Lavudya Devi: డాక్టర్ చదువుకు డబ్బుల్లేక.. కూలి పనులకు.. సీటొచ్చినా.. ఫీజు కట్టలేని అడవి బిడ్డ
నీట్‌లో 447 మార్కులు సాధించింది. ప్రైవేటు కాలేజీలో సీటు రావడంతో ఫీజులకు డబ్బుల్లేక.. ఎప్పట్లాగే తల్లిదండ్రులతో పాటు కూలి పనులకు వెళ్తోంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం భల్లునాయక్ తండాకు చెందిన లావుడ్య లక్ష్మి, రమేశ్ దంపతులకు ఇద్దరు కూతుళ్లు. దంపతులు కూలిపని చేస్తూ కూతుళ్లను చదివిస్తున్నారు. పెద్ద కూతురు బీ–ఫార్మసీ చేస్తోంది.
చిన్న కూతురు దేవిని కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డి గురుకులంలో చేర్పించి చదివించారు. పదో తరగతి, ఇంటర్మీడియెట్‌లో మంచి మార్కులు సాధించిన దేవి.. డాక్టర్ కావాలన్న లక్ష్యంతో ఏడాదిగా తల్లిదండ్రులతో పాటు కూలి పనులకు వెళ్తూనే నీట్‌కు సిద్ధమైంది. నీట్‌లో 447 (2లక్షల 80 వేల ర్యాంకు) మార్కులు సాధించడంతో తల్లిదండ్రులు సంతోషపడ్డారు.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీటు వస్తుందని అశించిన లావుడ్య దేవికి.. సిద్దిపేట సురభి మెడికల్ కాలేజీలో సీటు వచ్చింది. ప్రైవేటు మెడికల్ కాలేజీలో చదువుకు ఏటా రూ.3.5 లక్షల వరకు ఖర్చవుతుంది. అంత స్థోమత తల్లిదండ్రులకు లేకపోవడంతో.. చేసేదిలేక దేవి కూలి పనులకు వెళ్తోంది.
ఆస్తులు అమ్మి ఫీజు కడదామంటే అడవిలో పెంకుటిల్లు ఒకటే దిక్కు. దానిని కొనేవారు కూడా ఎవరూ లేరు. దాతలు ముందుకొచ్చి ఆర్థిక సహాయం చేస్తే తమ బిడ్డ ఆశయం నెరవేరుతుందని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.