రైల్వే ఉద్యోగం కోసం వేలి చర్మం ఒలిచిన యువకుడు
తన బొటన వేలి చర్మాన్ని ఒలిచి స్నేహితుడి వేలికి అతికించి, బయోమెట్రిక్ వెరిఫికేషన్‌లో బయటపడ్డాక తనకు బదులుగా పరీక్ష రాయించాలని పథకం వేశాడు. అయితే, బండారం బయటపడి ఇద్దరూ కటకటాల పాలయ్యారు. బిహార్‌లోని ముంగేర్ జిల్లాకు చెందిన మనీష్ కుమార్, రాజ్యగురు గుప్తా స్నేహితులు. 12వ తరగతి వరకు చదువుకున్నారు. రైల్వే శాఖలోని గ్రూప్ డి ఉద్యోగాలకు మనీష్ దరఖాస్తు చేసుకున్నాడు.
ఎంపిక పరీక్ష వడోదరలో ఆగస్టు 21న జరిగింది. మనీష్ బదులు చదువులో ఎప్పుడూ ముందుండే గుప్తా పరీక్షకు వచ్చాడు. అభ్యర్థులకు బయోమెట్రిక్ వెరిఫికేషన్ తప్పనిసరి. ఈ గండం గట్టెక్కేందుకు మనీష్ తన బొటనవేలి చర్మాన్ని ఒలిచి గుప్తా చేతి వేలికి అతికించాడు. గుప్తా ఆ చేతిని ప్యాంట్ జేబులోనే ఉంచుకుని, మరో చేతి వేలితో చేసిన బయోమెట్రిక్ వెరిఫికేషన్ యత్నం పలుమార్లు విఫలమైంది. అనుమానించిన అధికారులు అతడి మరో చేతిని బయటకు తీయించి, శానిటైజర్ స్ప్రే చేశారు. బొటనవేలికి అతికించిన చర్మ ఊడి కింద పడింది.
అధికారుల విచారణలో అసలు నిజం బయటకు వచ్చింది. దీంతో ఇద్దరు మిత్రులను పోలీసులు అరెస్ట్ చేశారు. పరీక్షకు ముందు బయోమెట్రిక్ వెరిఫికేషన్‌ను ఊహించిన కుమార్..పరీక్షకు ముందు రోజే ఎడమ బొటనవేలిని స్టౌపైన కాల్చుకుని, బ్లేడుతో ఆ చర్మాన్ని ఒలిచి గుప్తా బొటనవేలికి అంటించినట్లు పోలీసు విచారణలో వెల్లడైంది. ఒకవేళ, అతికించిన చర్మం ఊడి రాకున్నా వారి పన్నాగం పారేది కాదని వైద్య నిపుణులు అంటున్నారు.