Skip to main content

ఎగతాళి చేశారు..అయినా పట్టుదల చీకటిని వెలిగించాడు..

సముద్ర కెరటాన్ని మించిన ప్రాక్టికల్‌ లెసన్‌ ఉంటుందా? పడినా తిరిగి లేస్తుంది.. తీరాన్ని తాకేందుకు ప్రయత్నిస్తూనే ఉంటుంది! కెరటాన్ని స్ఫూర్తిగా తీసుకున్న మనుషులూ ఉన్నారు.. నలుగురిలో ఒకరిగా కాకుండా నలుగురు గర్వించదగిన స్థాయికి ఎదగాలనే తపనతో ఎన్ని అడ్డంకులు ఎదురైనా గమ్యం చేరుకున్న విజేతలు!
చిన్నతనంలోనే చూపును కోల్పోయిన..
అలాంటి అచీవరే ఎమ్‌డీ షకీర్‌...చిన్నతనంలోనే చూపును కోల్పోయిన ఈ యువకుడు కళ్లు లేవని బెంగపడలేదు. ఎవరి జీవితం వారి చేతుల్లోనే ఉంటుంది అనే ప్రాక్టికాలిటీ అర్థమైన వ్యక్తి కావడంతో అంధత్వాన్ని తన లక్ష్యసాధనకు అడ్డుగా ఏమాత్రం భావించలేదు. అనుకున్నది సాధించి కళ్లున్నవాళ్లకూ స్ఫూర్తిగా కనిపిస్తున్నాడు. మోటివేటర్‌గా ఎంతోమందిలో ఆత్మవిశ్వాసం నింపుతున్న షకీర్‌కి అయిదారేళ్ల వయసులో చూపు పోయింది. అయినా చదువు ఆపలేదు. పట్టుదలతో బ్రెయిలీ లిపి నేర్చుకుని చదువు కొనసాగించాడు. అంధుల్లో పోస్టు గ్రాడ్యుయేషన్‌ చేసిన తొలి ఆంధ్రుడిగా నిలిచాడు. అంతేకాదు ముస్లింల పవిత్ర గ్రం«థమైన ఖురాన్‌ను బ్రెయిలీ లిపిలో రచించి, లిమ్కా బుక్‌లో స్థానం పొంది, నాటి రాష్ట్రపతి అబ్దుల్‌ కలామ్‌ నుంచి ఎక్స్‌లెన్స్‌ అవార్డునూ అందుకున్నాడు. 2017, డిసెంబరులో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో నిర్వహించిన అక్కినేని ఫౌండేషన్‌ ఆఫ్‌ అమెరికా ద్వారా ‘వినూత్న రత్న’ పురస్కారాన్నీ పొందాడు. షకీర్‌ గురించి మరిన్ని వివరాలు అతని మాటల్లోనే..

వింటూ.. అర్థం చేసుకుంటూ..
మాది సాధారణ కుటుంబం. మా నాన్న (సయ్యద్‌ ఇస్మాయేల్‌) పద్దెనిమిదేళ్లు మిలటరీలో పనిచేశారు. అమ్మ (రహీమా బేగం) గృహిణి. నేను యూకేజీలో ఉన్నప్పుడు గ్లకోమాతో చూపు పోయింది. మా పేరెంట్స్‌ మేనరిక వివాహమే ఇందుకు కారణమన్నారు. నాకు గ్లకోమా అని తేలగానే మా నాన్న ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చేశారు. ఎంతో మంది డాక్టర్లకు చూపించారు. ప్రయోజనం లేదనే అన్నారంతా. యూకేజీదాకా మామూలు బడికి వెళ్లిన నేను ఒకటో తరగతికి చెన్నైలోని స్పెషల్‌ స్కూల్లో చేరాను. బ్రెయిలీ లిపి ద్వారా అక్కడే అయిదో తరగతి వరకు చదువుకున్నా. ఆ తరువాత నెల్లూరు జిల్లా వెంకటగిరిలోని మామూలు బడిలోనే చేరి ఆరు నుంచి పదవ తరగతి వరకు చదివా. టీచర్లు చెప్పే పాఠాలను శ్రద్ధగా వింటూ, క్లాస్‌మేట్స్‌ గట్టిగా చదువుతుంటే అర్థం చేసుకుంటూ.. బ్రెయిలీలో పరీక్షలు రాసేవాడిని. ఇంటర్, డిగ్రీ (బీఏ, ఇంగ్లిష్‌ లిటరేచర్‌)లో మాత్రం క్లాస్‌లో లెసన్స్‌ను రికార్డ్‌ చేసుకునే వాడిని. ఇంటికి వెళ్లాక ప్లే చేసుకుని వినేవాడిని. ఇట్లాగే 2002లో ఎంబీఏ పూర్తి చేశాను. ఆ తరువాత తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో ఎంఏ ఇంగ్లిష్‌ లిటరేచర్‌ చేశాను. ఆ సమయంలోనే 2002లో కుప్పంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో (వికలాంగుల కోటాలో) జూనియర్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగం వచ్చింది. అంతా రికార్డు వర్క్‌కు సంబంధించిన ఉద్యోగం కావడంతో కంటి చూపులేక ఏ పనీ చెప్పేవారు కాదు. ఖాళీగా కూర్చోవలసి వచ్చేది.

చూపు లేదు కదా, బోర్డు పై ఎలా రాస్తావ్‌...అంటూ..?
ఏదైనా ఒక సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో మేనేజర్‌గా ఉద్యోగం చేయాలని ఉండేది. ఎంబీఏ కంప్లీట్‌ అయ్యాక కొన్ని కంపెనీలకు దరఖాస్తు చేసుకున్నాను. కానీ ఏ కంపెనీ నుంచీ కాల్‌ లెటర్‌ రాలేదు. టీచింగ్‌లోకి వద్దామని ప్రైవేట్‌ కాలేజెస్‌ను సంప్రదించా. వాళ్లూ సుముఖత చూపించలేదు. ‘‘చూపు లేదు కదా, బోర్డు పై ఎలా రాస్తావ్‌? క్లాసులో స్టూడెంట్స్‌ను ఎట్లా మేనేజ్‌ చేస్తావ్‌?’’ అంటూ ఎగతాళి చేశారు. దాంతో నాలో కసి పెరిగింది. ఉద్యోగం కోసం ఎవ్వరినీ అర్థించకూడదు, నేనే నలుగురికి ఉద్యోగాలు ఇచ్చేలా ఉండాలని డిసైడ్‌ అయ్యా. డిసెంబరు 15, 2005లో విజయవాడలో సొంతంగా ‘ఎంపవర్‌ ట్రైనింగ్‌ సొల్యూషన్స్‌’ని పెట్టి, పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌ ట్రైనింగ్‌ స్టార్ట్‌ చేశా. ఈ 14 ఏళ్లలో 850 వరకు క్లాసెస్‌ నిర్వహించా. ఈ విషయం తెలుసుకుని నాడు జాబ్‌ ఇవ్వడానికి ఇష్టపడని కంపెనీలు, కాలేజెస్‌ ‘‘మా దగ్గర ఉద్యోగం చేయండి’’ అంటూ జాబ్‌ ఆఫర్లు ఇస్తున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో శిక్షణా కార్యక్రమాలు ఇవ్వాలనేదే నా లక్ష్యం. ప్రస్తుతం ఆ ప్రయత్నంలోనే ఉన్నా. స్టీవెన్స్‌ హావీ, టీనీరాబిన్స్, బ్రెయిన్‌ట్రెసీ వంటి అమెరిక్‌ రచయితల పుస్తకాలను బాగా చదువుతుంటా. ప్రతి నెలా ఏదో ఓ కొత్త పుస్తకం చదువుతాను. సాధారణంగా పుస్తక పఠనం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. నాకు మెమొరీ కూడా ఎక్కువే. నా సెల్‌ ఫోన్లో ఉన్న 600 నంబర్లను ఎలా అడిగినా టక్కున చెప్పగలను. బ్రెయిలీ లిపిలో ఉన్న రిస్ట్‌ వాచ్‌ను, అలాగే టాకింగ్‌ కంప్యూటర్‌ను వాడతాను.

కుటుంబం నేప‌థ్యం..:
మేము నలుగురు అన్నదమ్ములం. నేనే ఆఖరు వాడిని. మూడో అన్నకూ కంటి చూపులేదు. తనూ నాలాగే బ్రెయిలీలో డిగ్రీ వరకు చదువుకుని జగ్గయ్యపేట కాలేజ్‌లో ఇంగ్లిష్‌ లెక్చరర్‌గా జాబ్‌ చేస్తున్నాడు. పెద్దవాళ్లిద్దరూ కెనడా, యూఎస్‌ఏలో సాప్ట్‌వేర్‌ కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్నారు.

లిమ్కా బుక్‌లో స్థానం సంపాదించా...‌
ఇంటర్‌లో ఉన్నప్పుడు బ్రెయిలీలో ఖురాన్‌ను రాసి లిమ్కా బుక్‌లో స్థానం సంపాదించా. అబ్దుల్‌ కలామ్‌ నుంచి ఎక్స్‌లెన్స్‌ అవార్డు అందుకుంటున్నప్పుడు .. ‘నీవు స్ట్రీట్‌ లైట్‌వి కావు, లైట్‌ హౌస్‌వి’ అని ఆయన అన్న మాటలు నాకెప్పటికీ ప్రేరణే. వ్యక్తిత్వ వికాసంపై ఉర్దూ, తెలుగు, తమిళం, ఇంగ్లిష్‌, హిందీలలో అనర్గళంగా క్లాసెస్‌ ఇవ్వగలను. పర్సనాల్టీ డెవలప్‌మెంట్‌ పై 2016లో ’స్టార్ట్‌ ఏ న్యూ లైఫ్‌ నౌ’ అనే పుస్తకాన్నీ రాశా ఇంగ్లిష్‌‌లో. 2018లో ‘విజయీభవ’ పేరుతో తెలుగులో కూడా పబ్లిష్‌ అయింది.

జాబ్‌ ట్రయల్స్‌లో ఉన్నప్పుడు...
నన్నో మోడల్‌గా చూపించి, పది మందిని చైతన్యపర్చడానికి భగవంతుడు ఇలా చేశాడని భావిస్తుంటాను. జాబ్‌ ట్రయల్స్‌లో ఉన్నప్పుడు అంధత్వం గురించి కొద్దిగా బాధపడేవాడిని. మోటివేషన్‌ క్లాసులు ఇవ్వడం మొదలుపెట్టాక ఆ బాధ ఎప్పుడూ లేదు. ఇప్పుడు నాకు ప్రపంచమే క్లాస్‌ రూమ్‌. యువత ఉద్యోగమే కావాలనుకోకుండా స్వశక్తిపై వృద్ధిలోకి వచ్చి, మరో పదిమందికి ఉపాధి చూపించేలా తయారుకావాలి. వైకల్యం ఉన్నవాళ్లు దాన్నో లోపంగా భావించి బాధపడకుండా ఆత్మవిశ్వాసంతో అధిగమించాలి. మంచి జీవితానికి బాటలు వేసుకోవాలి.
Published date : 01 Apr 2021 07:21PM

Photo Stories