KVPY Fellowships: సైన్స్ విద్యార్థులకు ప్రోత్సాహం.. నెలకు రూ.7 వేల ఫెలోషిప్..
కేవీపీవై.. కిశోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన! బేసిక్ సైన్సెస్‌లో.. ఉన్నత విద్య, పరిశోధనల దిశగా.. ఆసక్తి ఉన్న ప్రతిభావంతులకు అరుదైన అవకాశం.. కేవీపీవై! ఈ పరీక్షలో రాణిస్తే.. బ్యాచిలర్ డిగ్రీ స్థాయి నుంచే ప్రతి నెల ఆర్థిక ప్రోత్సాహకం అందుకోవచ్చు!! అంతేకాకుండా భవిష్యత్తులో.. పరిశోధనల్లో ముందుండేలా.. నైపుణ్యాలు పెంచుకునేందుకు మార్గం సుగమం అవుతుంది!! కేంద్ర ప్రభుత్వ డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో.. ప్రతిఏటా నిర్వహించే పరీక్ష.. కిశోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన! తాజాగా 2021 సంవత్సరానికి సంబంధించి.. కేవీపీవై పరీక్ష ఈ నెల 22న జరగనుంది. ఈ నేపథ్యంలో.. జాతీయ స్థాయిలో నిర్వహించే కేవీపీవైతో ప్రయోజనాలు, అర్హతలు, ఈ పరీక్షలో విజయానికి మార్గాలు తదితర అంశాలపై విశ్లేషణ...
- ఈ నెల 22న కేవీపీవై–2021 ఆప్టిట్యూడ్ టెస్ట్
- పరీక్షలో ఉత్తీర్ణతతో డిగ్రీ స్థాయి నుంచే ఫెలోషిప్
- ఇంటర్, డిగ్రీ అర్హతగా కేవీపీవై నిర్వహణ
- సైన్స్, మ్యాథమెటిక్స్ బేసిక్స్‌పై పట్టుతో విజయం
విద్యార్థులు బేసిక్ సైన్సెస్ దిశగా అడుగులు వేసేలా చూడాలి. ఇందుకోసం వారిని పాఠశాల స్థాయి నుంచే ప్రోత్సహించాలి. ఫలితంగా సైన్స్ పట్ల సహజంగానే ఆసక్తి పెరిగి..పరిశోధనల్లో పాల్పంచుకుంటారని విద్యావేత్తలు సూచిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా విద్యార్థులు సైన్స్ కోర్సుల్లో చేరేలా ప్రోత్సహించేందుకు.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకమే.. కిశోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన (కేవీపీవై). ఈ పథకానికి అర్హులను ఎంపిక చేసేందుకు ప్రతిఏటా దేశవ్యాప్తంగా ఆప్టిట్యూడ్ టెస్ట్‌ను నిర్వహిస్తారు. ఈ పరీక్షలో స్కోర్, మెరిట్ ఆధారంగా బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో సైన్స్, మ్యాథమెటిక్స్; ఇంటిగ్రేటెడ్ పీజీ సైన్స్ కోర్సుల్లో చేరిన వారికి ఆర్థిక ప్రోత్సాహం అందిస్తారు. 1999లో ప్రారంభమైన ఈ పథకానికి ప్రతి ఏటా ఆదరణ పెరుగుతోంది. ఈ నెల 22 నిర్వహించనున్న కేవీపీవై–2021కు దేశవ్యాప్తంగా వేల మంది విద్యార్థులు హాజరవుతున్నట్లు సమాచారం.
మూడు స్ట్రీమ్‌లు
కిశోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన పరీక్షను మొత్తం మూడు స్ట్రీమ్‌లలో నిర్వహిస్తారు. అవి.. స్ట్రీమ్–ఎస్‌ఏ, స్ట్రీమ్–ఎస్‌ఎక్స్, స్ట్రీమ్–ఎస్‌బీ. ప్రతి స్ట్రీమ్‌కు వేర్వేరుగా విద్యార్హతలను పేర్కొన్నారు. ఆ వివరాలు...
స్ట్రీమ్ ఎస్‌ఏ
కేవీపీవై నోటిఫికేషన్ వెలువడే సంవత్సరంలో.. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ.. గ్రూప్ సబ్జెక్ట్‌లుగా ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరంలో చేరిన విద్యార్థులు స్ట్రీమ్–ఎస్‌ఏకు అర్హులవుతారు. అంటే.. కేవీపీవై–2021నే పరిగణనలోకి తీసుకుంటే..2021–22లో ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరంలో పైన పేర్కొన్న గ్రూప్ సబ్జెక్ట్‌లతో చదువుతున్న వారు అర్హులు. వీరు 2023–24లో బేసిక్ సైన్స్ విభాగాల్లో(బీఎస్సీ/బ్యాచిలర్ ఆఫ్ సైన్స్/బ్యాచిలర్ ఆఫ్ స్టాటిస్టిక్స్/బ్యాచిలర్æఆఫ్ మ్యాథమెటిక్స్/ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ/ఇంటిగ్రేటెడ్ ఎంఎస్) బ్యాచిలర్ డిగ్రీలో ప్రవేశం ఖరారు చేసుకోవాలి. ఇలా ప్రవేశం పొంది కేవీపీవై–2021 ఆపిట్యూడ్ టెస్ట్‌లో తుది జాబితాలో నిలిచిన వారికి మాత్రమే ఫెలోషిప్ అందిస్తారు.
స్ట్రీమ్ ఎస్‌ఎక్స్
మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్ట్‌లతో ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న వారు స్ట్రీమ్ ఎస్‌ఎక్స్‌కు అర్హత పొందుతారు. 2021–22లో ద్వితీయ సంవత్సరం చదువుతున్నవారికి.. కేవీపీవై–2022కు అర్హత ఉంటుంది. వీరు 2022–23 విద్యా సంవత్సరంలో తప్పనిసరిగా బీఎస్సీ/బ్యాచిలర్ ఆఫ్ సైన్స్/ బ్యాచిలర్ ఆఫ్ స్టాటిస్టిక్స్/బ్యాచిలర్ ఆఫ్ మ్యాథమెటిక్స్/ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ/ ఇంటిగ్రేటెడ్ ఎంఎస్ కోర్సుల్లో ప్రవేశం ఖరారు చేసుకోవాలి. అప్పుడే కేవీపీవై ఉత్తీర్ణత ఆధారంగా ఫెలోషిప్ అందిస్తారు.
స్ట్రీమ్ ఎస్‌బీ
సైన్స్ గ్రూప్‌లతో ఇంటర్మీడియెట్ పూర్తి చేసుకొని.. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో బ్యాచిలర్ డిగ్రీ కోర్సుల్లో(బీఎస్సీ/బీఎస్/బీస్టాట్/బీమ్యా«థ్స్, ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ/ఎంఎస్) ప్రవేశం పొందేవారికి స్ట్రీమ్ ఎస్‌బీకి అర్హత లభిస్తుంది.
వేర్వేరుగా పరీక్ష విధానం
మొత్తం మూడు స్ట్రీమ్‌లుగా నిర్వహించే కేవీపీవైలో... ప్రతి స్ట్రీమ్‌కు పరీక్ష విధానం, మార్కుల విధానం వేర్వేరుగా ఉంటుంది. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు..
స్ట్రీమ్ ఎస్‌ఏ
- స్ట్రీమ్–ఎస్‌ఏ పరీక్షను పార్ట్–ఎ,పార్ట్–బి పేరుతో.. రెండు పార్ట్‌లుగా 100 మార్కులకు నిర్వహిస్తారు.
- పార్ట్–ఎలో 60 ప్రశ్నలు, పార్ట్–బిలో 20 ప్రశ్నలను అడుగుతారు.
- పార్ట్–ఎలో మ్యాథమెటిక్స్–15, ఫిజిక్స్–15, కెమిస్ట్రీ–15, బయాలజీ–15 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయించారు.
- పార్ట్–బిలో మ్యాథ్స్–5, ఫిజిక్స్–5, కెమిస్ట్రీ–5, బయాలజీ–5 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు కేటాయించారు.
- నెగెటివ్ మార్కింగ్(0.25 మార్కులు) నిబంధన ఉంది.
స్ట్రీమ్ ఎస్‌ఎక్స్
- స్ట్రీమ్ ఎస్‌ఎక్స్, స్ట్రీమ్ ఎస్‌బీ పరీక్ష రెండు పార్ట్‌లుగా 160 మార్కులకు నిర్వహిస్తారు. పార్ట్–ఎ నుంచి 80 ప్రశ్నలు, పార్ట్–బి నుంచి 40 ప్రశ్నలను అడుగుతారు.
- పార్ట్–ఏలో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీల నుంచి 20 ప్రశ్నలు చొప్పున 80 ప్రశ్నలు ఉంటాయి. అభ్యర్థులు ఏవైనా మూడు విభాగాలను ఎంచుకోవాల్సి ఉంటుంది.
- పార్ట్–బీలో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీల నుంచి 10 ప్రశ్నలు చొప్పున 40 ప్రశ్నలు అడుగుతారు. అభ్యర్థులు ఏవైనా రెండు సబ్జెక్ట్‌లు ఎంచుకోవాలి.
మెరిట్ జాబితా..ఇలా
పరీక్షకు హాజరైన అభ్యర్థులు చూపిన ప్రతిభ, పొందిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా రూపొందిస్తారు. ముందుగా పరీక్షలో కనీసం 45 శాతం మార్కులు సాధించాలనే నిబంధన ఉంది. నిర్ణీత కటాఫ్ శాతంతో ఉత్తీర్ణత పొందిన వారినే తుది జాబితా రూపకల్పనకు పరిగణనలోకి తీసుకుంటారు. ఆ తర్వాత మెరిట్ ప్రకారం– విద్యార్థులను షార్ట్‌లిస్ట్ చేసి.. ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూలో ఎంపికైతే ఉపకార వేతనానికి అర్హత సాధించినట్లే.
ఆర్థిక ప్రోత్సాహకం
- కేవీపీవైకు ఎంపికై పేర్కొన్న సబ్జెక్ట్‌లతో బ్యాచిలర్ డిగ్రీ, ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ, ఎమ్మెస్ కోర్సుల్లో చేరిన వారికి ప్రతి నెల ఆర్థిక ప్రోత్సాహకం అందిస్తారు.
- బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో మూడేళ్లపాటు ప్రతి నెల రూ.5వేల ఫెలోషిప్, ఏడాదికి రూ.20వేల కాంటింజెన్సీ గ్రాంట్ కింద మంజూరు చేస్తారు.
- ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ, ఎంఎస్, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ కోర్సుల్లో చేరిన వారికి నాలుగు, అయిదు సంవత్సరాల్లో నెలకు రూ.ఏడు వేల ఫెలోషిప్, ఏడాదికి రూ.28 వేల కాంటింజెన్సీ గ్రాంట్ అందిస్తారు.
ఫెలోషిప్ కొనసాగింపు
- కేవీపీవై ఆప్టిట్యూడ్ టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధించి.. ఫెలోషిప్‌నకు ఎంపికైన వారు.. ఆయా కోర్సుల్లో చేరిన తర్వాత అకడమిక్‌గా నిర్ణీత మార్కులతో రాణిస్తేనే ఫెలోషిప్‌ను కొనసాగిస్తారు. బ్యాచిలర్ డిగ్రీలో ప్రతి సంవత్సరం కనీసం 60 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది.
- ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు కనీసం 50 శాతం మార్కులు ఉండాలి.
- నిర్దేశిత శాతం మార్కులు సాధించకుంటే.. తరువాత సంవత్సరం స్కాలర్‌షిప్‌ను కొనసాగించరు.
Science & Technology
వేసవి శిక్షణ శిబిరం
కేవీపీవై ఫెలోషిప్‌నకు ఎంపికైన వారికి అందుబాటులో ఉండే మరో ప్రత్యేక అవకాశం.. సమ్మర్ క్యాంప్. అంటే.. విద్యార్థులు వేసవి సెలవుల్లో ఐఐటీలు వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో సమ్మర్ క్యాంపులకు హాజరయ్యే అవకాశం లభిస్తుంది. అదే విధంగా సదరు విద్యార్థులు వేసవి సెలవుల్లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ క్యాంపస్‌లు; ఐఐఎస్‌సీ–బెంగళూరులో రెండు వారాల వ్యవధి గల సమ్మర్ వెకేషన్ ప్రోగ్రాం నిర్వహిస్తారు. ఈ సమయంలో ఆయా ఇన్‌స్టిట్యూట్‌లలోని నిపుణుల ద్వారా బోధన కార్యక్రమాలు ఉంటాయి. దీంతోపాటు విద్యార్థులు సదరు ఇన్‌స్టిట్యూట్‌లలో నిర్వహించే సైన్స్ రీసెర్చ్ కార్యకలాపాలను ప్రత్యక్షంగా చూసే అవకాశం కూడా లభిస్తుంది.
నైపుణ్యాలు పరీక్షించేలా
కేవీపీవై ఆప్టిట్యూడ్ టెస్ట్‌లో అడిగే ప్రశ్నలు ఆయా సబ్జెక్ట్‌లలో విద్యార్థుల అకడమిక్ నైపుణ్యాన్ని పరీక్షించే విధంగా ఉంటాయి. ప్రశ్నల క్లిష్టత దాదాపు జేఈఈ మాదిరిగానే ఉంటుంది. కాబట్టి ఈ పరీక్షలో రాణించేందుకు విద్యార్థులు ఆయా సబ్జెక్ట్‌లకు సంబంధించిన కాన్సెప్ట్‌లపై అవగాహన పెంచుకోవాలి. ఆయా కాన్సెప్ట్‌ల అప్లికేషన్ తీరుపైనా పరిపూర్ణత సాధించాలి. అకడమిక్ పుస్తకాలతోపాటు ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు చదివితే.. ప్రాథమిక భావనలపై స్పష్టత వస్తుంది.
ఆ పోటీ పరీక్షలతోపాటే
ఇంటర్మీడియెట్ విద్యార్థులు ఎంసెట్, జేఈఈ వంటి పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతుంటారు. ఇలాంటి వారు ఆ ప్రిపరేషన్‌ను కేవీపీవై ఆప్టిట్యూడ్ టెస్ట్‌కు కూడా అన్వయించుకునే విధంగా వ్యవహరించాలి. కేవీపీవై ఆప్టిట్యూడ్ టెస్ట్ సిలబస్‌లో దాదాపు అన్ని అంశాలు అకడమిక్ సిలబస్‌తో సరితూగుతాయి. దీన్ని గమనించి తులనాత్మక అధ్యయనం చేయాలి.
Groups Practice Tests
ప్రాక్టీస్ టెస్టులు
- గత ప్రశ్న పత్రాలను పరిశీలించి.. ప్రశ్నల శైలిపై అవగాహన పెంచుకోవాలి.
- ఆయా కాన్సెప్ట్‌లను షార్ట్‌కట్ మెథడ్స్‌లో సొంత నోట్స్‌లో పొందుపర్చుకోవాలి.
- ప్రస్తుత సమయంలో పూర్తిగా రివిజన్‌కు కేటాయించాలి. ప్రాక్టీస్ టెస్ట్‌లకు హాజరుకావడం కూడా మేలు చేస్తుంది.
- బయాలజీ సబ్జెక్ట్ అభ్యర్థులు డయాగ్రమ్స్‌లోని ముఖ్య భాగాలను గుర్తించడంపై అవగాహన పెంచుకోవాలి.
సబ్జెక్ట్ వారీగా..ప్రధానాంశాలు
- ఈనెల 22న కేవీపీవై పరీక్ష జరగనున్న నేపథ్యంలో.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమయంలో సబ్జెక్ట్ వారీగా దృష్టి పెట్టాల్సిన ప్రధానంశాలు..
- ఫిజిక్స్: రిఫ్రాక్షన్స్, అప్లికేషన్ ఇన్ డైలీ లైఫ్, ‘లా’స్ అండ్ మోషన్, గ్రావిటేషన్, థర్మోడైనమిక్స్, ఆప్టిక్స్, డ్యూయల్ రేడియేషన్ అండ్ మ్యాటర్.
- కెమిస్ట్రీ: పిరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పిరియాడిసిటీ ఇన్ ప్రాపర్టీస్, ఎన్విరాన్‌మెంటల్ కెమిస్ట్రీ, మెటల్స్ అండ్ నాన్ మెటల్స్, జనరల్ ప్రిన్సిపుల్స్ అండ్ ప్రాసెసెస్ ఆఫ్ ఐసోలేషన్ ఎలిమెంట్, పి–బ్లాక్ ఎలిమెంట్స్, డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్, కోఆర్టినేషన్ కాంపౌండ్స్, హాలోఅల్కనేస్ అండ్ హాలోరెన్స్.
- బయాలజీ: జెనిటిక్ ఎవల్యూషన్, అవర్ ఎన్విరాన్‌మెంట్, లైఫ్ ప్రాసెస్, హ్యూమన్ సైకాలజీ, బయోటెక్నాలజీ అండ్ ఇట్స్ అప్లికేషన్స్, ప్రిన్సిపుల్ ఆఫ్ ఇన్‌హెరిటెన్స్ అండ్ వేరియేషన్, మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్‌హెరిటెన్స్.
- మ్యాథమెటిక్స్: క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, మ్యాథమెటికల్ రీజనింగ్, స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ, రియల్ నంబర్, అనలిటికల్ జామెట్రీ ఇన్ టూ డైమెన్షన్, కోఆర్డినేట్ జామెట్రీ, మ్యాథమెటికల్ రీజనింగ్, ఎవల్యూషన్ ఆఫ్ ఇంటెగ్రల్స్.
కేవీపీవై.. ముఖ్య సమాచారం
- బేసిక్ సైన్స్ విద్యార్థులకు ఆర్థిక ప్రోత్సాహకం అందిస్తున్న ప్రోగామ్.. కేవీపీవై.
- ఫైనల్ మెరిట్ జాబితాలో నిలిచి.. నిర్దేశిత డిగ్రీ కోర్సు, ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సుల్లో ప్రవేశం ఖరారు చేసుకుంటే.. మొదటి మూడేళ్లపాటు నెలకు 5వేల ఫెలోషిప్.
- ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సుల విద్యార్థులకు నాలుగు, అయిదో సంవత్సరాల్లో నెలకు 7 వేల ఫెలోషిప్.
- అకడమిక్‌గా ప్రతి ఏటా 60శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తేనే ఫెలోషిప్ కొనసాగింపు.
కేవీపీవై–2021 ముఖ్య సమాచారం
- ఆప్టిట్యూడ్ టెస్ట్ తేదీ: మే 22(ఎస్‌ఏ స్ట్రీమ్ ఉదయం 9:30 నుంచి 12:30 వరకు, ఎస్‌ఎక్స్, ఎస్‌బీ స్ట్రీమ్ మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 వరకు)
- తెలుగు రాష్ట్రాల్లో కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, వరంగల్‌లలో పరీక్ష కేంద్రాలు.
- అందుబాటులో అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ సదుపాయం..
- వివరాలకు వెబ్‌సైట్: www.kvpy.iisc.ernet.in/main/index.htm
- కేవీపీవై 2021 ఆప్టిట్యూడ్ టెస్ట్ తేదీని తొలుత నవంబర్ 7, 2021గా ప్రకటించారు. కాని కోవిడ్ కారణాలతో జనవరి 9కి వాయిదా వేశారు. అప్పుడు కూడా పరీక్ష నిర్వహించే పరిస్థితులు లేకపోవడంతో.. వాయిదా వేసి, తాజాగా మే 22వ తేదీని ఖరారు చేశారు.