Skip to main content

ఫెయిల్యూర్‌తో...గెలిచాం ఇలా..

కాలేజీ నుంచి స్నేహితులైన అభిరాజ్‌భాల్, వరుణ్‌ ఖైతాన్‌ ఇద్దరిదీ అమెరికాలోని బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌లో ఉద్యోగం. మంచి జీతం.
కానీ ఇద్దరిదీ ఒకటే ఆలోచన. ఇండియాకి వెళ్లి ఏదో ఒక వ్యాపారం పెట్టాలని. ఎంత చర్చించుకున్నా ఏం వ్యాపారం పెట్టాలో మాత్రం తేల్చుకోలేకపోయారు. అలా చర్చిస్తుంటే... ఏమీ చెయ్యకుండానే మిగిపోతామని భయమేసి... 2013లో ఉద్యోగాలకు గుడ్‌బై చెప్పి ఇండియాకు తిరిగి వచ్చేశారు. చాలా ఆలోచించిన మీదట.. బస్సులు, రైళ్లు, విమానాల్లో ఆన్‌డిమాండ్‌ సినిమాల్ని ప్రదర్శించే బాక్స్లను తయారు చెయ్యాలనుకుని... ‘సినిమాబాక్స్‌’ సంస్థను ఏర్పాటుచేశారు. ఆరునెలలు గడిచాయి. ఆ మార్కెట్‌చాలా చిన్నదని, దాన్లో విస్తరణకు పెద్ద అవకాశాల్లేవని వారికి అర్థమైంది. అదేమీ జీవితాన్ని మార్చే టెక్నాలజీ కాదని భావించారు. బాధపడ్డా... మూసేశారు. ఇంతలో ‘బగ్గీ.ఇన్‌’ పేరిట రైడ్‌షేర్‌ సంస్థను నడుపుతున్న రాఘవ్‌చంద్ర కలిశాడు. తనదీ ఇలాంటి కథే. బగ్గీ పెద్దగా సక్సెస్‌కాలేదు. దీంతో మూసేశాడు. అప్పుడు వీళ్ల దృష్టి దేశంలో అసంఘటితంగా ఉన్న వృత్తి పని కార్మికులపై పడింది.

ప్లంబర్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, యోగా ట్రెయినర్‌... ఇలా ఎవరు కావాలన్నా సామాన్యులు పడుతున్న బాధలు చూశారు. వారందరినీ ఆన్‌లైన్లోకి తెద్దామనుకున్నారు. ఈ ఆలోచనను చాలామందితో పంచుకున్నారు. అంతా నవ్వేశారు. అభిరాజ్, వరుణ్, రాఘవ్‌మాత్రం ఎవరిమాటా వినలేదు. టెక్నాలజీ తోడుగా వృత్తి పనివాళ్లందరినీ ఒక వేదికపైకి తెస్తూ.. ‘అర్బన్‌క్లాప్‌’ను ఏర్పాటు చేశారు. ‘అవసరం నుంచి పుట్టిన ఏ ఆలోచనకైనా తిరుగుండదు’ అనే మాటను నిజం చేస్తూ అర్బన్‌క్లాప్‌ఇపుడు దేశంలోని ప్రధాన నగరాలన్నిటా విస్తరించింది. వృత్తి నిపుణుల వివరాలు ఇవ్వటానికే పరిమితం కాకుండా... మొదటి నుంచీ దాన్ని తగిన ఆదాయాన్నిచ్చే వ్యాపారంగా మార్చటానికి ప్రయత్నించారు. ఫలితం... రతన్‌టాటా దీన్లో పెట్టుబడి పెట్టారు. అంతేకాదు! యాపిల్‌సీఈఓ టిమ్‌కుక్‌ఇండియాకు వచ్చినపుడు వీరిని కలిసి అర్బన్‌క్లాప్‌ సేవల్ని అడిగి తెలుసుకున్నారు కూడా. కంపెనీ విలువ ఇదమిత్థంగా తెలియకపోయినా... ఇప్పటికే ఇది దాదాపు రూ.40 కోట్ల నిధుల్ని సమీకరించింది.
Published date : 16 Nov 2020 06:09PM

Photo Stories