Skip to main content

CBSE Open Book Exam: కాపీ కొట్టాల్సిన పనిలేదు,పుస్తకాలు చూస్తూనే పరీక్ష రాయొచ్చు.. సీబీఎస్‌ఈ గ్రీన్‌సిగ్నల్‌

CBSE Open Book Exam CBSE Suggests Open-Book Examinations

న్యూఢిల్లీ: పరీక్ష గదిలో విద్యార్థుల దగ్గర చీటీలు కనిపిస్తే వీపు వాయగొట్టే ఉపాధ్యాయులనే మనం చూశాం. అయితే పుస్తకాలు, నోటు పుస్తకాలు చూసుకుంటూ ఎగ్జామ్‌ ఎంచకా రాసుకోండర్రా అని చెప్పే విధానం ఒకదానికి పైలట్‌ ప్రాజెక్ట్‌గా పరీక్షించాలని సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌(సీబీఎస్‌ఈ) నిర్ణయించింది. ఈ వినూత్న ఆలోచన 2023 డిసెంబర్‌లోనే బోర్డ్‌ కార్యనిర్వాహక వర్గ సమావేశంలో చర్చకొచ్చింది.

‘ఓపెన్‌–బుక్‌ ఎగ్జామ్‌’కు గ్రీన్‌సిగ్నల్‌
నిర్ణిత కాలావధిలో పాఠ్యపుస్తకాలను చూస్తూనే విద్యార్థి పరీక్షగదిలో ఎంత సృజనాత్మకంగా సమాధానాలు రాబట్టగలడు, సూటిగాలేని తికమక, క్లిష్ట ప్రశ్నలకు ఎలా జవాబులు రాయగలడు, విద్యార్థి ఆలోచనా విధానం, విశ్లేషణ సామర్థ్యం వంటి వాటిని మదింపు చేసే ఉద్దేశంతో ఈ ‘ఓపెన్‌–బుక్‌ ఎగ్జామ్‌’ పైలట్‌ ప్రాజెక్టుకు సీబీఎస్‌ఈ పచ్చజెండా ఊపింది. అయితే ఈ పరీక్ష విధానాన్ని 10, 12 తరగతి బోర్డ్‌ పరీక్షలో అమలుచేసే ఆలోచన అస్సలు లేదని సీబీఎస్‌ఈ అధికారులు స్పష్టంచేశారు.

పుస్తకం చూస్తూనే పరీక్ష
కొన్ని ఎంపిక చేసిన పాఠశాలల్లో 9, 10వ తరగతి విద్యార్థులకు ఇంగ్లిష్‌, గణితం, సామాన్య శాస్త్రాల్లో, 11, 12వ తరగతి విద్యార్థులకు ఇంగ్లిష్‌, గణితం, జీవశాస్త్రాల్లో ఈ ఓపెన్‌–బుక్‌ ఎగ్జామ్‌ను పైలట్‌ ప్రాజెక్ట్‌గా చేపట్టనున్నారు. స్టడీ మెటీరియల్‌ను రిఫర్‌ చేస్తూనే ఇలాంటి ఎగ్జామ్‌ పూర్తిచేయడానికి విద్యార్థి ఎంత సమయం తీసుకుంటాడు?

అనే దానితోపాటు విద్యార్థులు, టీచర్లు, సంబంధిత భాగస్వాముల అభిప్రాయాలనూ సీబీఎస్‌ఈ పరిగణనలోకి తీసుకోనుంది. ఫార్మాటివ్‌ అసెస్‌మెంట్‌(ఎఫ్‌ఏ), సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌(ఎస్‌ఏ)ల కోణంలో ఈ తరహా పరీక్ష అమలు తీరుతెన్నులపై సీబీఎస్‌ఈ ఓ నిర్ణయానికి రానుంది.

Published date : 23 Feb 2024 04:05PM

Photo Stories