Skip to main content

సివిల్స్ ప్రిలిమ్స్-2018.. తొలిమెట్టులో నెగ్గాలంటే?

‘2018, జూన్ 3.. సివిల్స్ ప్రిలిమ్స్-2018 పరీక్ష తేది. మొత్తం మూడంచెల ఎంపిక ప్రక్రియలో కీలకమైన తొలి దశ.. సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్..! ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ తదితర.. ఇరవై నాలుగు కేంద్ర సర్వీసుల్లో పోస్టుల భర్తీకి.. అదే విధంగా ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ నియామకాలకు చేపట్టే ఎంపిక ప్రక్రియలో తొలి దశ. ఈ తొలిదశ పరీక్షకు.. అందుబాటులో ఉన్న సమయం.. పదిహేను రోజులు మాత్రమే! దీంతో.. రిపీటర్స్ మొదలు ఫ్రెషర్స్ వరకు.. పరీక్షలో విజయం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. రోజురోజుకు పోటీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రిలిమ్స్ గట్టెక్కడం అభ్యర్థులకు సవాలుగా మారుతోంది. ఈ నేపథ్యంలో ప్రిలిమ్స్‌లో విజయం కోసం నిపుణుల సలహాలు, టాపర్స్ టిప్స్...
దేశవ్యాప్తంగా జరిగే సివిల్స్ ప్రిలిమ్స్‌కు పోటీ లక్షల్లోనే ఉంటుంది. ప్రిలిమ్స్‌లో నెగ్గితేనే తదుపరి దశ మెయిన్స్ కు హాజరయ్యేందుకు అర్హత లభిస్తుంది. తొలిదశ ప్రిలిమ్స్‌లో విజయం సాధిస్తే.. పది, పన్నెండు వేల మంది పోటీ పడే మెయిన్ పరీక్షను ఎదుర్కొనే ఆత్మవిశ్వాసం లభిస్తుంది. అందుకే అభ్యర్థులు ప్రిలిమ్స్‌లో విజయానికి గట్టిగా కృషిచేయాలి అన్నది నిపుణుల అభిప్రాయం. ప్రిలిమ్స్ సిలబస్‌లోని అధిక శాతం అంశాలు మెయిన్స్ లోనూ ఉంటాయి. కాబట్టి ప్రిలిమ్స్ కోసం సీరియస్‌గా చదివితే.. అది మెయిన్స్ కు కూడా ఉపయోగపడుతుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న పదిహేను రోజుల అమూల్యమైన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

పునశ్చరణకే ప్రాధాన్యం:
వాస్తవానికి సివిల్స్ లక్ష్యంగా చేసుకున్న సీరియస్ అభ్యర్థులు ఈపాటికే తమ ప్రిపరేషన్‌ను పూర్తి చేసుకుని ఉంటారు. సదరు అభ్యర్థులు ప్రస్తుత సమయంలో పేపర్-1 (జనరల్ స్టడీస్), పేపర్-2 (ఆప్టిట్యూడ్ టెస్ట్)లోని అంశాల పరంగా పూర్తిగా పునశ్చరణకే సమయం కేటాయించాలి. ఒకవేళ ఏదైనా ఒక అంశాన్ని ఇప్పటివరకు ఒక్కసారి కూడా చదవకుంటే ఆందోళన చెందకుండా.. మిగతా అంశాల్లో మరింత రాణించేందుకు కృషిచేయాలి. ఇప్పుడు కొత్త అంశాలు చదవాలనుకోవడం సరికాదు. ఎందుకంటే.. సదరు టాపిక్ క్లిష్టమైనదైతే.. దానికోసం ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తుంది. దానికారణంగా మిగతా సబ్జెక్ట్‌ల రివిజన్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అంతేకాకుండా ఇప్పుడు కొత్త టాపిక్‌ను చదవాలని భావిస్తే... అది మానసికంగా అనవసరపు ఆందోళనకు దారితీస్తుంది. ప్రస్తుత సమయంలో అభ్యర్థులు ప్రిపరేషన్/రివిజన్ కోణంలో.. అన్ని విభాగాలకు సమ ప్రాధాన్యం ఇచ్చేలా సమయం కేటాయించుకోవాలి. ప్రతి టాపిక్‌కు ప్రతిరోజు కనీసం గంటన్నర నుంచి రెండు గంటల సమయం కేటాయించుకోవాలి. ప్రతిరోజు ప్రిపరేషన్ ప్రారంభించే ముందు సదరు విభాగంలో అంతకుముందు రోజు చదివిన అంశాల్ని మరోసారి అవలోకనం చేసుకోవడం మేలు. ఫలితంగా ప్రిపరేషన్‌లో కంటిన్యూటీ ఉంటుంది.

ప్రీవియస్ పేపర్స్ :
ప్రస్తుత సమయంలో అభ్యర్థులు కనీసం గత నాలుగేళ్ల ప్రిలిమ్స్ పేపర్లను ప్రాక్టీస్ చేయాలి. ఈ ప్రాక్టీస్ పరంగా పరీక్షలో లభించే సమయ నిబంధనను తప్పనిసరిగా పాటించాలి. తద్వారా మూడు గంటల వ్యవధిలో ఎన్ని ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాం.. వాటిలో ఎన్ని సమాధానాలు సరైనవి? తప్పు సమాధానాల విషయంలో ఎక్కడ పొరపాటు జరిగింది? తదితర అంశాలపై స్వీయ విశ్లేషణ చేసుకోవచ్చు. ‘పొరపాటు’గా సమాధానాలు గుర్తించిన విషయంలో.. అవి.. సబ్జెక్ట్ నైపుణ్యం లేకుండా సమాధానం ఇచ్చినవా? లేదా వేగంగా సమాధానాలిచ్చే క్రమంలో చేసిన పొరపాటా? అనేది విశ్లేషించుకోవాలి. సబ్జెక్ట్ నైపుణ్యం లేకుండా ఇచ్చినవైతే.. సదరు టాపిక్‌ను పక్కన పెట్టడం మంచిది. అలాకాకుండా ఆ సబ్జెక్ట్‌లో ఇప్పుడు నైపుణ్యం పెంచుకోవాలని ప్రయత్నిస్తే అనవసరంగా ఒత్తిడి పెరిగిపోతుంది. అలాగే మాక్ టెస్ట్‌లకు హాజరవడం ద్వారా ఏ సబ్జెక్టుకు ఎంత ప్రాధాన్యం ఇవ్వాలో, చేస్తున్న పొరపాట్లు సరిదిద్దుకోవడం ఎలాగో తెలుస్తుంది.

కరెంట్ అఫైర్స్, పాలిటీ...
గత కొన్నేళ్ల ప్రిలిమ్స్ సరళిని పరిశీలిస్తే.. పేపర్-1లో కరెంట్ అఫైర్స్, పాలిటీ సంబంధిత ప్రశ్నలకు కొంత ఎక్కువ ప్రాధాన్యం లభిస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రెండు విభాగాలకు సంబంధించి పరిపూర్ణ అవగాహన సొంతం చేసుకోవాలి. ముఖ్యంగా ఇటీవల కాలంలో శాసన వ్యవస్థ ద్వారా చోటుచేసుకున్న కొత్త పరిణామాలు, చట్టాలపై అవగాహన ఉండాలి. అలాగే ప్రస్తుత సమయంలో ఆయా అంశాలకు సంబంధించిన బేసిక్స్‌పై పూర్తిస్థాయిలో పట్టుసాధించాలి. ముఖ్యంగా కోర్ సబ్జెక్టులుగా భావించే ఎకానమీ, పాలిటీ, జాగ్రఫీ విషయాల్లో ఇది ఎంతో ప్రధానం. ఫలితంగా.. ప్రశ్నను ఏ రీతిలో అడిగినా సమాధానం ఇచ్చే సంసిద్ధత లభిస్తుంది. గత నాలుగైదేళ్ల ప్రశ్న పత్రాలను పరిశీలిస్తే.. బేసిక్స్, కాంటెంపరరీ అంశాల సమ్మిళితంగా ప్రశ్నలు అడుగుతున్నారు. ప్రిలిమ్స్‌లో ఇటీవల కాలంలో కరెంట్ అఫైర్స్ సంబంధిత ప్రశ్నలకు ప్రాధాన్యం పెరిగిందన్నది వాస్తవం.

పేపర్-2ను కూడా ప్రాధాన్యంగానే..
ప్రిలిమ్స్ ఔత్సాహిక అభ్యర్థులు పేపర్-2 (ఆప్టిట్యూడ్ టెస్ట్)ను కూడా ప్రాధాన్యంగానే భావించాలి. ఈ పేపర్‌లో కనీసం 33 శాతం మార్కులు వస్తేనే పేపర్-1 (జనరల్ స్టడీస్)ను మూల్యాంకన చేస్తారు. పేపర్-1లో నిర్దేశిత కటాఫ్ మార్కులు సాధిస్తేనే మెయిన్‌కు అర్హత లభిస్తుంది. ఈ విషయాలను దష్టిలో పెట్టుకుని పేపర్-2లోని అంశాలకు కూడా ప్రతిరోజు కనీసం గంటన్నర సమయం కేటాయించాలి. ప్రధానంగా ఇంగ్లిష్ వొకాబ్యులరీ, బేసిక్ గ్రామర్, సెంటెన్స్ ఫార్మేషన్ తీరుపై అవగాహన పెంచుకోవాలి. రీడింగ్ కాంప్రెహెన్షన్ పరంగా ప్యాసేజ్ ఆధారిత ప్రశ్నల విషయంలో ఆయా ప్యాసేజ్‌లో ముఖ్యమైన పదాలు, సమాధానం ఇచ్చే క్రమంలో ఆ ముఖ్యమైన పదాలను అనుసంధానం చేసుకునే విధంగా నైపుణ్యం పొందాలి.

వారం రోజుల ముందు..
పరీక్షకు వారం రోజుల ముందు నుంచి పూర్తిగా ప్రాక్టీస్ టెస్ట్, మాక్‌టెస్ట్‌లకు సమయం కేటాయించడం మేలు. అదే విధంగా ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల్లో ఆయా అంశాలకు సంబంధించి బేసిక్స్, కాన్సెప్ట్‌లను, ఇప్పటికే ప్రిపరేషన్ సమయంలో తాము రాసుకున్న సినాప్సిస్‌ను చదవడానికే సమయం కేటాయించాలి. ఈ సమయంలో మెయిన్స్ ఓరియెంటేషన్‌తో ప్రిపరేషన్ సాగించడం సరికాదు. ముఖ్యంగా రిపీటర్స్ (గతంలో రాసి.. మళ్లీ హాజరవుతున్న అభ్యర్థులు) గతంలోనే చదివిన అంశాలే కదా ..! అనే దృక్పథంతో ఉండటం సరికాదు.

కీ వర్డ్స్ :
ప్రిలిమ్స్ ఔత్సాహిక అభ్యర్థులు నిర్దిష్టంగా ఒక ప్రశ్నలో ‘కీ’ వర్డ్స్‌ను గుర్తించే పరిజ్ఞానాన్ని అలవర్చుకోవాలి. ముఖ్యంగా ఇటీవల కాలంలో స్టేట్‌మెంట్ ఆధారిత ప్రశ్నలు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో.. ‘కీ’ వర్డ్స్‌ను గుర్తించే నైపుణ్యం పరీక్షలో విజయానికి దోహదపడుతుందని చెప్పొచ్చు.

ఎలిమినేషన్ టెక్నిక్ :
పరీక్ష హాల్లో అభ్యర్థులు, తమకు సమాధానం తెలియని ప్రశ్నలకు ఎలిమినేషన్ టెక్నిక్‌ను పాటించడం పరిపాటిగా మారింది. నెగెటివ్ మార్కింగ్ నిబంధనను గుర్తుంచుకోవాలి. ఒక ప్రశ్నను ఎలిమేషన్ టెక్నిక్‌లో సమాధానం ఇవ్వాలంటే.. తాము ఎంపిక చేసుకున్న ఆప్షన్ కోణంలో కనీసం 70 శాతం గ్యారెంటీ ఉంటే తప్ప ఈ టెక్నిక్‌ను వినియోగించకూడదని నిపుణుల అభిప్రాయం.

  • పస్తుతం అభ్యర్థులు రివిజన్‌లో అన్ని విభాగాలకు సమ ప్రాధాన్యం ఇచ్చేలా సమయం కేటాయించుకోవాలి. ప్రతి టాపిక్‌కు రోజూ కనీసం గంటన్నర నుంచి రెండు గంటల సమయం వెచ్చించాలి.
  • ఇలా...వ్యూహాత్మకంగా అడుగులు వేస్తే పదిహేను రోజుల్లో తమ నైపుణ్యాలకు మరింత పదును పెట్టుకుని.. ప్రిలిమ్స్‌లో విజయం సాధించి.. మెయిన్స్ దిశగా విజయావకాశాలు మెరుగుపరచుకోవచ్చు.

సివిల్స్ ప్రిలిమ్స్-2018 సమాచారం..
మొత్తం పోస్ట్‌లు:
782
పరీక్ష తేదీ: జూన్ 3, 2018.
పరీక్ష పేపర్లు: 2
మార్కులు: 400 (ఒక్కో పేపర్‌కు 200 మార్కులు).
సమయం: ఒక్కో పేపర్‌కు 2 గంటలు.
వెబ్‌సైట్: https://www.upsc.gov.in

రెండు పేపర్లు అటెంప్ట్ చేయండి
Career Guidance ప్రిలిమ్స్‌కు హాజరయ్యే అభ్యర్థుల్లో చాలా మంది చేసే పొరపాటు పేపర్-1 సరిగా రాయలేదని.. పేపర్-2కు హాజరు కాకపోవడం. కానీ ఇది ఏ మాత్రం సరికాదు. ఒక పేపర్‌కు హాజరై.. రెండో పేపర్‌ను రాయకపోయినా.. ఒక అటెంప్ట్ అయితే పోయినట్లే! కాబట్టి రెండు పేపర్లు రాయాలి. ఫలితంగా రెండో పేపర్‌లోనూ తమ వాస్తవ ప్రతిభ తెలుస్తుంది. ఈ అనుభవం తదుపరి అటెంప్ట్‌లో విజయానికి పాఠంగా మారుతుంది. అభ్యర్థులు రైటింగ్‌తోపాటు స్పీడ్ రీడింగ్‌ను కూడా అలవర్చుకోవాలి. దీనివల్ల ప్రశ్నలను వేగంగా అర్థం చేసుకునే నైపుణ్యం లభిస్తుంది. ఇది స్టేట్‌మెంట్, ప్యాసేజ్ ఆధారిత ప్రశ్నల విషయంలో ఎంతో కలిసొస్తుంది. పరీక్ష హాల్లో అన్ని పరీక్షలకు మాదిరిగానే సులువైన ప్రశ్నలతో సమాధానాలు ప్రారంభిస్తే మానసికంగా ఆందోళన లేకుండా ఉంటుంది.
- డి.అనుదీప్, ఆల్ ఇండియా టాపర్ (సివిల్స్-2017).

తొలి ప్రయత్నమైనా.. టెన్షన్ లేకుండా
Career Guidance అభ్యర్థులు తొలిసారి పరీక్ష రాస్తున్నా కూడా ఒత్తిడికి గురికాకుండా ప్రిపరేషన్ సాగించాలి. ఇప్పటికే రెండు, మూడుసార్లు హాజరైన వారిని చూసి ఆందోళన చెందడం సరికాదు. ఎన్ని రోజులు ప్రిపరేషన్ సాగించినా.. సబ్జెక్ట్‌పై ఎంత పట్టు సాధించినా.. పరీక్ష హాల్లో మూడు గంటల సమయంలో వ్యవహరించే తీరే విజయాన్ని నిర్దేశిస్తుంది. కాబట్టి పరీక్ష హాల్లో ప్రశ్నలను చూసి ఆందోళన చెందకుండా ప్రశాంతంగా సమాధానాలు గుర్తించే ప్రయత్నం చేయాలి.
- కె.శ్రీహర్ష, ఆరో ర్యాంకు (సివిల్స్-2017).
Published date : 17 May 2018 03:37PM

Photo Stories