Skip to main content

ప్రకాశం జిల్లా నుంచి ప్రపంచ ఫెలోషిప్ వరకు...

పరిశోధనలను ప్రోత్సహించడానికి ఐక్యరాజ్య సమితి జపాన్‌లో యునెటైడ్ నేషన్స్ యూనివర్సిటీ పేరుతో ప్రత్యేక ఇన్‌స్టిట్యూట్‌ను నెలకొల్పింది. దీని ద్వారా ఏటా పలు రంగాల్లో ఫెలోషిప్ అభ్యర్థులను ఎంపిక చేస్తోంది. ఈ క్రమంలో ఈ ఏడాది రాష్ట్రానికి చెందిన కుమ్మిత రామకృష్ణారెడ్డి రూ.కోటి ఫెలోషిప్‌నకు ఎంపికయ్యారు. తన లక్ష్య సాధనలో ఇదో మైలురాయి అంటున్న రామకృష్ణారెడ్డి సక్సెస్ స్పీక్స్..

యునెటైడ్ నేషన్స్ యూనివర్సిటీ పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్‌నకు ఎంపికవడం వృత్తిపరంగా లక్ష్య సాధనలో మరో మైలురాయిగా భావిస్తున్నాను. ఈ ఫెలోషిప్‌నకు ఎంపికయ్యే నాటికే పీహెచ్‌డీ పూర్తి చేసి ముంబైలోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్‌లోని సెంటర్ ఫర్ సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. భవిష్యత్తులో సోషల్ ఎంటర్‌ప్రైజ్‌ను నెలకొల్పి ఏదైనా ఒక ప్రధానమైన సామాజిక సమస్యకు పరిష్కారం కనుగొనడమే నా లక్ష్యం.

ఫెలోషిప్ గురించి:
ఐక్యరాజ్య సమితికి చెందిన పరిశోధన విభాగం.. యునెటైడ్ నేషన్స్ యూనివర్సిటీ పేరుతో జపాన్‌లో ఒక ఇన్‌స్టిట్యూట్‌ను నెలకొల్పింది. దీన్ని జపాన్ విద్యాశాఖకు చెందిన జపనీస్ సొసైటీ ఫర్ ది ప్రమోషన్ ఆఫ్ సైన్‌‌స (జేఎస్‌పీఎస్) పర్యవేక్షిస్తుంది. ఫెలోషిప్‌ను కూడా జేఎస్‌పీఎస్ స్పాన్సర్ చేస్తుంది. మొత్తం రెండేళ్ల వ్యవధిలో ఉండే ఈ పోస్ట్ డాక్టోరల్ ప్రోగ్రామ్‌కు మన దేశ కరెన్సీ ప్రకారం రూ. కోటి ఫెలోషిప్ అందుతుంది. ఈ ఫెలోషిప్‌నకు ఎంపికవడం ద్వారా ఆసియా, ఆఫ్రికా ఖండాల్లోని పది దేశాల్లో పర్యటించి ఆయా దేశాల్లోని సామాజిక జీవన పరిస్థితులను పరిశోధించడం, అక్కడి ప్రజల అవసరాలు కనుగొనడం.. ఇలా అన్ని కోణాల్లో పరిశోధించాల్సి ఉంటుంది.

రీసెర్చ్ వర్క్ ముఖ్యాంశాలు:
రీసెర్చ్ వర్క్‌లో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగాలను అనుసంధానం చేసుకోవాలి. అందుబాటులో ఉన్న పలు టెక్నాలజీ ఆవిష్కరణలు.. సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌కు ఎలా ఉపయోగపడతాయి? అదే విధంగా సుస్థిర అభివృద్ధికి ఎలా దోహదం చేస్తాయి? అనేవి ప్రధాన అంశాలుగా పరిశోధన చేయాలి. అదే విధంగా ఇప్పటికే ఈ టెక్నాలజీ ఆవిష్కరణలను సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎలా వినియోగించుకుంటున్నారో తెలుసుకోవాలి. అంతేకాకుండా సామాజిక లేదా పర్యావరణ సమస్యల్ని ఎదుర్కొనే క్రమంలో, వాటి సుస్థిర అభివృద్ధి దిశగా.. వినూత్నమైన సోషల్ టెక్నాలజీలు ఎలా ఉపయోగపడతాయి? అనే అంశం కూడా పరిశోధనలో ఒక భాగం. మొత్తం రెండేళ్ల పరిశోధనలో తొలుత కొన్ని నెలల పాటు ఎంపిక చేసిన దేశాల్లో సోషల్ ఎంటర్‌ప్రెన్యురల్ సంస్కృతిపై అవగాహన పెంపొందించుకోవడం, వాటికి సంబంధించిన ఫీల్డ్‌వర్క్ నిర్వహించాలి. ఈ దశ పూర్తయ్యాక ప్రాథమికంగా యుఎన్‌యు ఫ్యాకల్టీ, ఇతర రీసెర్చ్ స్కాలర్స్‌తో చర్చలు సాగించడం.. చివరగా ఒక నివేదిక రూపొందించాలి. ఇది పూర్తయ్యాక అభ్యర్థులు వివిధ సోషల్ ఎంటర్‌ప్రైజెస్ నుంచి డేటా సేకరణకు అత్యధిక సమయం వెచ్చించాలి. చివరగా ఈ పరిశోధన ద్వారా కనుగొన్న అంశాలు సుస్థిరమైన సమాజాలను నెలకొల్పే దిశగా యునెటైడ్ నేషన్స్ విధానాలకు ఎలా ఉపయోగపడతాయి? అనే అంశంపై నివేదిక రూపొందించాలి.

దరఖాస్తు ఇలా:
యునెటైడ్ నేషన్స్ యూనివర్సిటీ పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్ దరఖాస్తు ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లోనే ఉంటుంది. ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రక్రియ ముగిశాక యునెటైడ్ నేషన్స్ యూనివర్సిటీలోని ప్రముఖ రీసెర్చర్స్ వాటిని మూల్యాంకనం చేస్తారు. ఆ మూల్యాంకనం ఆధారంగా సదరు రంగానికి సరితూగే వ్యక్తులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. వారిని స్కైప్ (ఇంటర్నెట్ ఆధారంగా) లేదా టెలిఫోన్ ద్వారా దాదాపు గంట పాటు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఈ ఇంటర్వ్యూ ప్రధానోద్దేశం అభ్యర్థిలోని నిజమైన ఆసక్తి, అప్పటికే ఆన్‌లైన్ అప్లికేషన్‌లో పేర్కొన్న రీసెర్చ్ ప్రతిపాదనపై ఉన్న పట్టును పరిశీలించడమే. ఈ దరఖాస్తు ప్రక్రియ ఏటా డిసెంబర్‌లో మొదలవుతుంది. అభ్యర్థులు యుఎన్‌యు వెబ్‌సైట్ (www.ias.unu.edu) లేదా జేఎస్‌పీఎస్ వెబ్‌సైట్ -(www.jsps.go.jp/english) ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. మొత్తం ప్రక్రియ పూర్తయి ఫెలోషిప్ ప్రోగ్రాం సెప్టెంబర్/అక్టోబర్‌లో ప్రారంభమవుతుంది.

విద్యా నేపథ్యం:
ఇంటర్ (హెచ్‌ఈసీ) వరకు ప్రకాశం జిల్లాలోని అద్దంకిలోనే చదివాను. కర్నూలులోని సిల్వర్‌జూబ్లీ డిగ్రీ కళాశాల నుంచి బీఏలో పూర్తి చేశాను. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచి ఎంఏ (పొలిటికల్ సైన్స్), ఎం.ఫిల్, సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ సోషల్ ఇన్‌క్లూజన్‌లో పీహెచ్‌డీ పూర్తి చేశాను. సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో పరిశోధనకుగాను జర్మనీకి చెందిన బాన్ యూనివర్సిటీ నుంచి 2011లో జూనియర్ సైంటిస్ట్ అవార్డ్ లభించింది.

సోషల్ సెన్సైస్‌తోనే సాధ్యం:
సాంకేతికంగా ఎలాంటి ఆవిష్కరణలు జరిగినా వాటి తుది లక్ష్యం ప్రజలకు వినియోగపడే విధంగా రూపొందించడం తద్వారా సామాజిక అభివృద్ధికి దోహదపడటమే. వాటిని క్షేత్ర స్థాయిలో అమలు చేయాలంటే సోషల్ సెన్సైస్ నిపుణులతోనే సాధ్యం.

Published date : 25 Oct 2013 02:58PM

Photo Stories