Education News: విద్యార్థుల భవితను తీర్చిదిద్దే ఆలోచన.. జెడ్పీ హైస్కూల్లో వలంటీర్ వ్యవస్థ
అద్భుతాల ఆవిష్కరణకు బాటలు వేసింది. అక్షరాస్యత పెంచాలని తలంచిన గ్రామస్తులు, పేరెంట్స్ కమిటీ కలిసి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్ఫూర్తితో మహత్తర యజ్ఞానికి శ్రీకారం చుట్టారు. గ్రామంలో ప్రతి 50 ఇళ్లకు ఓ వలంటీర్‌ను నియమించినట్టే శ్రీవేమన జెడ్పీ హైస్కూల్లో వలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టారు. మూడు నెలల కిందట అంకురమైన ఈ ప్రక్రియ దిగ్విజయంగా అమలవుతూ సత్ఫలితాలనిస్తోంది.
గుంటూరు ఎడ్యుకేషన్: పెదకాకాని మండలం వెనిగండ్ల గ్రామంలోని శ్రీవేమన జెడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రస్తుతం ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు సుమారు వెయ్యి మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇక్కడికి గ్రామంతోపాటు సమీప గ్రామాలైన అగతవరప్పాడు, పెదకాకాని నుంచి విద్యార్థులు వస్తుంటారు. వీరిలో పేదవర్గాల వారే ఎక్కువ. ఎక్కువ మంది వ్యవసాయ కూలీల పిల్లలే. వీరికి ఇళ్ల వద్ద చదువుకునే పరిస్థితులు ఉండవు. మార్గదర్శనం చేసేవారూ ఉండరు. దీనివల్ల విద్యాప్రమాణాలు సన్నగిల్లే అవకాశం ఉందనే ఉద్దేశంతో వెనిగండ్ల గ్రామపెద్దలు, పేరెంట్స్ కమిటీ సభ్యులు విద్యా వలంటీర్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ విషయమై తల్లిదండ్రులతో పలుమార్లు చర్చించి వారి అంగీకారం తీసుకున్నారు.
గ్రామంలోనే ఉన్నత విద్యార్హత (బీఏ, బీకాం, బీఎస్సీ, బీటెక్ అర్హతలు కలిగినవారితో పాటు బీఏ బీఈడీ, ఎమ్మెస్సీ ఫిజిక్స్, ఎమ్మెస్సీ బీఈడీ, ఎంఏ హిందీ పండిట్, ఎమ్మెస్సీ బీఈడీ, ఎంఏ ఎంఫిల్)ఉన్న 13 మంది యువతీయువకులను నియమించారు. వీరు పాఠశాలలో 6,7,8,9 తరగతుల విద్యార్థులకు ఉదయం సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. విద్యార్థులతో హోం వర్క్ పూర్తి చేయించడంతోపాటు ఆ రోజు చెప్పిన పాఠ్యాంశాలను మరోసారి చదివించి, వారి సందేహాలను నివృత్తి చేస్తున్నారు. ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి 5.30 వరకు తరగతులు సాగుతున్నాయి.
చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2024 | టైం టేబుల్ 2024 | స్టడీ మెటీరియల్ | గైడెన్స్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ ఏపీ టెన్త్ క్లాస్
గతంలోనూ ప్రత్యేక తరగతులు..
ఈ పాఠశాలలో గతంలో 1986 నుంచి 2013 వరకు ఏడు, పది తరగతుల విద్యార్థులకు ఉపాధ్యాయులు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించేవారు. దాదాపు పదేళ్ల నుంచి ప్రత్యేక తరగతుల నిర్వహణ లేదు. పరీక్షల సమయంలో కేవలం పదో తరగతి విద్యార్థులకు మాత్రమే ఉపాధ్యాయులు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. మిగిలిన తరగతుల పిల్లలు ఇళ్లకు వెళ్లాక టీవీలకు అతుక్కుపోవడం, ఫోన్‌లకు అలవాటు పడడంతోపాటు తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవడంతో చదువులో వెనుకబడ్డారు. ఈ విషయాన్ని గుర్తించిన గ్రామస్తులు మళ్లీ ప్రత్యేక తరగతుల నిర్వహణకు శ్రీకారం చుట్టారు.
జిల్లా స్థాయిలో గుర్తింపు..
శ్రీవేమన జెడ్పీ హైస్కూల్‌కు జిల్లాస్థాయిలో ప్రత్యేక గుర్తింపు ఉంది. వెనిగండ్లలో పుట్టి, పెరిగి ఇదే పాఠశాలలో టెన్త్ పూర్తి చేసుకుని వెళ్లిన ఎంతో మంది పూర్వ విద్యార్థులు దేశవిదేశాల్లో ఉన్నత రంగాల్లో రాణిస్తున్నారు. ఏటా పదో తరగతి పరీక్షల్లో ఈ పాఠశాల విద్యార్థులు సత్తాచాటుతున్నారు. టాప్–5లో స్థానం సంపాదిస్తున్నారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక రెండేళ్లపాటు వరుసగా నూరుశాతం ఫలితాలు సాధించింది. ఈ పాఠశాల అప్‌గ్రేడ్ కావడంతో ఇక్కడ రెండేళ్ల క్రితం ఇంటర్మీడియెట్ కూడా ప్రారంభమైంది. ప్రస్తుతం 63 మంది ఇంటర్ చదువుతున్నారు.
న్యూస్‌రీల్
2018 నుంచి పదవ తరగతి ఫలితాలు ఇలా..
సంవత్సరం ఫలితాల శాతం
2018-19 97
2019-20 100
2020-21 100
2021-22 78
2022-23 79
చదవండి: Increase of Admissions: ప్రతీ మండలంలో ఒక హైస్కూల్ ప్లస్ కళాశాల
రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ఆకాంక్ష..
మనబడి నాడు–నేడు మొదటి దశలో రూ.65 లక్షలతో పాఠశాలను ఆధునికీకరించిన ప్రభుత్వం, సకల వసతులను కల్పించింది. ప్రస్తుతం రెండో దశలో రూ.30 లక్షల నిధులతో మూడు అదనపు తరగతి గదుల నిర్మాణం జరుగుతోంది. ప్రతి తరగతి గదిలో ఐఎఫ్ ప్యానెళ్లను ఏర్పాటు చేశారు. 8, 9 తరగతుల విద్యార్థులకు ప్రత్యేకంగా ట్యాబ్‌లు అందాయి. ఆధునిక తరగతి గదులతోపాటు సువిశాల ప్రాంగణం పచ్చదనంతో ఆకట్టుకుంటుంది. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్ఫూర్తితో చేపట్టిన ఈ వలంటీర్ల వ్యవస్థను ప్రతి పాఠశాలలో అమలు చేస్తే బాగుంటుందనే ఆకాంక్ష గ్రామస్తుల నుంచి వ్యక్తమవుతోంది.