Teachers Felicitation: ఉపాధ్యాయులకు గురు పూజోత్సవం నిర్వహించారు
సాక్షి, ఎడ్యుకేషన్: ఉపాధ్యాయులు మార్గదర్శకులుగా ఉండాలని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం భీమవరం ఎస్‌ఆర్‌కెఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన గురు పూజోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఉపాధ్యాయులు బోధనతో సమాజంలో మార్పు తెచ్చి సమ సమాజ స్థాపనకు కంకణబద్ధులు కావాలని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యనిస్తుందని, నాడు–నేడు, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యా కానుక, విద్యా దీవెన, వసతి దీవెన వంటి అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు. పాఠశాలల్లో కుల, మతాల ప్రస్తావన ఎన్నడూ రాకూ డదని మంత్రి హితవు చెప్పారు. ప్రభుత్వం విద్యారంగంలో తెచ్చిన మార్పుల కారణంగా మన రాష్ట్రం విద్యలో దేశంలో మూడో స్థానంలో నిలిచిందన్నారు.
విద్యాభివృద్ధికి వినూత్న పథకాలు
కలెక్టర్ పి.ప్రశాంతి మాట్లాడుతూ మన ప్రతిభను పరిచయం చేసే గొప్ప వ్యక్తులు ఉపాధ్యాయులేనన్నారు. విజ్ఞానానికి మారు పేరు గురువని, మాజీ భారత రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గురువుగా విద్యాభివృద్ధికి చేసిన సేవలు ఆదర్శనీయమన్నారు. ఉన్నతమైన విలువలు, అంకితభావంతో ఉపాధ్యాయ వృత్తిని నిర్వహిస్తున్నవారిని సమాజం మహానుభావులుగా కొనియాడుతుందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి అవసరమైన వినూత్నమైన ప్రణాళికలను రూపొందించడంలో భాగంగా పాఠశాలలు, కళాశాలలో మౌలిక వసతులు కల్పిస్తుందని, విద్యార్థుల తల్లిదండ్రులకు విద్య భారం కాకూడదని ప్రభుత్వం అనేక విద్యాభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తుందన్నారు. ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యా విధానంలో ప్రతిష్టాత్మకమైన మార్పులు తీసుకువచ్చిందన్నారు. జిల్లా విద్యాశాఖాధికారి ఆర్.వెంకటరమణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసిందని చెప్పారు. కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేసిన 52 మంది ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు.
Education News: విద్యను అందించేందుకు ఉపాధ్యాయులకు శిక్షణ
ఉత్తమ ఉపాధ్యాయులను మంత్రి కారుమూరి, కలెక్టర్ ప్రశాంతి, ఎమ్మెల్యే శ్రీనివాస్ చేతుల మీదుగా జ్ఞాపిక, ప్రశంసా పత్రం, శాలువాతో సత్కరించారు. ముందుగా మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో భీమవరం ఎంపీపీ పేరిచర్ల విజయనర్సింహ రాజు, ఎస్‌ఆర్‌కేఆర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.జగపతిరాజు, డీఎంహెచ్‌ఓ డాక్టర్ డి.మహేశ్వరరావు, భీమవరం డిప్యూటీ డీవైఈవో శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.
మంత్రి కారుమూరి
ఉత్తమ ఉపాధ్యాయులకు సత్కారం