ప్రభుత్వ ఉద్యోగాల్లో...అదరగొట్టిన అక్కాచెల్లెళ్లు
కృషి, పట్టుదల ఉంటే సాధించలేనిది ఏమిలేదని నిరూపించారు అక్కాచెల్లెళ్లు.. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రభుత్వ కొలువు రావడమే గగనం. కాని గిరిజన కుటుంబానికి చెందిన అక్కాచెల్లెళ్లు ప్రభుత్వ కొలువులు సాధించారు. టీఎస్‌పీఎస్పీ విడుదల చేసిన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ (హెచ్‌డబ్ల్యూవో) ఫలితాల్లో వీరు ఉద్యోగాలు పొందారు. ఆదిలాబాద్ పట్టణంలోని టైలర్స్ కాలనీలో నివాసం ఉంటున్న ప్రభుత్వ రిటైర్డ్ టీచర్ గేడాం బాబారావు– శశికళ దంపతుల కుమార్తెలు గేడాం స్వప్న, గేడాం ప్రియలు మొదటి ప్రయత్నంలోనే సత్తాచాటారు. గతేడాది హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ నోటిఫికేషన్ విడుదల కావడంతో పరీక్ష రాసి ప్రతిభ కనబరిచారు.
బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ రెండు ఉద్యోగాలకు ఎంపిక కాగా, ట్రైబల్ వెల్ఫేర్‌ను ఎంచుకున్నారు. కుటుంబ సభ్యుల సహకారంతోనే ఉద్యోగాన్ని సాధించినట్లు తెలిపారు. ఎంఎస్సీ, బీఎడ్, సెట్ విద్యార్హత ఉన్న గేడం స్వప్న హెచ్‌డబ్ల్యూవో పోటీ పరీక్ష రాసిన అనంతరం ఆదిలాబాద్ పట్టణంలోని గిరిజన గురుకుల డిగ్రీ కళాశాలలో ఇదివరకే గెస్ట్ లెక్చరర్‌గా పనిచేశారు. అలాగే బీఎస్సీ, బీఎడ్ చేసిన గేడాం ప్రియ ఇటీవల పంచాయతీ కార్యదర్శి ఉద్యోగం సాధించినప్పటికీ ఉద్యోగంలో చేరలేదు. మొదటి ప్రయత్నంలోనే ప్రభుత్వ కొలువు సాధించడంతో కుటుంబ సభ్యులు, బంధువులు అభినందించారు.