Skip to main content

సివిల్స్ ప్రిలిమ్స్ వైఫల్యం..విజయానికి సోపానాలు..!

Failure is the stepping stone to success.. నిర్దేశించుకున్నలక్ష్యాన్ని చేరుకునేందుకు నిండైన ఆత్మవిశ్వాసంతో అడుగులేస్తున్నా ఏదో ఒకచోట ఆ అడుగు కాస్తా తడబడటం సర్వసాధారణం. అయితే ఆ తడబాటును సరిదిద్దుకొని, రెట్టించిన ఉత్సాహంతో మరో అడుగు ముందుకేస్తే వరించేది విజయమే! సివిల్స్ ప్రిలిమ్స్-2017 ఫలితాలతో నిరాశకు గురైనవారు.. ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ముందడుగేయాలి. ఒక పరాజయంతోనే సామర్థ్యం లేనట్టు కాదు! సాధనను మరికొంచెం సానపడితే.. లక్ష్యాన్ని కచ్చితంగా చేరుకోవచ్చు. ప్రిలిమ్స్-2018 తేదీ ఖరారైన నేపథ్యంలో... సివిల్స్ ప్రిలిమ్స్-2017లో అనుకున్నది సాధించలేని వారు సత్తా చాటేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై ఫోకస్..
సివిల్స్ తుది విజేతల్లో రిపీటర్స్ దాదాపు 40 శాతం ఉంటున్నారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) గత మూడేళ్లలో సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ఫలితాల విశ్లేషణతో విడుదల చేసిన గణాంకమిది! సివిల్స్-ప్రిలిమ్స్ 2017లో విజయం సాధించని అభ్యర్థులు ముందు దీన్ని గుర్తించాలి. లక్షల మంది పోటీ పడే సివిల్స్ పరీక్షలో సక్సెస్ రేట్ 30 నుంచి 40 శాతం మధ్యలోనే ఉంటోంది. కాబట్టి ఒక పరాజయంతో ప్రయాణాన్ని ఆపొద్దు.. దృఢ సంకల్పంతో ముందడుగేస్తే గమ్యాన్ని చేరడం ఏమంత కష్టం కాదు.

స్వీయ విశ్లేషణ...
అభ్యర్థులు ముందు.. ప్రిలిమ్స్ ఫలితాల్లో పొందిన మార్కులను.. పరీక్షలో చూపిన ప్రతిభను, చేసిన తప్పులను విశ్లేషించుకోవాలి. నిర్దిష్టంగా ఏయే అంశాలు విజయానికి దూరం చేశాయో వాటిని గుర్తించాలి. అప్పుడే వ్యక్తిగత సామర్థ్యాలపై అవగాహనతోపాటు ఏ సబ్జెక్టులో బలహీనంగా ఉన్నామో తెలుస్తుంది. దానికి అనుగుణంగా కొత్త అటెంప్ట్‌కు సన్నద్ధమవ్వాలి.
అభ్యర్థులు ప్రిలిమ్స్-2017 ఫలితాల ఆధారంగా బలహీనంగా ఉన్న సబ్జెక్టులపై దృష్టి పెట్టాలి. వాటికి సంబంధించి గతంలో చదివిన మెటీరియల్ నాణ్యతను పరిశీలించి.. అవసరమైతే మరో ప్రామాణిక మెటీరియల్‌ను ఎంపిక చేసుకోవాలి.

వెయిటేజీకి అనుగుణంగా..
అభ్యర్థుల్లో శాస్త్రీయ దృక్పథం లేకపోవడంతో ఫలితాలు ఆశాజనకంగా ఉండట్లేదు. ఈ క్రమంలో చాలా మంది అభ్యర్థులు ఒక అంశానికి సంబంధించిన సమాచార సేకరణ, అవగాహనకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే ఇప్పుడీ ఈ పద్ధతికి ఫుల్‌స్టాప్ పెట్టి.. గత పరీక్షల్లో ఒక సబ్జెక్టు లేదా అంశానికి సంబంధించి పరీక్షలో లభించిన వెయిటేజీని పరిగణనలోకి తీసుకొని తదుపరి అటెంప్ట్‌కు ప్రిపరేషన్ పరంగా ప్రాధాన్య క్రమాన్ని రూపొందించుకోవాలి.

ప్రిపరేషన్ శైలిలో మార్పు...
అభ్యర్థులు గత పరీక్షకు చదివిన విధానాన్ని ఒకసారి అవలోకనం చేసుకోవాలి. ఈసారి అధ్యయనం భిన్నంగా, మరింత ప్రొడక్టివ్‌గా ఉండేలా జాగ్రత్తపడాలి. ఏ అంశానైన్నా విభిన్న కోణాల్లో విశ్లేషించగలిగేలా అధ్యయనం చేస్తే పరీక్షలో తేలిగ్గా విజయం సాధించొచ్చని నిపుణులు, గత విజేతలు సూచిస్తున్నారు.

సమ ప్రాధాన్యం...
ప్రిపరేషన్‌కు సంబంధించి సబ్జెక్టుల మధ్య సమతుల్యత లోపించడం తుది ఫలితంపై ప్రభావం చూపుతోంది. కాబట్టి ప్రతి రోజు అన్ని సబ్జెక్టులను చదివేలా స్వీయ ప్రణాళిక రూపొందించుకోవాలి. అలా కుదరని పక్షంలో.. నిర్దిష్ట కాలానికి టైం ప్లాన్ రూపొందించుకుని రెండు దశల్లో అన్ని సబ్జెక్టుల అధ్యయనాన్ని పూర్తిచేయాలి.

మెయిన్స్ దృష్టితో..
‘ముందు ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణత సాధించేలా చదువుదాం, తర్వాత మెయిన్స్ సబ్జెక్టులపై దృష్టి పెడదాం’ అనే ధోరణికి స్వస్తి పలకాలి. ఇప్పటి నుంచే మెయిన్స్ దృక్పథంతో అధ్యయనం చేస్తే డిస్క్రిప్టివ్ అప్రోచ్ అలవడుతుంది. సివిల్స్ ప్రిలిమ్స్-2018ను వచ్చే ఏడాది జూన్ 3న నిర్వహించనున్నారు. దాదాపు తొమ్మిది నెలల సమయం అందుబాటులో ఉంది. కాబట్టి అభ్యర్థులు ఇప్పటి నుంచి ఏప్రిల్ చివరి వరకు మెయిన్ ఎగ్జామినేషన్ దృక్పథంతో ప్రిపరేషన్ సాగించాలి.

ఆప్షనల్ ఎంపికపై పునఃసమీక్ష...
వాస్తవానికి గత ప్రిలిమ్స్‌కు హాజరైన అభ్యర్థులు ఆప్షనల్‌పై స్పష్టతతో ఉంటారు. అయితే సదరు ఆప్షనల్ తమకు సరితూగుతుందా! లేదా? అని మరోసారి పునఃపరిశీలన చేయాలి. దానికి అనుగుణంగా ఆప్షనల్ సబ్జెక్టులో మార్పు, చేర్పులపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలి. ప్రిలిమ్స్, మెయిన్స్ ఉమ్మడి అంశాల ప్రిపరేషన్‌తోపాటు ఆప్షనల్ ప్రిపరేషన్‌ను కూడా కొనసాగించాలి.

ఇంటర్ రిలేటివ్ అప్రోచ్...
ప్రిలిమ్స్ ప్రిపరేషన్ దిశగా సాధారణంగా అధిక శాతం మంది అభ్యర్థులు చేసే పొరపాటు.. ప్రతి అంశాన్ని వేర్వేరుగా చదవడం. అలా కాకుండా అభ్యర్థులు శాస్త్రీయ దృక్పథంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇందులో భాగంగా అంతర్గత సంబంధం కలిగిన అంశాలను ఒకే సమయంలో చదివేలా ప్రణాళిక రూపొందించుకోవాలి. తద్వారా సమయం ఆదా అవడంతోపాటు రెండు అంశాల మధ్య ఉన్న సంబంధం, నేపథ్యాలను విశ్లేషించే నైపుణ్యం అలవడుతుంది. ఇది పరీక్షలో మంచి ప్రదర్శనకు దోహదపడుతుంది.

నిరంతర ప్రాక్టీస్...
సాధనతో సమకూరు సకలం అనే విషయాన్ని గుర్తించి కేవలం సబ్జెక్టు రీడింగ్‌కే పరిమితం కాకుండా ప్రాక్టీస్‌కు తగిన ప్రాధాన్యం ఇవ్వాలి. ‘సాధన’ విజయావకాశాలను ప్రభావితం చేసే అంశాల్లో ముందువరుసలో ఉంటుంది. దీన్ని గుర్తించి ప్రతి రోజు చదువుతున్న సబ్జెక్టు/అంశాలకు సంబంధించి నోట్స్ రూపొందించుకోవాలి. సమకాలీన అంశాలకు సంబంధించి దినపత్రికల్లో నిపుణులు రాసే ఎడిటోరియల్స్‌ను చదివి, వాటి సారాంశాన్ని గ్రహించి..సొంత శైలిలో ఎస్సే రాయటాన్ని సాధన చేయాలి. ఫలితంగా అభ్యర్థులకు సమాచార అవగాహనతోపాటు దాన్ని వ్యక్తీకరించే నైపుణ్యం కూడా లభిస్తుంది. ఇది మెయిన్ ఎగ్జామినేషన్ కోణంలో ఎంతో ఉపకరిస్తుంది. ప్రిలిమ్స్ కోణంలో క్విక్ రివిజన్‌కు దోహదపడుతుంది.

కరెంట్ అఫైర్స్...
ఇటీవల కాలంలో ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల్లో కరెంట్ అఫైర్స్ ఆధారిత ప్రశ్నల సంఖ్య, స్థాయి పెరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని.. కరెంట్ అఫైర్స్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. అయితే కరెంట్ అఫైర్స్‌కు సంబంధించి చాలా మంది గణాంక ఆధారిత సమాచారానికేప్రాధాన్యం ఇస్తున్నారు. దాంతో అనుకున్న స్థాయిలో మార్కులు పొందలేకపోతున్నారు. కాబట్టి గణాంకాలతోపాటు అనలిటికల్ అప్రోచ్‌తో కూడిన అధ్యయనాన్ని అలవరచుకోవాలి.

సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2018 షెడ్యూల్....
ప్రిలిమినరీ ఎగ్జామ్ నోటిఫికేషన్ విడుదల: ఫిబ్రవరి 7, 2018.
ప్రిలిమినరీ ఎగ్జామ్ దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 6, 2018.
ప్రిలిమినరీ ఎగ్జామ్ తేదీ: జూన్ 3, 2018.
మెయిన్స్ తేదీలు: అక్టోబర్ 1, 2018 నుంచి ఐదు రోజులు.=
వెబ్‌సైట్: www.upsc.gov.in

మానసిక స్థైర్యంతో ముందుకు..
ప్రిలిమ్స్‌లో విజయం సాధించని అభ్యర్థులు.. ‘ఫెయిల్యూర్ ఈజ్ ది స్టెప్పింగ్ స్టోన్’ అనే నానుడిని గుర్తించి మానసిక స్థైర్యంతో ఉండాలి. ఇక తదుపరి అటెంప్ట్ పరంగా అభ్యర్థులు చేయాల్సిన ముఖ్యమైన పని.. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ప్రిపరేషన్‌కు ఉపక్రమించడమే. గత అనుభవాన్ని, పరిస్థితులను బేరీజు వేసుకుని.. శిక్షణ తీసుకోవాలా? వద్దా? అనే విషయంపై నిర్ణయం తీసుకోవాలి. గత పరీక్షకు చదివిన మెటీరియల్‌ను మరోసారి అధ్యయనం చేసి అవసరమైతే మరో ప్రామాణిక మెటీరియల్‌ను ఎంపిక చేసుకోవాలి.
- శ్రీరామ్, డెరైక్టర్, శ్రీరామ్స్ ఐఏఎస్ అకాడమీ.
Published date : 19 Sep 2017 03:45PM

Photo Stories