Telangana Schools News: తెలంగాణ బడుల్లో... ఇక డిజిటల్ విద్య
హైదరాబాద్: క్లాస్ రూంలో తాజ్‌మహల్ పాఠం చెప్పడం కాదు.. తాజ్‌మహల్ పక్కనే ఉండి వివరిస్తున్నట్టుగా ఉంటే.. విత్తనం మొలకెత్తే దగ్గర్నుంచి.. చెట్టుగా మారి.. పూలు, కాయడం మొత్తాన్ని ప్రత్యక్షంగా చూసిన అనుభూతి వస్తే.. విద్యార్థులకు ఈ థ్రిల్లే వేరు. సబ్జెక్ట్‌పై మంచి అవగాహన రావడమేకాదు, చదువుకోవడం, నేర్చుకోవడంపై మరింత ఆసక్తి కలగడమూ ఖాయమే. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో త్వరలోనే ఈ తరహా డిజిటల్ బోధన అందుబాటులోకి రానుంది. విద్యార్థులకు వర్చువల్ రియాలిటీ (వీఆర్), త్రీడీ విధానాల్లో పాఠాలు బోధించే ఏర్పాట్లపై రాష్ట్ర సర్కారు దృష్టిసారించింది.
ఇందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, ఇతర ఏర్పాట్లపై పరిశీలన జరుపుతోంది. నూతన విద్యా విధానంలో భాగంగా దీనిని అమల్లోకి తీసుకురానుంది. ఇటీవల రాష్ట్రంలో డిజిటల్ విద్యా బోధనపై జరిగిన ఉన్నత స్థాయి సమీక్ష సందర్భంగా.. అధికారుల నుంచి ప్రభుత్వం నివేదిక కోరింది. విద్యాశాఖ అధికారులు డిజిటల్ బోధనకు గల అవకాశాలు, అవసరమైన ఏర్పాట్ల వివరాలను సేకరిస్తున్నారు. నిపుణులతో చర్చించి నివేదిక రూపొందించేందుకు సిద్ధమవుతున్నారు.
రెండేళ్ల కిందటి నుంచే ప్రయత్నాలు
వర్చువల్ రియాలిటీ, త్రీడీ వంటి డిజిటల్ బోధన వల్ల విద్యలో నాణ్యత పెరుగుతుందని కేంద్ర అధ్యయనాలు తేల్చాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు సర్కారీ బడుల్లో అత్యాధునిక సాంకేతికత సమకూర్చుకుని, డిజటల్ బోధనను అమలు చేయాలని కేంద్రం కోరింది. ఇందుకోసం అయ్యే వ్యయంలో 60శాతం భరిస్తామని ప్రకటించింది. వాస్తవానికి ఈ ప్రయత్నం 2022లోనే మొదలైంది. అవసరమైన మౌలిక వసతులనూ గుర్తించారు. రాష్ట్ర ప్రభుత్వ బడుల్లో డిజిటల్ విద్యపై రెండేళ్ల క్రితం కొంత కసరత్తు జరిగింది. త్రీడీ విద్యను రెండు స్కూళ్లలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. కానీ ప్రతిపాదనల దశలోనే అది ఆగిపోయింది.
ఆధునిక విద్యకు ఎన్నో అవసరాలు!
స్కూళ్లలో డిజిటల్ బోధనకు 75 అంగుళాల మానిటర్లు అవసరం. కంప్యూటర్లు, వర్చువల్ రియాలిటీ, త్రీడీ పరికరాలతో కూడిన స్మార్ట్ క్లాస్‌రూంలు, మెటల్ ఫ్రేమ్ కూడిన బోర్డ్, పాఠ్యాంశాల బోధన కోసం యాప్‌లు, ట్యూబ్‌లైట్లు, గ్రీన్‌బోర్డ్‌లు, విద్యుత్ అంతరాయంతో ఇబ్బంది రాకుండా యూపీఎస్‌లు వంటివి అవసరం. దీనికితోడు వేగవంతమైన ఇంటర్నెట్, వైఫై తప్పనిసరి. విద్యార్థులకు కావాల్సిన ఆడియో, వీడియో, త్రీడీ చిత్రాలు, గ్రాఫ్‌లు, మ్యాప్‌లు, వీడియోలను డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయం ఉండాలి. యానిమేషన్, త్రీడీ చిత్రాలను ఉపయోగించే సాంకేతికత ఉండాలి.
కొత్త టెక్నాలజీలతో సులువుగా..
ఇప్పుడు డిజిటల్, త్రీడీ, వర్చువల్ విద్యా బోధన సులువుగా మారిందని నిపుణులు తెలిపారు. గతంలో ప్రొథీయమ్ బోర్డ్ వాడాల్సి వచ్చేదని.. దానితో ఒక్కో బడికి రూ.25 లక్షల దాకా వెచ్చించాల్సి వచ్చేదని.. ఇప్పుడు తక్కువ ఖర్చయ్యే కొత్త టెక్నాలజీలు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. ప్రస్తుతం ప్రొజెక్టర్, స్మార్ట్ టచ్ స్క్రీన్ టీవీలను వాడుతున్నారని.. బోధనకోసం వాడే కంటెంట్‌ను బడిలోని కంప్యూటర్‌లోనే ఇన్‌స్టాల్ చేయడానికి వీలుందని వెల్లడించారు. బోధన కంటెంట్ ఉచితంగా కూడా దొరుకుతుందని.. కాకపోతే స్థానికతను దృష్టిలో ఉంచుకుని కంటెంట్ రూపొందించుకుంటే సరిపోతుందని స్పష్టం చేశారు. కంటెంట్‌ను తగిన మెళకువలతో అందిస్తే విద్యార్థుల్లో ఆసక్తి పెరుగుతుందని తెలిపారు.
సూచనలు, అంచనాలివీ..
– 6 నుంచి 10 తరగతుల వరకు రికార్డు చేసిన డిజిటల్ కంటెంట్‌ను ఇంటర్నెట్ సాయంతో వినేలా చేయవచ్చు. టీచర్లు చెప్పే లైవ్ పాఠాలు ఇంటివద్దే వినే, చూసే వీలుంటుంది.
– ప్రతి పాఠశాలలో రెండు డిజిటల్ క్లాస్ రూంలను ఏర్పాటు చేయాలి. ఇందులో ప్రొజెక్టర్, కంప్యూటర్లు, డిజిటల్ తెర, ఇంటరాక్టివ్ వైట్ బోర్డులు.. ఇలా మొత్తం 25 ఎల్రక్టానిక్ పరికరాలు అమర్చాల్సి ఉంటుంది.
– ప్రయోగాత్మక పరిశీలన కోసం రాష్ట్రంలో 3 వేల స్మార్ట్ క్లాస్‌రూమ్‌ల అవసరం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇందులోనే వర్చువల్, డిజిటల్, త్రీడీ పాఠాలు చెప్పవచ్చు. ఒక్కో స్కూల్‌కు రూ.10 లక్షల వరకూ ఖర్చు అవుతుందని అంచనా. ఇలా మొత్తంగా 300 కోట్లు వెచ్చించాల్సి ఉంటుందని విద్యాశాఖ అంచనా వేసింది.
ఇంటర్నెట్, ఇతర వసతులు కల్పించాలి
మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వ స్కూళ్లలో డిజిటల్ విద్యను ప్రవేశపెట్టడం స్వాగతించాల్సిన అంశం. ఇందుకు అవసరమైన మౌలిక వసతుల కల్పన ముఖ్యం. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో స్కూళ్లకు ఇంటర్నెట్ నెట్ సదుపాయం లేదు. కొన్నిచోట్ల వేగం సరిగారాదు. ఇలాంటి సమస్యలను పరిష్కరించాలి. డిజిటల్ విద్యా బోధన వల్ల ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది.
– పింగిలి శ్రీపాల్‌రెడ్డి, పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు
లోకల్ కంటెంట్ అవసరం
డిజిటల్, త్రీడీ విద్యా బోధన ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలనే మారుస్తుంది. అయితే ఎక్కడి నుంచో పాఠాలు దిగుమతి చేసుకుంటే లాభం లేదు. జాతీయ స్థాయిలో రూపొందించిన పాఠాలు. స్థానిక పరిస్థితులను ప్రతిబింబించేలా వీడియోలు, యానిమేషన్ ఉండాలి. దీనిపై రాష్ట్రంలో కొన్ని సంస్థలు పనిచేస్తున్నాయి. వాటి భాగస్వామ్యాన్ని తీసుకోవాలి. విద్యార్థులకు పాఠం చెప్పే సమయంలోనే డిజిటల్, త్రీడీ విధానాలను వినియోగించాలి. కేవలం రివిజన్ సమయంలో వాడితే ప్రయోజనం ఉండదు.
– పన్నీరు భానుప్రసాద్, సూపర్ టీచర్ ఎడ్యు రీఫారŠమ్స్ సీఈవో
Tags
- Digital Schools
- government schools
- Digital education
- Education Department
- Online Education
- Telangana digital Education
- DigitalEducation
- TeachingStrategies
- EducationReview
- GovernmentInitiatives
- ExpertConsultation
- HyderabadEducation
- EducationalPolicies
- DigitalTeaching
- EducationOfficials
- ReportOnEducation
- SakshiEducationUpdates