Education system: ప్రాథమిక విద్య మరింత పటిష్టం
ముంచంగిపుట్టు: ప్రాథమిక స్థాయిలో విద్యా వ్యవస్థ పటిష్టంగా ఉండేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని పాడేరు ఐటీడీఏ పీవో వి.అభిషేక్ ఆదేశించారు. మండలంలోని సుజనకోట పంచాయితీ నర్సిపుట్టులో అసంపూర్తిగా ఉన్న పాఠశాల భవనం ఆయన చొరవతో పూర్తయింది. ఇందుకు రూ.2 లక్షలు ఐటీడీఏ, రూ.55 వేలు పంచాయతీ వెచ్చించారు. ఎట్టకేలకు పూర్తయిన ఈ భవనాన్ని విద్యార్థుల తల్లిదండ్రుల సమక్షంలో పీవో ప్రారంభించారు. కొంతసేపు విద్యార్థులతో ముచ్చటించారు. సర్పంచ్ రమేష్, ఎంపీటీసీ సుబ్బలక్ష్మి, గ్రామస్తులు,ఉపాధ్యాయులు పీవోను సత్కరించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి నెలా మండలంలో ఐదు బాలికల పాఠశాలలను సందర్శించి తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు తదితర సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు గ్రామాల్లో నెలకొన్న సమస్యలను గుర్తించి ఫొటో తీసి పంపిస్తే నిధులు కేటాయించి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. అనంతరం తాల్లబుతోటలో శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనాన్ని ఆయన పరిశీలించారు. విద్యార్థులను ఈ భవనంలో కూర్చోబెట్టవద్దని సూచించారు. భవన సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. వివిధ సమస్యలపై నర్సీపుట్టు, తాల్లబుతోట గ్రామాల గిరిజనుల నుంచి వినతులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ డీడీ కొండలరావు, ఎంపీడీవో రమేష్, ఎంఈవో కృష్ణమూర్తి, సీడీపీవో వరహాలమ్మ, ట్రైబల్ వెల్ఫేర్ ఏఈ జబ్బర్, వైద్యాధికారి రమేష్, ఏటీడబ్ల్యూవో స్వర్ణలత, ఏపీవో సూరిబాబు, ఉపాధ్యాయులు, సీఆర్‌పీలు, సచివాలయ సిబ్బంది, వలంటీర్లు పాల్గొన్నారు.
6th Class Admissions: ‘నవోదయ’ దరఖాస్తుల స్వీకరణకు గడువు పెంపు