Collector Sumit Kumar: విద్యార్థుల డ్రా పౌట్ల వివరాలు సేకరించండి
సాక్షి, పాడేరు: పాఠశాలల్లో విద్యార్థుల డ్రాపౌట్ల వివరాలు సేకరించి, వారు మరలా పాఠశాలకు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సుమిత్‌కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులను గుర్తించి డ్రాపౌట్లుకు గల కారణాలను విశ్లేషించాలని, ఆయా గ్రామాలకు వెళ్లి వలంటీర్లు, పంచాయతీ కార్యదర్శులు, సంక్షేమ సహాయకుల ద్వారా చిన్నారుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించారు. జీవీకే కిట్ల పంపిణీ, పాఠశాలల్లో విద్యార్థుల హాజరు సరిచూడాలని సూచించారు. జిల్లాలో 20 వేలకు పైగా డ్రాపౌట్లు ఉండవచ్చని, దీనిపై అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు కసరత్తు చేయాలని ఆదేశించారు. నాడు–నేడు పనులు వేగవంతం చేయాలని, పూర్తయిన పనులకు సంబంధించి బిల్లులను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని, గురువారం సాయంత్రానికి పెండింగ్ బిల్లులు అప్‌లోడ్ చేసి, తదుపరి ఏ రోజుకారోజు నిరంతరం అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు. ఎంఈవోలు, సహాయ గిరిజన సంక్షేమాధికారులు దీనిపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని ఆదేశించారు. ఫేజ్–2కు సంబంధించి ఎంవోయూలను అప్‌లోడ్ చేయాలన్నారు. పాఠశాలలో, వసతిగృహాల్లో సక్రమంగా మెనూ అమలు చేయాలని, నాణ్యతలో రాజీపడొద్దని హెచ్చరించారు. జీసీసీ నుంచి పంపే సరకులు, కేజీబీవీల మాదిరిగా నేరుగా విద్యా సంస్థలకే రవాణా చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
చదవండి: Education Department: టీచర్ల సర్దుబాటు షురూ
‘ఆడుదాం –ఆంధ్రా’కు కమిటీలు
ప్రభుత్వ ఆదేశాల మేరకు అక్టోబర్ రెండో తేదీ నుంచి 31 తేదీ వరకు గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లాస్థాయిలో ఐదు క్రీడలకు సంబంధించి ఆడుదాం–ఆంధ్రా కార్యక్రమం నిర్వహణలో అందరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ సుమిత్‌కుమార్ ఆదేశించారు. వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, క్రికెట్, బ్యాడ్మింటన్ క్రీడల నిర్వహణకు గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు వివిధ కమిటీలు ఏర్పాటు చేశామని, జిల్లా మొత్తం 64 కేంద్రాలు ఎంపిక చేసినట్టు తెలిపారు. 17 సంవత్సరాలు నిండిన మహిళలు, పురుషులు ఈ క్రీడాపోటీలకు అర్హులన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 1వతేదీ సంబంధిత సచివాలయాల్లో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. సమావేశంలో జిల్లా విద్యాశాఖాధికారి సలీంబాష, గిరిన సంక్షేమ ఉప సంచాలకులు కొండలరావు, పాడేరు డివిజన్ సహాయ గిరిజన సంక్షేమాధికారులు, ఇంజనీరింగ్ అధికారులు, ఎంపీడీవోలు, ఎంఈవోలు, జిల్లా క్రీడాధికారి జగన్మోహనరావు, మండలాల అధికారులు వర్చువల్ విధానం ద్వారా హాజరయ్యారు.