మా కలను పట్టుదలతో సాకారం చేసుకున్నాం ఇలా..
ఫిబ్రవరి 28న పీఎస్‌ఎల్‌వీ–సి51 ద్వారా పంపే ఈ శాటిలైట్లలో బెంగళూరు స్పేస్ టెక్నాలజీ స్టార్టప్ ‘పిక్సెల్’ రూపొందించిన ‘ఆనంద్’ ఒకటి. పాతికేళ్లు కూడా నిండని ఎవ్యాస్ అహ్మద్, క్షితిజ్ ఖండేల్‌వాల్‌లు ఈ కంపెనీ రథసారథులు. ‘పిక్సెల్’ విజయప్రస్థానం...
చిన్నప్పుడే....:
చిన్నప్పుడు ఆకాశం అంటే అంతులేని ఆసక్తి ఎవరికి మాత్రం ఉండదు. చిక్కమగళూరు(కర్నాటక) అబ్బాయి ఎవ్యాస్ అహ్మద్ కూడా అంతే. ఆ ఆసక్తి తాను చదువుకున్న బిట్స్ పిలాని(రాజస్థాన్ ) వరకు కొనసాగింది. బిట్స్ పిలానిలో ‘హైపర్‌లూప్ ఇండియా’ ప్రాజెక్ట్ వ్యవస్థాపక సభ్యులో అహ్మద్ కూడా ఒకరు. ‘హైపర్‌లూప్ ఇండియా’తో తన కలలకు శాస్త్రీయ పునాది ఏర్పడింది. వేరు వేరు క్యాంపస్‌లలో నుంచి వచ్చిన విద్యార్థులతో పరిచయం, పరిజ్ఞానం పెంచుకునే ప్రయత్నాలు జరిగాయి. టెక్ దిగ్గజం ఎలాన్ మాస్క్‌కు చెందిన ‘స్పేస్‌ఎక్స్’ స్పాన్సర్ చేసే ‘హైపర్‌లూప్ పోడ్ కాంపిటీషన్ ’లో ప్రపంచం నలుమూలల నుంచి స్టూడెంట్స్, నాన్ స్టూడెంట్స్ టీమ్‌లు పాల్గొంటాయి. ఈ పోటీలో పాల్గొనడాన్ని ప్రతిష్ఠాత్మక విషయంగా భావిస్తాయి. హైపర్‌లూప్ కాన్సెప్ట్ ప్రకారం సబ్‌స్కేల్ ప్రోటోటైప్ ట్రాన్‌సపోర్ట్ వెహికిల్స్ నిర్మించడం, డిజైన్స్ చేయడం ఈ పోటీ ముఖ్య ఉద్దేశం.
ఈ పోటీ పుణ్యమా అని..
‘హైపర్‌లూప్ ఛాలెంజ్’లో బిట్స్ పిలాని టీమ్‌కు పాల్గొనే అవకాశం వచ్చింది. కాలిఫోర్నియాలోని ‘స్పేస్‌ఎక్స్’ ప్రధానకార్యాలయంలో తమదైన హైపర్‌లూప్ టెక్నాలజీ(అత్యంగా వేగంగా ఒక మైలు దూరం వ్యాక్యూమ్ ట్యూబ్‌లో ప్రయాణం చేసే సాంకేతిక జ్ఞానం) డెమో ఇచ్చారు. ఫైనల్ వరకు వెళ్లారు. ఈ పోటీ పుణ్యమా అని టెక్‌స్టార్ ఎలాన్ మాస్క్‌ను కలుసుకునే అవకాశం వచ్చింది. ‘మాస్క్‌తో మాట్లాడడం ఎంతో స్ఫూర్తిని ఇచ్చింది. నా కలను ఎలాగైనా సాకారం చేసుకోవాలనే పట్టుదల పెరిగింది’ అంటాడు ఆరోజుని గుర్తు చేసుకుంటూ 22 సంవత్సరాల అహ్మద్.
ఈ ఆలోచనతోనే...
హైపర్‌లూప్ కాంపిటీషన్ లో పాల్గోవడం వల్ల తన పరిమిత అవగాహనలోని ఖాళీలకు జవాబులు దొరికాయి. ఆ తరువాత ‘ఏఐ ఎక్స్‌ప్రై జ్ కాంపిటీషన్ ’లో పాల్గొన్నాడు. సాంకేతిక అభివృద్ధి ప్రధాన ఎజెండాగా పోటీలు నిర్వహించే ఈ సంస్థను 1994లో కాలిఫోర్నియాలో స్థాపించారు. జెమ్స్ కామెరూన్, లారీపేజ్‌లాంటి ప్రముఖులు ఈ సంస్థకు ట్రస్టీలుగా ఉన్నారు. ‘ఎక్స్‌ప్రై జ్’లో పాల్గొన్న సందర్భంలోనే అహ్మద్‌కు ‘శాటిలైట్ ఇమేజరీ’ గురించి ఆలోచన వచ్చింది. రిమోట్ లొకేషన్లలో, పైప్‌ల నుంచి గ్యాస్ లీకేజిలను గుర్తించడానికి ప్రస్తుతం ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. ఇది మాత్రమే కాకుండా గనులలో అక్రమ తవ్వకాలను గుర్తించడానికి, వ్యవసాయానికి సంబంధించిన ట్రెండ్స్ గురించి తెలుసుకోవడానికి, విత్తడానికి సరిౖయెన సమయాన్ని ఎంచుకోవడానికి...ఒకటి రెండు అని ఏమిటి! చాలా రకాలుగా శాటిలైట్ ఇమేజరీలను వాడుకోవచ్చు అనే ఆలోచన వచ్చింది. ఈ ఆలోచన నుంచి పుట్టిందే స్పేస్ టెక్నాలజీ స్టార్టప్ పిక్సెల్.
అయితే మాకు ఇది పెద్ద సమస్యగా మారింది....
బిట్స్‌పిలానిలో తనతో పాటు చదువుకున్న క్షితిజ్ ఖండెల్‌వాల్‌తో కలిసి 2019లో బెంగళూరులో ‘పిక్సెల్’ స్టార్టప్ ప్రారంభించాడు అహ్మద్. అయితే నిధుల సమస్య పెద్ద సవాలుగా మారింది. వీరు ఎంత సీరియస్‌గా తమ ప్రాజెక్ట్ గురించి వివరించినా అందరూ తేలిగ్గా తీసుకునేవారు. దీనికి కారణం వారి వయసు. నిధుల సమస్యను అధిగమించడానికి రాజస్థాన్ గవర్నమెంట్, ఇతరుల కోసం కొన్ని ప్రాజెక్ట్‌లు చేశారు. కొద్ది కాలం తరువాత ‘పిక్సెల్’ ప్రాజెక్ట్ గురించి ఇన్వెస్టర్లు ఆసక్తి చూపించడం మొదలుపెట్టారు.
పట్టుదల ఉంటే...
తొలిరోజుల్లో పెద్దగా ఎవరూ ఆసక్తి చూపించని ‘పిక్సెల్’ టీమ్ ఇండస్ తరువాత ఇండియన్ స్పేస్ స్టార్టప్‌లలో హైయెస్ట్ ఫండింగ్‌లో ఉంది. తాము అత్యున్నత ప్రమాణాలతో జెనరేట్ చేసే ఇమేజరీ డాటా యూఎస్ నుంచి యూరప్ వరకు వినియోగదారులకు అనేకరకాలుగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు ‘పిక్సెల్’ సీయివో,సీటీవో అహ్మద్, క్షితిజ్‌లు. మూడు రోజుల తరువాత పిక్సెల్ వారి ‘ఆనంద్’ ఆకాశంలోకి దూసుకెళ్లబోతుంది. వెళుతూ వెళుతూ ఒక గట్టి నమ్మకాన్ని ఇచ్చివెళుతుంది. పట్టుదల ఉంటే కన్న కలలు సాకారమవుతాయి. జీవితాన్ని ఆనందంతో నింపుతాయి.