Andhra Pradesh Govt Schools: ప్రతి పాఠశాలలో మెనూ ప్రకారం భోజనం
దర్శి: రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశ పెట్టిన ఆరోగ్యకరమైన మెనూ ప్రకారం విద్యార్థులకు ఆహారం అందిస్తున్నట్లు జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ అన్నారు. మండలంలోని తూర్పు చౌటపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను అక్టోబర్ 30 సోమవారం వెంకాయమ్మ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ముందుగా పాఠశాల రికార్డులు పరిశీలించారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎలా చదువుతున్నారు? అధ్యాపక సిబ్బంది సరిగా వస్తున్నారా? పాఠ్యాంశాలు అర్థమవుతున్నాయా? జగనన్న విద్యా కానుక అందిందా? ఆహారం ఉచితంగా ఉంటుందా అని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు స్వయంగా భోజనం వడ్డించి వారితో కలసి కూర్చుని భోజనం చేశారు. శామంతపూడి గ్రామానికి చెందిన 40 మంది విద్యార్థులు బస్ సౌకర్యం లేక నాలుగు కిలోమీటర్లు నడవాల్సి వస్తుందని బస్ వేయించాలని కోరగా వెంటనే శామంతపూడి నుంచి బస్‌వేయాలని ఆర్టీసీ ఆర్‌ఎంతో ఫోన్‌లో మాట్లాడి చెప్పారు. పాఠశాల గ్రౌండ్ చివర భూమిని శ్మశానంగా వాడుకుంటున్నారని, దీంతో పిల్లలు ఆడుకోవాలంటే భయపడుతున్నారని వారి దృష్టికి తీసుకెళ్లగా సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. గ్రామ సచివాలయ సిబ్బంది తమకు సీసీరోడ్డు వేయాలని వినతి పత్రం అందజేశారు. త్వరలోనే సీసీ రోడ్డు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా బూచేపల్లి వెంకయమ్మ మాట్లాడుతూ నాడు–నేడు ద్వారా పాఠశాలల రూపురేఖలు మారిపోయాయన్నారు. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిషు మీడియం ప్రవేశ పేట్టి పేదలకు కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్న ఘనత సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కిందన్నారు. కార్యక్రమంలో ఎంఈఓలు కాకర్ల రఘురామయ్య ,రమాదేవి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
నాడు–నేడు ద్వారా పాఠశాలలన్నీ అభివృద్ధి కార్పొరేట్ స్థాయి విద్య ప్రభుత్వ బడుల్లోనే.. జెడ్పీ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ
చదవండి: Teacher Jobs: 523 టీచర్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్