Govt Schools: ప్రభుత్వ బడిలోనే చదివించాలి
కడప ఎడ్యుకేషన్ : ప్రభుత్వ పాఠశాలలను రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా అభివృద్ధి చేసిందని తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించి చదివించాలని తల్లిదండ్రులకు సమగ్రశిక్ష జిల్లా ప్రాజెక్టు అధికారి అంబవరం ప్రభాకర్‌రెడ్డి సూచించారు. గురువారం జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో పేరెంట్– టీచర్స్ కమిటీ సమావేశాలను నిర్వహించారు. ఈ నెల 1వ తేదీ నుంచి 4వ తేదీ వరకు నిర్వహించిన ఫార్మెటివ్ పరీక్షల్లో వచ్చిన మార్కులను తల్లిదండ్రులకు ప్రదర్శించారు. అలాగే పిల్లల పట్ల తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు. పిల్లలను క్రమం తప్పకుండా పాఠశాలకు పంపాలని కోరారు. పేరెంట్– టీచర్స్ కమిటీ సమావేశంలో భాగంగా కడప మున్సిపల్ హైస్కూల్‌లో నిర్వహించిన సమావేశంలో అంబవరం ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తోందన్నారు. అలాగే కోట్ల రూపాయలు పెట్టి నాడు– నేడు కింద ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చారన్నారు. ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలన్నారు. ఈ కార్యక్రమంలో కడప మండల ఎంఈఓ పాలెం నారాయణ, హెచ్‌ఎం నాగమణి, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.