జీవితంలో ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నా... పద్మశ్రీ‘తులసి గౌడ’
Sakshi Education
కర్ణాటకలోని అంకోలా తాలూకా హొన్నాలి గ్రామానికి చెందిన తులసి గౌడకు ఏడుపదులు పైబడ్డా నేటికీ హుషారుగానే కనిపిస్తారు. జీవితంలో ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నారు. పుట్టిన రెండేళ్లకే తండ్రిని పోగొట్టుకున్నారు.
కుటుంబాన్ని నడపటం కష్టంగా ఉండటంతో, తులసి గౌడకు బాల్యంలోనే వివాహం చేశారు ఆమె తల్లి. ఆమెను అక్కడ కూడా దురదృష్టం వెంటాడింది. చిన్నతనంలోనే భర్తను పోగొట్టుకుంది. అయినా ైధె ర్యాన్ని కోల్పోలేదు తులసి గౌడ. ఒంటరితనాన్ని దూరం చే సుకోవటం కోసం, మొక్కలకు చేరువైంది. ఆమెలోని ఉత్సాహాన్ని చూసి, అటవీశాఖ వారు ఆమెకు వనమాలి ఉద్యోగం ఇచ్చారు. మొక్కలను తన బిడ్డల్లా చూసుకుంటూ, అంకిత భావంతో పనిచేశారు తులసి. మొక్కలు నాటడం, వాటికి నీళ్లు పోసి సంరక్షించటమే కాకుండా, ఆ మొక్కలోని గుణాలు, మొక్క పేరుకు సంబంధించిన జ్ఞానం పెంచుకున్నారు. ఎవరు వచ్చి, ఏ మొక్క గురించి ప్రశ్నించినా తడుముకోకుండా, విసుగు లేకుండా, ఆనందంగా ఆ వివరాలు చెబుతారు తులసి గౌడ. టేకు మొక్కలతో తన ప్రయాణం ప్రారంభించిన తులసి గౌడ, పనస వంటి అనేక పెద్ద పెద్ద మొక్కలు కూడా నాటి, అవి పెరిగి, ఫలాలనిస్తుంటే, తనకు మనుమలు పుట్టినంత ఆనందిస్తారు. పర్యావరణానికి అందించిన సేవలకు గాను ఆమెకు ఉన్న పురస్కారాలకు వన్నె తెచ్చేలా పద్మశ్రీ పురస్కారం వచ్చి చేరింది.
Published date : 31 Jan 2020 06:38PM