చదువులపై మదింపు
గుణాత్మక విద్యను అందించేందుకు నిర్వహిస్తున్న ఫార్మేటివ్, సమ్మేటివ్ పరీక్షలను ప్రభుత్వం గత ఏడాది నుంచి ప్రయోగాత్మకంగా క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్‌మెంట్ (సీబీఏ) పేరుతో నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే ప్రస్తుత విద్యా సంవత్సరం 4 ఫార్మేటివ్, 2 సమ్మేటివ్ పరీక్షల నిర్వహణకు జిల్లా కామన్ ఎగ్జామినేషన్ బోర్డు (డీసీఈబీ) ఏర్పాట్లు చేస్తోంది. గత ఏడాది మాదిరిగానే 1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు సీబీఏ, 9, 10 తరగతుల వారికి ఫార్మేటివ్ విధానాల్లో పరీక్షలు నిర్వహిస్తారు.
సామర్థ్యాల వెలికితీతే ఉద్దేశం
ప్రస్తుత విద్యా సంవత్సరం జూన్ 12న ప్రారంభమైంది. పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన అకడమిక్ క్యాలండర్ ప్రకారం పరీక్షలు జరుపుతున్నారు. జూన్, జూలై సిలబస్‌కు సంబంధించి విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల మదింపునకు సీబీఏ, ఫార్మేటివ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షల ద్వారా అభ్యసన లోపాలను గుర్తిస్తారు. విద్యార్థులు వెనుకబడిన అంశాలను గుర్తించి, ప్రత్యేక బోధన ద్వారా వారు సాధారణ స్థాయికి చేరేలా చూస్తారు.
సీబీఏ విధానం ఎందుకంటే..
విద్యార్థుల్లో ఉత్తమ విద్యా ప్రమాణాలను పెంచే క్రమంలో సీబీఏ విధానాన్ని అమలు చేస్తున్నారు. పక్కా బోధనతో విద్యార్థుల సామర్థ్యాలను వెలికితీయడమే ఈ పరీక్షల ప్రధాన ఉద్దేశం. ఎఫ్‌ఏ, ఎస్‌ఏల స్థానంలో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఒకటి నుంచి 8వ తరగతి విద్యార్థులకు ఎఫ్‌ఏ–1, 3, ఎస్‌ఏ–2కు బదులు సీబీఏ విధానంలో, ఎఫ్‌ఏ–2, 4, ఎస్‌ఏ–1 పరీక్షలు పాత విధానంలో నిర్వహిస్తారు. 9, 10 తరగతులకు నాలుగు ఎఫ్‌ఏలు, రెండు సమ్మేటివ్ పరీక్షలు ఫార్మేటివ్ విధానంలో అమలు చేస్తారు.
బైలింగ్విల్ ప్రశ్నపత్రాలు
సీబీఏ విధానంలో నిర్వహిస్తున్న పరీక్షలకు ప్రశ్నపత్రం బైలింగ్విల్ (ద్విభాష) విధానంలో ఉంటుంది.
విద్యార్థికి ఇంగ్గిషులో ప్రశ్న అర్థం కాకుంటే తెలుగులో చదివి అర్థం చేసుకునేందుకు గత ఏడాది నుంచి బైలింగ్విల్ ప్రశ్నపత్రాలు ప్రవేశపెట్టారు. ఇందులో 10 ప్రశ్నలు ఆబ్జెక్టివ్ విధానంలో, ఐదు ప్రశ్నలు రాతపూర్వక విధానంలో ఇస్తారు. మొత్తం 15 ప్రశ్నలకు 20 మార్కులు కేటాయిస్తారు. ప్రశ్నలన్నీ విద్యార్థిని సమగ్రంగా అంచనా వేసేలా ఉంటాయి. మెకానికల్, అండర్‌స్టాండింగ్, అప్లికేషన్ (ఎంయూఏ) ప్రశ్నపత్రం ఉంటుంది. ఓఎంఆర్ పత్రాల్లో జవాబులు నింపి జిల్లాకు పంపించాల్సి ఉంటుంది. సీబీఏ విధానంలో పరీక్షలు రాసే విద్యార్థులు తమ సమాధానాలను ఓఎంఆర్ షీట్లలో నింపాల్సి ఉంటుంది. ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు మాత్రం రాతపూర్వక సమాధానాలు రాస్తే సరిపోతుంది.
5 వరకూ నిర్వహణ
సీబీఏ విధానంలో నిర్వహించే పరీక్షలు ఆగస్టు 1 నుంచి 5వ తేదీ వరకూ నిర్వహిస్తారు. ఎయిడెడ్, ప్రభుత్వ, జెడ్పీ యాజమాన్యాల్లో 1,52,932 మంది, ప్రైవేటు యాజమాన్యంలో 1,20,190 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాయనున్నారు. కాగా సీబీఏ విధానంలో 1–8 తరగతుల వరకూ 2,14,969 మంది, పాత విధానంలో 9, 10 తరగతులకు చెందిన 58,153 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.