Skip to main content

Student Talent: నిరుపేద విద్యార్థి ప్రతిభ

student talent
student talent

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌జిల్లాకేంద్రంలోని ఫైర్‌స్టేషన్‌ (టీడీగుట్ట) నిరుపేద కుటుంబానికి చెందిన మహ్మద్‌ అస్రార్‌ అమీర్‌ మొదటి నుంచి చదువులో ప్రతిభచాటాడు. 7 నుంచి 10వ తరగతి వరకు జిల్లా కేంద్రంలోని మైనార్టీ బాలుర–2 గురుకులంలో, పదో తరగతిలో 10 గ్రేడ్‌ పాయింట్లు, బాలుర–1 జూనియర్‌ కళాశాలలో ఎంపీసీ ఇంటర్‌లో 931 మార్కులు సాధించి సత్తాచాటాడు. చిన్నప్పటి నుంచి విమానాలు నడపాలనే అభిరుచి పెంచుకున్న అస్రార్‌ అమీర్‌ ఈ ఏడాది జూలైలో ఎయిర్‌ క్రాఫ్ట్‌ మెయింటెనెన్స్‌ ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఏఎంఈసెట్‌) పరీక్ష రాయగా ఆలిండియా స్థాయిలో 158 ర్యాంక్‌ను సాధించి హైదరాబాద్‌ బేగంపేటలోని రాజీవ్‌గాంధీ ఏవియేషన్‌ అకాడమీలో కమర్షియల్‌ పైలెట్‌ లైసెన్స్‌ కోర్సులో సీటు సంపాధించాడు.

రాష్ట్ర ప్రభుత్వం సహకారం

కమర్షియల్‌ పైలెట్‌ కోర్సులో సీటు సాధించిన విద్యార్థి మహ్మద్‌ అస్రార్‌ అమీన్‌ను జిల్లా కేంద్రంలో గురువారం బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు మోసీన్‌ఖాన్‌ సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి అస్రార్‌ పైలెట్‌ కోర్సులో సీటు సాధించినందుకు సంతోషంగా ఉందన్నారు. అయితే రెండేళ్ల కోర్సుకు రూ.35.23 లక్షలు ఫీజుగా ఉండడంతో అసలే నిరుపేద కుటుంబమైన అస్రార్‌ అంత డబ్బు చెల్లించలేని పరిస్థితి. దీంతో హోంమంత్రి మహమూద్‌అలీ, మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లినట్లు తెలిపారు. హోంమంత్రి సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. విద్యార్థి పైలెట్‌ కోర్సు ఫీజు రూ.35.23 లక్షలు రాష్ట్ర మైనార్టీ సంక్షేమశాఖ మంజూరు చేసినట్లు ప్రకటించారు. ఇప్పటికే మొదటి విడతగా ఏవియేషన్‌ అకాడమీకి రూ.10 లక్షలు చెల్లించి అడ్మిషన్‌ తీసుకోవడం జరిగిందన్నారు. మిగతా డబ్బులు రెండు విడతల్లో అకాడమీలో జమచేస్తారని పేర్కొన్నారు. పైలెట్‌ కావాలనుకున్న నిరుపేద విద్యార్థికి చేయూత అందించిన సీఎం కేసీఆర్‌, మంత్రులు మహమూద్‌అలీ, శ్రీనివాస్‌గౌడ్‌, మైనార్టీ వెల్ఫేర్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఉమర్‌ జలీల్‌, టీఎస్‌ఎంఎఫ్‌సీ చైర్మన్‌ ఇంతియాజ్‌ ఇసాక్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థి అస్రార్‌ అమీర్‌ మాట్లాడుతూ చిన్నప్పటి నుంచి పైలెట్‌ కావాలనే ఆశ ఉండేదని, ట్రైనింగ్‌ కోర్సు చేయడానికి తోడ్పాటు అందిస్తున్న సీఎం కేసీఆర్‌, మంత్రులు మహమూద్‌అలీ, శ్రీనివాస్‌గౌడ్‌, నాయకుడు మోసీన్‌ఖాన్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకుడు ఇద్రీస్‌ తదితరులు పాల్గొన్నారు.

Published date : 25 Aug 2023 04:58PM

Photo Stories