Water Bell in AP Govt Schools: పాఠశాలల పునః ప్రారంభం తర్వాత కూడా కొనసాగనున్న “Water Bell”
- రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో క్రమం తప్పకుండా "వాటర్ బెల్"
- విద్యార్థుల్లో డీ హైడ్రేషన్ నివారణకు రోజుకు మూడు సార్లు వాటర్ బెల్
- ఏప్రిల్ 23వ తేదీ వరకు ప్రతిరోజు వాటర్ బెల్ నిర్వహణను పర్యవేక్షించాలని డీఈవోలకు సూచన
- మూత్రం రంగును బట్టి తమ శరీరంలో నీటి లోపాన్ని గుర్తించి నీరు తాగే అలవాటును పెంపొందించేందుకు వీలుగా విద్యార్థుల జ్ఞాపకశక్తిని పెంచేలా పోస్టర్ లు
- ప్రతి మూత్రశాల మరియు టాయిలెట్ బ్లాక్ ముందు అతికించే విధంగా చర్యలు
- ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ
పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్
పాఠశాలల పునః ప్రారంభం (జూన్ 12వ తేదీ) తర్వాత కూడా “వాటర్ బెల్” విధానాన్ని కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాధికారులను ఆదేశించినట్లు పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుత విద్యా సంవత్సరం ముగింపు (ఏప్రిల్ 23వ తేదీ) వరకు ప్రతిరోజు వాటర్ బెల్ నిర్వహణను పర్యవేక్షించాలని ఈ సందర్భంగా డీఈవోలకు సూచించారు. అంతేగాక మూత్రం యొక్క రంగును బట్టి తమ శరీరంలో నీటి లోపాన్ని గుర్తించి నీరు తాగే అలవాటును విద్యార్థుల్లో పెంపొందించేందుకు వీలుగా వారు గుర్తించేలా పోస్టర్‌ను జతపరిచామని పేర్కొన్నారు. ఈ పోస్టర్‌లను పోస్ట్‌కార్డ్ సైజులో ముద్రించి ప్రతి మూత్రశాల మరియు టాయిలెట్ బ్లాక్ ముందు అతికించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రధానంగా మూత్రం ఏ రంగూ లేకుండా వస్తే పారదర్శకంగా ఉందని, నీరు అధికంగా త్రాగుతున్నారని అర్థం. లేత గోధుమ రంగు వస్తే ఆరోగ్యంగా ఉన్నారని, తగినంత నీరు త్రాగుతున్నారని అర్థం. లేత పసుపు రంగు వస్తే సాధారణ స్థితి అని, ఆరోగ్యంగా ఉన్నట్లు సంకేతం. ముదురు పసుపు రంగు వస్తే నీరు తక్కువగా త్రాగుతున్నారని, మరి కొంత నీరు శరీరానికి అవసరమని అర్థం. తేనె రంగులో వస్తే శరీరానికి సరిపడినంత నీరు అందడం లేదని అర్థం. ముదురు గోధుమ రంగులో వస్తే వెంటనే ఎక్కువ నీరు త్రాగాలని విద్యార్థులకు సూచించేలా పోస్టర్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించినట్లు ప్రవీణ్ ప్రకాష్ పేర్కొన్నారు.
జపాన్‌కు చెందిన టోషికో మొరిమోటో, యాసుయో ఆబే, అమెరికన్ స్కాలర్స్ పటేల్ ఏఐ మరియు లాస్ ఏంజిల్స్‌కు చెందిన బోర్రుడ్ ఎల్‌జి, నెదర్లాండ్స్‌కు చెందిన డచ్ స్కాలర్స్ మెక్కీ టీఈ, ఫాగ్ట్ ఎస్ ఈటీ ఏఐ మరియు ఇతరులు నిర్వహించిన పరిశోధనలు ఈ విధానం యొక్క ఆవశ్యకతను నిర్ధారించాయని ప్రవీణ్ ప్రకాష్ వివరించారు.
ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఎండ వేడిమికి విద్యార్థుల్లో డీహైడ్రేషన్ ముప్పును నివారించేందుకు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో రోజుకు మూడు సార్లు (9.45 AM, 10.05 AM, 11.50 AM) వాటర్ బెల్ మోగించాలని ఇప్పటికే విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.