Skip to main content

ప్రతిభకు గుర్తింపే ఈ స్కాలర్‌షిప్

ఆదిత్య బిర్లా గ్రూప్..1999లో ఆదిత్య బిర్లా గ్రూప్ స్కాలర్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం చుట్టింది. అప్పటినుంచి ప్రతిఏటా నిర్ణీత కోర్సులు, ఇన్‌స్టిట్యూట్‌లలో ప్రతిభావంతులకు స్కాలర్‌షిప్స్ అందిస్తోంది. ఈ క్రమంలో 2013 సంవత్సరానికి నల్సార్- హైదరాబాద్‌కు చెందిన కాసర్ల హర్షితా రెడ్డి ‘న్యాయ శాస్త్ర’ విభాగంలో స్కాలర్‌షిప్‌నకు ఎంపికైంది. తన ప్రతిభకు గుర్తింపుగా ఈ స్కాలర్‌షిప్ అందిందని భావిస్తున్నానంటున్న హర్షిత సక్సెస్ స్టోరీ ఆమె మాటల్లోనే...

ఆదిత్య బిర్లా స్కాలర్‌షిప్‌నకు ఎంపికవడం చాలా ఆనందంగా ఉంది. స్కాలర్‌షిప్ ద్వారా ట్యూషన్ ఫీజు మేరకు.. ఏటా రూ.1.8 లక్షల చొప్పున మొత్తం ఐదేళ్లపాటు అందుతుంది.

విద్యా నేపథ్యం:
మా స్వస్థలం కరీంనగర్ జిల్లా, కోనరావుపేట మండలం కనకర్తి. నాన్న సత్యనారాయణరెడ్డి వ్యాపారం దృష్ట్యా హైదరాబాద్‌లోనే స్థిరపడ్డాం. ఒకటి నుంచి పదో తరగతి వరకు భావన్స్‌లో, పదో తరగతి తర్వాత ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఇంటర్మీడియెట్‌కు తత్సమానమైన ఐబీ కోర్సును 2012లో పూర్తి చేశాను. ఓక్రిడ్జ్‌లోనూ 2.75 లక్షల స్కాలర్‌షిప్ లభించింది.

స్కాలర్‌షిప్ గురించి తెలిసిందిలా:
ఆదిత్య బిర్లా గ్రూప్.. ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ను అందించే క్రమంలో మూడు కోర్సులు ఇంజనీరింగ్, మేనే జ్‌మెంట్, లా కోర్సులకు సంబంధించి నిర్దేశిత ఇన్‌స్టిట్యూట్‌లను ముందుగానే ఎంపిక చేసుకుంది. అలా ఎంపిక చేసుకున్న ఇన్‌స్టిట్యూట్‌లకు ప్రతిఏటా జూన్‌లో సదరు విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రకటనను విడుదల చేస్తుంది. దాన్ని ఆయా ఇన్‌స్టిట్యూట్ డీన్ విద్యార్థులకు తెలియజేస్తారు.

అర్హతలేంటి?
అప్పటికే ఎంపిక చేసిన కోర్సులు, ఇన్‌స్టిట్యూట్‌లలో టాప్-20 విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. దేశంలోని 14 లా వర్సిటీల్లో ప్రవేశానికి నిర్వహించే క్లాట్‌లో 2013లో జాతీయ స్థాయిలో 30, రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంకు రావడంతో నల్సార్, హైదరాబాద్ నుంచి దరఖాస్తు చేసుకునే అర్హత లభించింది.

దరఖాస్తు ప్రక్రియ ఎలా ఉంటుంది?
నిర్దేశిత నమూనాలోని దరఖాస్తును పూర్తి చేయడంతోపాటు.. రెండు అంశాలపై 300 పదాలకు మించని వ్యాసాలు జత చేసి ఇన్‌స్టిట్యూట్ డీన్ ద్వారా ఆదిత్య బిర్లా స్కాలర్‌షిప్ ప్రోగ్రాం ఆఫీస్‌కు దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్థులు రాయాల్సిన రెండు అంశాల్లో ఒకటి.. ‘ఆదిత్య బిర్లా గ్రూప్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌నకు మీరు అర్హులని ఎందుకు భావిస్తున్నారు’ కాగా.. రెండోది ‘న్యాయ శాస్త్రాన్ని ఎందుకు ఎంపిక చేసుకున్నారు? భవిష్యత్తులో న్యాయశాస్త్రం నైపుణ్యం ఆధారంగా ఏం చేయాలనుకుంటున్నారు? రెండో అంశం ఆయా కోర్సులను బట్టి మారుతుంది. ఇలా ప్రాథమికంగా నిర్దిష్ట ప్రమాణాల మేరకు మేనేజ్‌మెంట్, ఇంజనీరింగ్ విభాగాల నుంచి 160 మంది చొప్పున, న్యాయ శాస్త్ర విభాగంలో 80 మంది నుంచి నిర్దిష్ట నమూనాలో స్వీకరిస్తారు. ఈ క్రమంలో న్యాయశాస్త్ర విభాగంలో మొత్తం 20 మంది విద్యార్థులను ఈ ఏడాది షార్ట్‌లిస్ట్ చేశారు.

ఎంపిక ప్రక్రియ:
షార్ట్‌లిస్ట్‌లో నిలిచిన విద్యార్థులకు ముంబైలో నిపుణులు బృందం ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది. ‘లా’కు సంబంధించిన ఇంటర్వ్యూ సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ వెంకటాచలయ్య నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల బృందం ఆధ్వర్యంలో జరిగింది. 30 నుంచి 40 నిమిషాల పాటు సాగిన నా ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలు.. -‘లా’నే ఎందుకు ఎంపిక చేసుకున్నారు? ఈ విషయంలో మీకు స్ఫూర్తి ఎవరు? న్యాయశాస్త్రంలో ఏ స్పెషలైజేషన్ అంటే ఎక్కువ ఆసక్తి? ఒక జడ్జిగా మీలో చూడదగిన లక్షణాలు ఏంటి?.. వీటన్నిటికీ సంతృప్తికరంగా సమాధానాలు ఇవ్వగలిగాననే భావన ఆ రోజే కలిగింది. తుది జాబితాలో నిలవడం నిజంగా అదృష్టం.

స్కాలర్‌షిప్.. ప్రయోజనాలు:
ఆదిత్య బిర్లా గ్రూప్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌లో ఎంపికైన విద్యార్థులకు సదరు కోర్సు ఆసాంతం ఏటా రూ.1.80 లక్షలు లేదా వాస్తవ ట్యూషన్ ఫీజును (ఏది తక్కువైతే అంత మొత్తం) ఆదిత్య బిర్లా గ్రూప్ నేరుగా ఇన్‌స్టిట్యూట్‌కు చెల్లిస్తుంది. అంతేకాకుండా ఆ సంస్థకు సంబంధించిన విభాగాల్లో ఇంటర్న్‌షిప్ చేసే అవకాశం కూడా కల్పిస్తుంది.

భవిష్యత్తు లక్ష్యం:
భవిష్యత్తులో క్రిమినల్ లాలో స్పెషలైజేషన్ చేయడం అకడమిక్‌గా ప్రధాన లక్ష్యం. దీంతోపాటు జ్యుడీషియరీ విభాగంలో ప్రవేశించి సామాజిక సేవ చేయాలన్నదే నా సంకల్పం.
Published date : 18 Oct 2013 03:13PM

Photo Stories