Skip to main content

ఏ డాక్టర్‌నైనా కన్సల్ట్‌ చేయొచ్చు ఇలా...

సతీష్‌ కణ్ణన్, దీనదయాళన్‌ ఇద్దరూ ఐఐటీ మద్రాస్‌లో స్నేహితులు. 2012లో ఇంజినీరింగ్‌ పూర్తయి బయటికొచ్చాక సతీష్‌ పుణెలోని ఫిలిప్స్‌ హెల్త్‌ కేర్‌లో చేరాడు.
దీనదయాళన్‌ మాత్రం ఐఐటీలోని ఇన్నోవేషన్‌ సెంటర్లో డయాబెటిక్‌ రెటినోపతిని కనుక్కునే పరికరం తయారీలో మునిగిపోయాడు. ఏడాది ఉద్యోగం చేసిన సతీష్‌... ఉద్యోగంలో భాగంగా హెల్త్‌కేర్‌ సేవల్ని బాగా గమనించాడు. స్పెషలిస్టు వైద్యుల సేవలు సామాన్యులకు అందటం చాలా కష్టమవుతోందని తెలుసుకున్నాడు. దీన్ని టెక్నాలజీ సాయంతో అధిగమించాలని భావించి... దీనదయాళన్‌తో చెప్పాడు. ఇద్దరూ కలిసి 2013లో పాసర్జ్‌ టెక్నాలజీస్‌ను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి తమ ఆలోచనను అమల్లోకి తేవటంపై దృష్టిపెట్టారు. దాదాపు రెండేళ్ల కృషి తరవాత వారిద్దరూ డాక్స్‌యాప్‌ను అభివృద్ధి చేయగలిగారు. 2015లో డాక్స్‌యాప్‌ను ఆరంభించారు. స్పెషలిస్ట్‌ వైద్యులు, పేషెంట్లను కలిపే యాప్‌ ఇది. చాట్‌ లేదా కాల్‌ ఆధారంగా ఎవరైనా సరే... దేశంలోని ఏ స్పెషలిస్టు వైద్యుడినైనా 30 నిమిషాల్లోపే సంప్రదించవచ్చు. కన్సల్టేషన్, మందుల డెలివరీ, ఇంటిదగ్గరే ల్యాబ్‌ టెస్టుల వంటి సేవలందిస్తున్న డాక్స్‌యాప్‌లో గైనిక్, సైక్రియాట్రీ, గ్యాస్ట్రో ఎంటరాలజీ, కార్డియాక్, ఆంకాలజీ, న్యూరో, ఇన్ఫెర్టిలిటీ, పీడియాట్రీ, డెర్మటాలజీ, జనరల్‌ మెడిసిన్, ఆర్థోపెడిక్‌ వంటి విభాగాల్లో 1500కు పైగా వైద్యులున్నారు. ఇప్పటికే సంస్థలో పలు ఇన్వెస్ట్‌మెంట్‌కంపెనీలు దాదాపు రూ.50 కోట్ల వరకూ పెట్టుబడి పెట్టాయి.
Published date : 17 Nov 2020 03:46PM

Photo Stories