Skip to main content

‘ప్రాథమికం’పై పట్టు.. గెలుపులో తొలిమెట్టు

సివిల్స్ ప్రిలిమ్స్ ప్రిపరేషన్ ప్లాన్
దేశవ్యాప్తంగా ఏటా లక్షల మంది సివిల్స్ ప్రిలిమ్స్కు హాజరైతే.. ఒక్కో ఖాళీకి 12 లేదా 13 మందిని ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కు ఎంపిక చేస్తారు. ఇందులో మీరు ఒక్కరిగా నిలవాలంటే.. నిరంతర శ్రమ, లక్ష్యాన్ని చేరుకోవాలనే నిబద్ధత, అన్నింటికంటే ముఖ్యంగా సివిల్స్ సాధించగలమనే సానుకూల దృక్పథం ఉండాలి. ఏటేటా పెరుగుతున్న పోటీ.. ఇటు సంప్రదాయ డిగ్రీ కోర్సులు మొదలు అటు ఇంజనీరింగ్ వంటి ప్రొఫెషనల్ కోర్సులు చదివిన విద్యార్థులు.. పీహెచ్డీ అభ్యర్థులు సైతం సివిల్స్కు పోటీపడుతున్నారు. ఈ నేపథ్యంలో పోటీని చూసి ఆందోళన చెందడం సహజం. పోటీ, పరీక్ష క్లిష్టత విషయంలో అభ్యర్థులందరిదీ ఒకటే పరిస్థితి అని గుర్తిస్తే.. ఇక విజయం వైపు ముందుకు సాగొచ్చు.

పేపర్ 1
క్లిష్టమైంది మొదటి పేపరే!

చాలామంది అభ్యర్థులకు రెండో పేపర్ గురించే ఆందోళన, భయం. వాస్తవానికి ప్రిలిమ్స్ ప్యాట్రన్ మారాక మొదటి పేపరే క్లిష్టంగా మారిందని, కటాఫ్ పర్సంటేజ్ 40కి మించట్లేదన్నది నిపుణుల విశ్లేషణ. ఇందుకు ప్రధాన కారణం ప్రశ్నలు అడిగే తీరు మారడం. సంఘటనలు-సంవత్సరాల పద్ధతికి స్వస్తిపలికి.. వినూత్న తరహాలో స్టేట్మెంట్స్, మ్యాచింగ్స్, అసెర్షన్ అండ్ రీజన్ ప్రశ్నల సంఖ్య పెరగడమే. మరోవైపు ఇప్పటికీ అభ్యర్థులు ఆందోళన చెందుతున్న రెండో పేపర్ ఆప్టిట్యూడ్ టెస్ట్. ఇందులో రాణించాలంటే..ఇంగ్లిష్ కాంప్రెహెన్షన్, నిర్ణయాత్మక సామర్థ్యం పెంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

అప్లికేషన్ ఓరియెంటెడ్గా..
ప్రిలిమ్స్ ప్రిపరేషన్ పరంగా అభ్యర్థులు అలవర్చుకోవాల్సిన ప్రథమ లక్షణం.. ప్రతి అంశాన్ని అప్లికేషన్ ఓరియెంటేషన్తో పరిశీలించి చదవడం. సాధారణంగా హిస్టరీ, పాలిటీ, ఎకానమీ తదితర జనరల్ స్టడీస్ సబ్జెక్టులను ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ అనే ఆలోచనతో ప్రిపరేషన్ సాగిస్తారు. కానీ ప్రిలిమ్స్ ప్యాట్రన్ మారినప్పటి నుంచి యూపీఎస్సీ ప్రశ్నలు అడిగే తీరు కూడా మారింది. కోర్ సబ్జెక్టులైన హిస్టరీ, ఎకానమీ, పాలిటీల్లో సైతం అప్లికేషన్ ఓరియెంటెడ్ ప్రశ్నలకు ప్రాధాన్యం పెరిగింది. ఇక్కడ.. అప్లికేషన్ ఓరియెంటేషన్ అంటే.. ఒక నిర్దిష్ట అంశాన్ని వర్తమాన సమాజంతో అన్వయించుకుంటూ చదవడమే. ఒక అంశాన్ని అప్లికేషన్ ఓరియెంటేషన్లో అవగాహన చేసుకునేందుకు సంబంధిత సబ్జెక్ట్లో ఫండమెంటల్స్పై పట్టు సాధించాలి. ఫండమెంటల్స్పై పట్టు సాధిస్తే.. అప్లికేషన్ ఓరియెంటేషన్కు మార్గం సుగమమవుతుంది. ఇందుకోసం అభ్యర్థులు ఆరు నుంచి 12వ తరగతి వరకు ఎన్సీఈఆర్టీ పుస్తకాలు, ఐసీఎస్ఈ పుస్తకాలు చదవడం మేలు చేస్తుంది.

సమకాలీనంపై ఫోకస్:
ప్రిలిమ్స్ అభ్యర్థులు గుర్తించాల్సిన మరో ప్రధానాంశం- సమకాలీన అంశాలకు సంబంధించిన ప్రశ్నల సంఖ్య పెరుగుతుండటం. ప్రిలిమ్స్ ప్యాట్రన్ మారకముందు ఆయా సబ్జెక్టుల బేసిక్స్, ఫ్యాక్ట్స్, ఫిగర్స్పై ప్రశ్నలు కనిపించేవి. కానీ ప్యాట్రన్ మారాక సమకాలీన అంశాల నుంచి అడిగే ప్రశ్నలు పెరిగాయి. అంతేకాక ఆ సమకాలీన ప్రశ్నలను కూడా కోర్ సబ్జెక్ట్తో కలిపి అడగడం సాధారణమైంది. కాబట్టి ప్రతి సబ్జెక్ట్లోనూ కోర్ ఏరియాస్ను చదివేటప్పుడు.. వాటికి సంబంధించిన ప్రస్తుత పరిణామాలేంటి? అనే కోణంలో కూడా ప్రిపరేషన్ సాగించాలి.

విశ్లేషణాత్మక దృక్పథం:
ప్రిలిమ్స్ ప్రిపరేషన్ సమయంలో ప్రతి అంశాన్ని విశ్లేషణాత్మక దృక్పథంతో చదవడం మేలు. ఉదాహరణకు పర్యావరణం అనే అంశాన్ని చదువుతున్నప్పుడు ప్రస్తుత సమస్యలు, ప్రభావాలు, విపత్తు నిర్వహణ.. ఇలా పలు కోణాల్లో విశ్లేషించుకుంటూ సాగాలి. ఇదే వ్యూహాన్ని కోర్ సబ్జెక్టులైన హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీలకు కూడా వర్తింపజేయాలి. ఉదాహరణకు ఎకానమీలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అనే అంశాన్ని పరిశీలించే క్రమంలో.. దేశ ఆర్థికాభివృద్ధి విషయంలో ఎఫ్డీఐల పాత్ర, ఆయా రంగాల్లో వృద్ధి రేట్లను బేరీజు వేస్తూ చదవాలి. దాంతోపాటు ప్రిలిమ్స్ పరీక్ష ఆబ్జెక్టివ్ పద్ధతిలో బహుళైచ్ఛిక విధానంలో జరిగినా.. అభ్యర్థులు తమ ప్రిపరేషన్ను మాత్రం డిస్క్రిప్టివ్ దృక్పథంతో సాగించాలి. అప్పుడే అన్ని అంశాలపై సమగ్ర అవగాహన ఏర్పడుతుంది. తద్వారా ఒక అంశంపై ఏ మూల నుంచి ప్రశ్న అడిగినా.. సమాధానం ఇచ్చే సామర్థ్యం సొంతమవుతుంది.

సబ్జెక్ట్లతో సమన్వయం:
ప్రస్తుత ప్రిలిమ్స్ ప్రశ్నల తీరును విశ్లేషిస్తే.. అన్ని సబ్జెక్టులను సమన్వయం చేసుకుంటూ ప్రిపరేషన్ సాగించడం తప్పనిసరి. ముఖ్యంగా పాలిటీ, ఎకానమీ సబ్జెక్టుల మధ్య తులనాత్మక, అనుసంధానం ప్రిపరేషన్ విజయంలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రభుత్వం రూపొందించే పలు సంక్షేమ పథకాలు పాలిటీ పరిధిలో ఉంటే.. వాటికి సంబంధించిన ప్రగతి గణాంకాలు ఎకానమీ పరిధిలోకి వస్తాయి. అభ్యర్థులు దీన్ని దృష్టిలో పెట్టుకుని చదవాలి. మెయిన్స్లో జనరల్ స్టడీస్లో పేర్కొన్న అంశాలన్నీ దాదాపు ప్రిలిమ్స్లో ఉన్నవే. కాబట్టి ప్రిలిమ్స్కు ప్రిపరేషన్ సాగించేటప్పుడే సదరు అంశంలో జనరల్ స్టడీస్ సిలబస్ను కూడా పరిశీలించి ప్రిలిమ్స్, మెయిన్స్ రెండింటిలో ఉన్న అంశాలను పూర్తి చేసుకోవచ్చు.

పాత ప్రశ్నపత్రాలు.. గెలుపు సాధనాలు:
ప్రిలిమ్స్ అభ్యర్థులు గత పదేళ్ల ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేయడం ఎంతో ఉపయుక్తం. దీనివల్ల ఒక నిర్దిష్ట అంశంపై ప్రశ్నలు అడిగే తీరులో మార్పులు, ఎన్ని కోణాల్లో సదరు అంశం నుంచి ప్రశ్నలు అడగొచ్చు వంటి విషయాల్లో అవగాహన వస్తుంది.

పేపర్ 2
ఆప్టిట్యూడ్పై ఆందోళన వద్దు:
ప్రిలిమ్స్ రెండో పేపర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ విషయంలో అభ్యర్థుల్లో విపరీతమైన ఆందోళన నెలకొంది. ముఖ్యంగా ఈ పేపర్ టెక్నికల్, మ్యాథ్స్ నేపథ్యం వారికి అనుకూలమనే భావనతో నాన్-మ్యాథ్స్, హ్యుమానిటీస్ అభ్యర్థులు ముందుగానే కుంగిపోతున్నారు. కాంప్రెహెన్షన్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ కాంప్రెహెన్షన్, లాజికల్ రీజనింగ్ అండ్ అనలిటికల్ ఎబిలిటీ, డెసిషన్ మేకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, జనరల్ మెంటల్ ఎబిలిటీ, బేసిక్ న్యూమరసీ అంశాలతో ఉండే ఈ పేపర్లో జనరల్ మెంటల్ ఎబిలిటీ, బేసిక్ న్యూమరసీ మాత్రమే మ్యాథ్స్తో సంబంధం కలిగి ఉన్నాయి. అవి కూడా ప్యూర్ మ్యాథ్స్ కాకుండా.. పదో తరగతి స్థాయిలో అర్థమెటిక్, న్యూమరికల్ స్కిల్స్ ఉన్న ప్రతి విద్యార్థి సాధించే విధంగానే ఉన్నాయి. అంతేకాకుండా వాటి ప్రశ్నల సంఖ్య కూడా తక్కువగానే ఉంటోంది.

కాంప్రెహెన్షన్ + డెసిషన్ మేకింగ్:
రెండో పేపర్లో ఎక్కువ వెయిటేజీ లభిస్తున్న విభాగాలు కాంప్రహెన్షన్, డెసిషన్ మేకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఈ నేపథ్యంలో అభ్యర్థులు ఇంగ్లిష్ వొకాబ్యులరీ, స్పీడ్ రీడింగ్, సమయస్ఫూర్తి వంటి లక్షణాలు అలవర్చుకోవాలి. వొకాబ్యులరీ, స్పీడ్ రీడింగ్ కోసం నిరంతరం ప్రామాణిక ఇంగ్లిష్ దినపత్రికలు వాటిలోని వ్యాసాలు, వాక్య నిర్మాణాలు, వినియోగించిన పదాలు గుర్తించి, వీలైతే సొంతంగా సారాంశాన్ని రాసుకోవడం మేలు చేస్తుంది. కాంప్రెహెన్షన్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ కాంప్రెహెన్షన్కు సంబంధించి అడిగే ప్యాసేజ్ ఆధారిత ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలంటే.. ప్రశ్నలోని కీలక పదాన్ని గుర్తించే నేర్పు సొంతం చేసుకోవాలి. దీనికి మార్గం నిరంతర ప్రాక్టీసేనని నిపుణులు సూచిస్తున్నారు.

ప్రిపరేషన్ టిప్స్
ఇప్పుడే ప్రిపరేషన్ మొదలు పెట్టిన అభ్యర్థులు తొలుత ఎన్సీఈఆర్టీ 11, 12 తరగతుల పుస్తకాలను చదవాలి. దీనివల్ల బేసిక్స్పై అవగాహన ఏర్పడుతుంది. ఈ ప్రక్రియను 20 రోజుల్లోపు ముగించాలి.
తర్వాత పాత ప్రశ్నపత్రాలను పరిశీలించాలి.
చివరి అటెంప్ట్ అభ్యర్థులు ప్రస్తుత సమయంలో కొత్త అంశాల జోలికి వెళ్లకుండా రివిజన్కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి.
పరీక్ష తేదీకి 15రోజుల ముందు ప్రిపరేషన్ ముగించి ప్రాక్టీస్ టెస్ట్లు, మాక్ టెస్ట్లకు హాజరు కావాలి.
ముఖ్యంగా రెండో పేపర్ విషయంలో ప్రాక్టీస్ టెస్ట్లు తప్పనిసరి.
ఏప్రిల్ 15 వరకు నిరంతరం ప్రామాణిక దిన పత్రికలు చదవాలి. ఏప్రిల్ 15కు ముందు గడిచిన ఏడాది కాలంలో ముఖ్య సంఘటనలపై అవగాహన ఏర్పరచుకోవాలి.
ఇయర్ బుక్స్, కరెంట్ అఫైర్స్ స్పెషల్స్ చదవాలి.

రివిజన్కు ప్రాధాన్యం
ప్రస్తుత సమయంలో అభ్యర్థులు రివిజన్కు ప్రాధాన్యం ఇవ్వాలి. పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ ఉన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రిపరేషన్ సాగించాలి. ప్రిపరేషన్ సమయంలో ముందుగా సులభంగా ఉన్న అంశాలను పూర్తిచేసుకుని, తర్వాత క్లిష్టమైన అంశాలపై ఎక్కువ సమయం కేటాయించాలి. పేపర్-2 విషయంలో ఆందోళన అనవసరం. వొకాబ్యులరీ, రీడింగ్ ప్రాక్టీస్ చేస్తే ఈ పేపర్లో రాణించడం సులువే.
- మల్లికార్జున్, ఐఏఎస్, 2011 విజేత

స్మాల్ టు బిగ్
ప్రస్తుత అభ్యర్థులు ప్రిపరేషన్ను చిన్న అంశాలతో మొదలు పెట్టి క్రమేణా క్లిష్టమైన అంశాలవైపు సాగాలి. ముఖ్యంగా పేపర్-2 విషయంలో ఈ వ్యూహం కలిసొస్తుంది. ప్రీవియస్ కొశ్చన్ పేపర్స్ను ప్రాక్టీస్ చేయడం, న్యూస్ పేపర్ రీడింగ్, రివిజన్లు సక్సెస్ మంత్రాలు. కరెంట్ అఫైర్స్ కోసం జనవరి నుంచి మార్చి వరకు జరిగిన పరిణామాలపై ప్రధానంగా దృష్టి పెట్టాలి.
- ఎస్. రాఖి మయూరి, ఐఎఫ్ఎస్, 2011 విజేత

బేసిక్స్ బలంగా ఉండాలి
అన్ని సబ్జెక్టుల బేసిక్స్లో లోతైన అవగాహన ఏర్పరచుకోవాలి. ప్రతి రోజు ఇంగ్లిష్ దినపత్రికలను చదవుతూ కరెంట్ అఫైర్స్ కోణంలో ముఖ్యాంశాలను నోట్స్ రూపంలో రాసుకోవాలి. పేపర్-2 కోసం ప్యాసేజ్ రీడింగ్పై దృష్టి పెట్టాలి. తర్వాత తాము బలహీనంగా ఉన్న ఇతర అంశాలకు కేటాయించాలి. ఇలా వ్యూహాత్మకంగా కదిలితే విజయం సులభమే.
-టి.వి. వంశీధర్, ఐఆర్ఎస్, సివిల్స్ 2011 విజేత

రిఫరెన్స్ బుక్స్
పేపర్-1
ఎన్సీఈఆర్టీ ఆరు నుంచి 12 వరకు పుస్తకాలు
ఇండియా ఇయర్ బుక్; యోజన, కురుక్షేత్ర, సైన్స్ స్పెక్ట్రమ్ మ్యాగజైన్లు
హిస్టరీ: ఆధునిక భారత దేశ చరిత్రబిపిన్ చంద్ర; ఇండియా స్ట్రగుల్ ఫర్ ఫ్రీడంబిపిన్ చంద్ర; మో డ్రన్ ఇండియన్ హిస్టరీ - గ్రోవర్ అండ్ మెహతా.
ఎకానమీ: ఇంటర్మీడియెట్ సెకండియర్ బుక్స్; ఇండియన్ ఎకానమీ మిశ్రా అండ్ పూరీ; మాక్రో ఎకనామిక్స్, ఎకనామిక్స్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ ప్లానింగ్ ఎం.ఎల్. జింగన్
జాగ్రఫీ: అట్లాస్తోపాటు ఎన్సీఈఆర్టీ పుస్తకాలు
పాలిటీ: బీఏ ద్వితీయ సంవత్సరం పుస్తకాలు; ఇంట్రడక్షన్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్ - డి.డి. బసు

పేపర్-2
వెర్బల్ రీజనింగ్ - కాప్లా
వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ రీజనింగ్ - ఆర్.ఎస్. అగర్వాల్
సీశాట్- హారిజాన్ పబ్లికేషన్స్
Published date : 26 May 2020 04:43PM

Photo Stories