AP Govt Schools: పాఠశాలల్లో నూరు శాతం హాజరు ఉండాలి
మూలపాడు(ఇబ్రహీంపట్నం): రాష్ట్ర ప్రభుత్వం విధానాలకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు నూరుశాతం ఉండాలని రాష్ట్ర ఎస్‌ఎస్‌సీ పరీక్షల బోర్డు డైరెక్టర్ దేవానందరెడ్డి స్పష్టంచేశారు. మూలపాడు జెడ్పీ ఉన్నత పాఠశాలను ఆయన సోమవారం సందర్శించారు. పాఠశాలలో సదుపాయాలపై ఆరా తీశారు. గడిచిన రెండేళ్లుగా పదోతరగతి ఫెయిల్ అయిన వారిలో ఫీజులు చెల్లించి మళ్లీ పరీక్షలకు హాజరైన వారు, సప్లిమెంటరీకి ఫీజులు చెల్లించని వారి వివరాలు తెలుసుకున్నారు. మూలపాడు, కేతనకొండకు చెందిన నలుగురు విద్యార్థులు పరీక్ష ఫీజులు చెల్లించకపోవడంతో వారి ఇళ్లకు వెళ్లారు. ఫీజులు చెల్లించలేక పోవడానికి కారణాలు తెలుసుకున్నారు. ఫీజులు చెల్లించి పరీక్ష రాసేలా తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. టెన్త్‌క్లాస్‌లో నూరుశాతం ఫలితాలు సాధించాలన్నారు. హెచ్‌ఎం డేవిడ్‌రాక్, ఉపాధ్యాయులు మోహనరావు, ఎస్‌ఎస్‌సీ బోర్డు సభ్యులు పాల్గొన్నారు.