Best Teacher Award: ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు గడువు పొడిగింపు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): వచ్చే సెప్టెంబర్ 5న సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు అర్హులైన ఉపాధ్యాయులు దరఖాస్తుకు గడువు తేదీని పొడిగించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి పీ శ్యామ్ సుందర్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర స్థాయి అవార్డుకు అర్హులైన ఉపాధ్యాయులు తమ దరఖాస్తులను ఈ నెల 24 మధ్యాహ్నం ఒంటిగంట లోపు సంబంధిత తనిఖీ అధికారి ద్వారా జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయానికి పంపాలని సూచించారు. 24వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట దాటిన తరువాత వచ్చే దరఖాస్తులు స్వీకరించరన్నారు. కనీసం 15 సంవత్సరాల సేవా కాలం పూర్తి చేసిన ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, టీచర్ ఎడ్యుకేటర్లు ఈ అవార్డులకు అర్హులన్నారు. ఎంపిక చేసిన ఉపాధ్యాయులు గతంలో జిల్లా స్థాయి అవార్డులు పొంది ఉండాలని, గతంలో రాష్ట్ర స్థాయి అవార్డులు పొందిన వారు దరఖాస్తు చేయడానికి అనర్హులని వివరించారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులు మండల స్థాయి కమిటీ ద్వారా, ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు డివిజన్ స్థాయి కమిటీ ద్వారా సమర్పించాలని సూచించారు.