల కూటమిలో చేరని దేశాలను అలీన దేశాలు అంటారు. నామ్ 1961లో ఏర్పడింది. మొదటి సదస్సులో 25 దేశాలు పాల్గొన్నాయి. ప్రస్తుతం నామ్‌లో సభ్య దేశాల సంఖ్య-107. నామ్ ఏడో సదస్సు 1983లో న్యూఢిల్లీలో జరిగింది. ఈ సమావేశానికి నాటి భారత ప్రధాని ఇందిరాగాంధీ అధ్యక్షత వహించారు. భారత్ నామ్ ద్వారా ప్రపంచ శాంతి పరిరక్షణకు విశేష కృషి చేస్తోంది. క్యూబా సమస్య విషయంలో 1962లో అమెరికా-రష్యాల మధ్య రాజీని కుదర్చడంలో భారతదేశం ముఖ్యపాత్రను పోషించింది. అంతేకాకుండా శాంతిస్థాపన దిశగా 1983, 1985, 1988లలో పాకిస్థాన్‌తో ఒప్పందాలను కుదుర్చుకుంది.
మాదిరి ప్రశ్నలు
- మనదేశంలో సంపూర్ణ అక్షరాస్యతా సంవత్సరంగా ఎప్పుడు ప్రకటించారు?
1) 1992
2) 1991
3) 1990
4) 1989 - స్త్రీలలో అక్షరాస్యత అతి తక్కువ ఉన్న రాష్ర్టం?
1) మేఘాలయ
2) రాజస్థాన్
3) ఒడిశా
4) బీహార్ - జీవించే హక్కును ఏ నిబంధన ద్వారా ప్రసాదించారు?
1) 22
2) 20
3) 21
4) 24 - స్త్రీలకు ఆస్తిలో సమాన హక్కును ఎప్పుడు చట్టబద్ధం చేశారు?
1) 1985
2) 1989
3) 1984
4) 1983 - మొట్టమొదటిసారిగా షెడ్యూల్డ్ కులాలు అనే పదాన్ని ఏ సంవత్సరంలో ఉపయోగించారు?
1) 1940
2) 1945
3) 1947
4) 1935 - అస్పృశ్యతను ఒక పాపంగా అభివర్ణించినవారు?
1) గౌతమబుద్ధుడు
2) జవహర్‌లాల్ నెహ్రూ
3) గాంధీజీ
4) అంబేద్కర్ - దేశంలో భాష ప్రాతిపదికగా ఏర్పడిన మొదటి రాష్ర్టం?
1) ఆంధ్రప్రదేశ్
2) కర్నాటక
3) కేరళ
4) తమిళనాడు - ఒక జాతికి ఉండే లక్షణాలు?
1) సంఘీభావం
2) ఐకమత్యం
3) భాష, మాండలికాలు
4) సార్వభౌమాధికారం - రాజ్యాంగంలోని ఏ విభాగం నిర్బంధ ప్రాథమిక విద్య గురించి వివరిస్తుంది?
1) ప్రవేశిక
2) ప్రాథమిక విధులు
3) ఆదేశ సూత్రాలు
4) పౌరహక్కులు - హెబియస్ కార్పస్ రిట్ అంటే ఏమిటి?
1) ఇది అన్యాయమైన అరెస్ట్‌ను నిరోధిస్తుంది
2) అధికారిని పనిచేయమని
3) నీ పని నీవు చేయమని
4) ప్రతిషేధం - Sons of soil (భూమిపుత్రుల) సిద్ధాంతం ఎవరిది?
1) శివసేన
2) బీహార్
3) తెలంగాణ
4) విదర్భ - భారత రాజ్యాంగ ప్రవేశికలో లౌకిక అనే పదాన్ని ఏ సంవత్సరంలో చేర్చారు?
1) 1978
2) 1972
3) 1976
4) 1970 - ఐక్యరాజ్యసమితి ఏ నగరంలో ఉంది?
1) చికాగో
2) న్యూయార్క్
3) జెనీవా
4) శాన్‌ఫ్రాన్సిస్కో - దిన్-ఇ- ఇలాహీ అనే మతాన్ని ప్రవేశపెట్టినవారు ఎవరు?
1) బాబర్
2) షాజహాన్
3) ఔరంగజేబు
4) అక్బర్ - భారతీయ లౌకికతత్వం ఎలాంటిది?
1) సామాజికమైంది
2) నైతికమైంది
3) ఉదారమైంది
4) ఏదీకాదు - రెండో ప్రపంచ యుద్ధంలో దారుణంగా ధ్వంసమైన నగరం?
1) పెకింగ్
2) నాగసాకి
3) టోక్యో
4) తైవాన్ - ఆసియా రాజ్యాల మొదటి మహాసభ జరిగిన నగరం ఏది?
1) బాగ్దాద్
2) నాగసాకి
3) పెకింగ్
4) ఢిల్లీ - భారత్-చైనాల మధ్య శాంతి ఒప్పందం ఏ సంవత్సరంలో జరిగింది?
1) 1987
2) 1988
3) 1985
4) 1983 - అలీనవిధానం పితామహుడు ఎవరు?
1) చౌ-ఎన్-లై
2) భుట్టో
3) నెహ్రూ
4) గాంధీజీ - బాండుంగ్ సమావేశం జరిగిన సంవత్సరం?
1) 1947
2) 1949
3) 1950
4) 1955 - మొదటి అలీనదేశాల సదస్సుకి హాజరైన సభ్య దేశాల సంఖ్య?
1) 45
2) 35
3) 25
4) 55 - పంచశీల ఎవరి ఒప్పందాల ఫలితం?
1) రాజీవ్‌గాంధీ- బెనజీర్ భుట్టో
2) ఇందిరాగాంధీ- జుల్ఫికర్ ఆలీభుట్టో
3) నెహ్రూ-చౌ-ఎన్-లై
4) సుకర్నో-టిటో - మారణాయుధాల సంఖ్య పెరగడానికి కారణం?
1) మిత్రదేశాలు ఉచితంగా ఇవ్వడం
2) శాస్త్రీయ విజ్ఞానాభివృద్ధి
3) ఖర్చు తగ్గడం
4) శాస్త్రీయ విజ్ఞాన లోపం - వియత్నాం విప్లవాన్ని బలపరిచిన సమావేశం జరిగిన నగరం?
1) అల్జీర్స్
2) జకార్తా
3) హవానా
4) హరారే - ఏ లక్ష్యసాధన కోసం ఐక్యరాజ్య సమితిని ఏర్పాటు చేశారు?
1) ఏకీయత
2) జాతీయత
3) శాంతి
4) మత సహనం - ఏ సంవత్సరంలో చైనా - ఇండియాల మధ్య యుద్ధం జరిగింది?
1) 1965
2) 1948
3) 1962
4) 1971 - ఇండియా తొలిసారిగా అణు విస్ఫోటన పరీక్ష జరిపిన సంవత్సరం?
1) 1974
2) 1970
3) 1968
4) 1975 - సార్క్ ఆవిర్భావం ఎక్కడ జరిగింది?
1) సిలోన్
2) ఢాకా
3) ఢిల్లీ
4) ఖాట్మాండు - బ్రిటీషువారు పరిపాలించిన వలస రాజ్యాల కూటమిని ఏమని వ్యవహరిస్తారు?
1) కామన్‌వెల్త్
2) బ్రిటీష్ సమాఖ్య
3) యూరోపియన్ దేశాల కూటమి
4) నాటో
సమాధానాలు
1) 3 | 2) 2 | 3) 3 | 4) 1 | 5) 4 | 6) 3 | 7) 1 | 8) 3 | 9) 3 | 10) 1 |
11) 1 | 12) 3 | 13) 4 | 14) 4 | 15) 3 | 16) 2 | 17) 4 | 18) 1 | 19) 3 | 20) 4 |
21) 3 | 22) 3 | 23) 2 | 24) 1 | 25) 3 | 26) 3 | 27) 1 | 28) 2 | 29) 1 |