Skip to main content

RPF Recruitment 2024: రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌లో 4,660 ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ పోస్ట్‌లు.. పరీక్ష విధానం, సిలబస్‌, ప్రిపరేషన్‌ గైడెన్స్‌..

రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌.. సంక్షిప్తంగా ఆర్‌పీఎఫ్‌! భారతీయ రైల్వేలకు సంబంధించి.. రక్షణ, భద్రత వ్యవహరాలను పర్యవేక్షించే విభాగం! తాజాగా రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్, రైల్వే ప్రొటెక్షన్‌ స్పెషల్‌ పోర్స్‌ విభాగాల్లో.. సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(ఎస్‌ఐ), కానిస్టేబుల్‌ పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్‌ వెలువడింది. వచ్చే నెల (ఏప్రిల్‌) 15 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది!! ఈ నేపథ్యంలో.. రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌లో.. పోలీస్‌ ఉద్యోగాలు, ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం, సిలబస్‌ విశ్లేషణ, ప్రిపరేషన్‌ తదితర వివరాలు..
Railway Protection Force   Selection process for RPF police jobs   Indian Railways   Preparation for RPF recruitment exams  RPF Recruitment 2024 for 4660 SI and Constable Jobs and Selection Process and Exam Pattern and Syllabus Analysis and Preparation
  • రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌లో 4,660 ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ పోస్ట్‌లు
  • ఏప్రిల్‌ 15 నుంచి మొదలు కానున్న దరఖాస్తు ప్రక్రియ
  • మూడు దశల ఎంపిక విధానం
  • నిర్దిష్ట వ్యూహంతో విజయానికి అవకాశం

కోవిడ్‌ కారణంగా గత మూడేళ్లుగా రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌లో నియామకాలు చేపట్టలేదు. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది భారీగా నియామకాలకు భారత రైల్వే శాఖ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే నాలుగు వేలకుపైగా పోస్ట్‌ల భర్తీకి సన్నాహకాలు చేపడుతోంది. అభ్యర్థులు పటిష్ట ప్రణాళికతో ప్రిపరేషన్‌ సాగిస్తే విజయావకాశాలు మెరుగుపరచుకోవచ్చు.

ఎస్‌ఐ, కానిస్టేబుల్‌.. 4,660 పోస్ట్‌లు
రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ తాజా నోటిఫికేషన్‌ ద్వారా సబ్‌ ఇన్‌స్పెక్టర్, కానిస్టేబుల్‌ హోదాలలో మొత్తం 4,660 పోస్ట్‌లకు నియామకం చేపట్టనుంది. వీటిలో ఎస్‌ఐ పోస్టులు 452, కానిస్టేబుల్‌ పోస్టులు 4,208 ఉన్నాయి.

అర్హతలు

  • ఆర్‌పీఎఫ్‌ నియామకాలకు సంబంధించి డిగ్రీ, పదో తరగతి అర్హతతో పోటీ పడే అవకాశం ఉంది. ఎస్‌ఐ పోస్ట్‌లకు బ్యాచిలర్‌ డిగ్రీ, కానిస్టేబుల్‌ పోస్ట్‌లకు పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. 
  • వయసు: జూలై 1, 2024 నాటికి 20-28 ఏళ్ల మధ్య ఉండాలి(రిజర్వ్‌డ్‌ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనల మేరకు గరిష్ట వయో పరిమితిలో సడలింపు లభిస్తుంది)

చదవండి: Rail Coach Factory Recruitment 2024: రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో 550 యాక్ట్‌ అప్రెంటిస్‌లు.. పూర్తి వివ‌రాలు ఇవే..

వేతనం
ఎస్‌ఐ పోస్ట్‌లకు పే లెవల్‌-6తో (రూ.35,400-రూ.1,12,400); కానిస్టేబుల్‌ పోస్ట్‌లకు పే లెవల్‌-3తో(రూ.21,700-రూ.69,100) ప్రారంభ వేతనం లభిస్తుంది.

మూడు దశల ఎంపిక ప్రక్రియ
ఆర్‌పీఎఫ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్, కానిస్టేబుల్‌ పోస్ట్‌లకు మూడు దశల్లో ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. తొలిదశలో కంప్యూటర్‌ బేస్డ్‌ విధానంలో రాత పరీక్ష; రెండో దశలో ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్, మూడో దశలో ఫిజికల్‌ మెజర్‌మెంట్‌ టెస్ట్‌లు ఉంటాయి. వీటన్నిటిలోనూ విజయం సాధిస్తే.. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ ప్రక్రియ పూర్తి చేసి నియామకాలు ఖరారు చేస్తారు.

120 మార్కులకు రాత పరీక్ష
ఎంపిక ప్రక్రియలో తొలిదశ రాత పరీక్షను మూడు విభాగాల్లో 120 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో జనరల్‌ అవేర్‌నెస్‌ 50 ప్రశ్నలు-50 మార్కులకు, అర్థమెటిక్‌ 35 ప్రశ్నలు-35 మార్కులకు, జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌ 35 ప్రశ్నలు-35 మార్కులకు ఉంటాయి. నెగిటివ్‌ మార్కింగ్‌ నిబంధన ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 1/3వ వంతు మార్కును తగ్గిస్తారు. పరీక్షకు లభించే సమయం 90 నిమిషాలు.

రెండో దశ పీఈటీ, పీఎంటీ
రాత పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా ఒక్కో పోస్ట్‌కు పది మందిని చొప్పున (1:10 నిష్పత్తిలో) ఎంపిక చేసి.. వారికి తదుపరి దశలో ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్‌ మెజర్‌మెంట్‌ టెస్ట్‌లు నిర్వహిస్తారు.

ఉన్నత హోదాలు
ఆర్‌పీఎఫ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్, కానిస్టేబుల్‌గా ఎంపికైన వారు సర్వీసు నిబంధనలను అనుసరించి భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకునే అవకాశం ఉంది. ఎస్‌ఐగా నియమితులైన వారు అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌ స్థాయికి చేరుకోవచ్చు. కానిస్టేబుల్‌గా ఎంపికైన వారు సబ్‌ ఇన్‌స్పెక్టర్‌/ఇన్‌స్పెక్టర్‌ స్థాయికి చేరుకునే వీలుంది. 

చదవండి: RRB Job Notification 2024: రైల్వేలో 9,144 టెక్నీషియన్‌ పోస్ట్‌లు.. పరీక్షలో విజయానికి ప్రిపరేషన్‌ గైడెన్స్‌..

ముఖ్య సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు తేదీలు: 2024, ఏప్రిల్‌ 15 - మే 14
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://rpf.indianrailways.gov.in/RPF/, https://rrbsecunderabad.gov.in/

రాత పరీక్షలో రాణించేలా
జనరల్‌ అవేర్‌నెస్‌

ఈ విభాగానికి సంబంధించి.. సమకాలీన అంశాలతోపాటు చరిత్ర, రాజ్యాంగం, ఎకానమీ, జాగ్రఫీ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, కరెంట్‌ అఫైర్స్‌ అంశాలపై పూర్తి అవగాహన పొందాలి. అదే విధంగా..భారత చరిత్రకు సంబంధించి ముఖ్యమైన ఘట్టాలు, చరిత్ర గతిని మార్చిన సంఘటనలు, భారత స్వాతంత్య్ర ఉద్యమంలోని ప్రధాన ఘట్టాలపై పట్టు సాధించాలి. జాగ్రఫీలో భారత, ఏపీ భౌగోళిక స్వరూపం, సహజ వనరులు, నదులు, సముద్రతీర ప్రాంతాలు, అడవులు, పంటలు, సాగు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఎకానమీలో కోర్‌ ఎకనామీ అంశాలతోపాటు సమకాలీన పరిణామాలు, దేశ ఆర్థిక రంగంలో అమలవుతున్న కొత్త విధానాలపై స్పష్టత ఏర్పరచుకోవాలి. పాలిటీకి సంబంధించి రాజ్యాంగం, రాజ్యాంగ రూపకర్తలు, రాజ్యంగంలోని ముఖ్యమైన అధికరణలు, ప్రకరణలు వంటి వాటితోపాటు తాజా రాజ్యాంగ సవరణలు, వాటి ఉద్దేశం, ప్రభావం గురించి తెలుసుకోవాలి.

అర్థమెటిక్‌
అభ్యర్థులు అప్రమత్తంగా వ్యవహరించాల్సిన విభాగం.. అర్థమెటిక్‌ అండ్‌ టెస్ట్‌ ఆఫ్‌ రీజనింగ్‌. అర్థమెటిక్‌లోని సగటు, కసాగు, గసాభా, సంఖ్యలు, వర్గ మూలాలు, ఘన మూలాలు, నిష్పత్తులు, భాగస్వామ్యం, వయసు, శాతాలు, లాభ-నష్టాలు, చక్రవడ్డీ, సరళ వడ్డీ, కాలం-దూరం, కాలం-పని వంటి వాటిపై పట్టు సాధించాలి. అదే విధంగా మ్యాథమెటిక్స్‌లోని ప్రాథమిక అంశాలపైనా అవగాహన ఏర్పరచుకోవాలి. జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ, మ్యాట్రిసెస్, సెట్స్‌-రిలేషన్స్‌ను ప్రత్యేకంగా ప్రాక్టీస్‌ చేయాలి.

జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌
విశ్లేషణాత్మక దృక్పథంతో మంచి మార్కులు సొంతం చేసుకునే అవకాశం ఉన్న విభాగం రీజనింగ్‌. ఇందులో నంబర్‌ సిరీస్, మిస్సింగ్‌ నెంబర్స్, కోడింగ్‌-డీకోడింగ్, సీటింగ్‌ అరేంజ్‌మెంట్, బ్లడ్‌ రిలేషన్స్‌ వంటి వాటిపై పూర్తి అవగాహన ఏర్పరచుకోవాలి. వెన్‌ డయాగ్రమ్స్, అసెంప్షన్‌ అండ్‌ రీజన్, ఆర్గ్యుమెంట్, సిలాజిజమ్, డేటా సఫిషియన్సీ విభాగాల్లో పట్టుతో వెర్బల్‌ రీజనింగ్‌లో రాణించే అవకాశం ఉంది. దీంతోపాటు ఆడ్‌మన్‌ ఔట్, డైస్‌ అండ్‌ క్యూబ్స్, వెన్‌ డయాగ్రమ్స్‌లపై అవగాహన పెంచుకోవాలి. ఫలితంగా నాన్‌ వెర్బల్‌ రీజనింగ్‌లో వీలైనన్ని ఎక్కువ ప్రశ్నలకు సమాధానం ఇచ్చే నైపుణ్యం లభిస్తుంది. మెంటల్‌ ఎబిలిటీ విభాగంలో రాణించేందుకు టాబ్యులేషన్, డేటా సమీకరణ, డేటా విశ్లేషణలపై అవగాహన పెంచుకోవాలి.

క్లిష్టత స్థాయిలో వ్యత్యాసం
ఆర్‌పీఎఫ్‌ ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ రెండు పోస్ట్‌లకు సిలబస్‌ అంశాలు ఒకే విధంగా ఉన్నాయి. కాని పరీక్షలో ప్రశ్నల క్లిష్టత స్థాయిలో వ్యత్యాసం ఉంటుంది. ఎస్‌ఐ పోస్ట్‌ల పరీక్షలో క్లిష్టత ఎక్కువ ఉన్న ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. కానిస్టేబుల్‌ పోస్ట్‌లకు మాత్రం పదో తరగతి స్థాయిలో ప్రశ్నలు అడిగే వీలుంది. దీనికి అనుగుణంగా అభ్యర్థులు ఆయా అంశాలపై అవగాహన ఏర్పరచుకోవాలి.
 

చదవండి: Indian Railway Jobs: 5,696 పోస్ట్‌లకు నోటిఫికేషన్‌ విడుదల.. పరీక్ష విధానం, సిలబస్‌, ప్రిపరేషన్‌ గైడెన్స్...

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

sakshi education whatsapp channel image link

Published date : 21 Mar 2024 10:36AM

Photo Stories