Skip to main content

NEET 2024: నీట్‌ ఫలితాల్లో ఏపీ విద్యార్థుల విజయదుందుభి.. ఫలితాలను విడుదల చేసిన ఎన్టీఏ

 NEET 2024 Results Announcement  NEET 2024  Andhra Pradesh NEET 2024 Qualification Statistics NEET 2024 Results

సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్, బీడీఎస్, ఇతర యూజీ వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (నీట్‌) 2024 ఫలితాలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ) మంగళవారం విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 23,33,297 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 13,16,268 మంది అర్హత సాధించారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి 64,931 మంది పరీక్ష రాయగా 43,858 మంది అర్హులుగా నిలిచారు. 

అలాగే తెలంగాణలో 77,849 మందికి గాను 47,371 మంది అర్హత సాధించారు. జాతీయ స్థాయిలో 9.98 లక్షల మంది అబ్బాయిలు నీట్‌ రాయగా 5.47 లక్షల మంది, 13.34 లక్షల మంది అమ్మాయిలు పరీక్ష రాయగా 7.69 లక్షల మంది అర్హులుగా నిలిచారు. గత నెల 5న దేశవ్యాప్తంగా 571 నగరాలు, పట్టణాలతోపాటు విదేశాల్లో 14 నగరాల్లో నీట్‌ యూజీని నిర్వహించారు.

సత్తా చాటిన రాష్ట్ర విద్యార్థులు
నీట్‌ రాసిన విద్యార్థుల్లో 68 మంది విద్యార్థులు 99.99 పర్సంటైల్‌తో ఆల్‌ ఇండియా ఫస్ట్‌ ర్యాంకర్‌లుగా నిలిచారు. కాగా, మహారాష్ట్రకు చెందిన వి.సునీల్‌ షిండే, తమిళనాడుకు చెందిన సయ్యద్‌ ఆరి్ఫన్‌ యూసఫ్‌.ఎం, ఢిల్లీకి చెందిన ఎం.ఎం.ఆనంద్‌ మొదటి ర్యాంక్‌ సాధించిన వారిలో తొలి మూడు స్థానాల్లో నిలిచారు. 

NEET 2024: ‘నీట్‌’ పరీక్షలో ఆలిండియా టాపర్స్‌.. ఈసారి కటాఫ్‌ మార్కులు పెరగడంతో

 

ఆంధ్రప్రదేశ్‌ నుంచి కె. సందీప్‌ చౌదరి (21వ స్థాన), జి. భానుతేజ సాయి(29వ స్థానం), పోరెడ్డి ప్రవీణ్‌కుమార్‌ రెడ్డి(56వ స్థానం), వి. ముకేష్‌ చౌదరి(60వ స్థానం)లో నిలిచి ఆల్‌ ఇండియా ఫస్ట్‌ ర్యాంకర్‌లుగా ఉన్నారు. అదేవిధంగా రాష్ట్రంలోనూ వీరే టాప్‌ ర్యాంకర్‌లుగా ఉన్నారు.  

పెరిగిన కటాఫ్‌లు 
నీట్‌–2023తో పోలిస్తే ఈ ఏడాది అన్ని విభాగాల్లో కటాఫ్‌ మార్కులు భారీగా పెరిగాయి. అన్‌ రిజర్వుడ్‌ /ఈడబ్ల్యూఎస్‌ విభాగంలో గతేడాది 720–137 కటాఫ్‌ మార్కులు ఉండగా ఈ ఏడాది 720–164 మధ్య ఉన్నాయి. అదేవిధంగా ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ విభాగాల్లో 136–107 నుంచి 163–129కు కటాఫ్‌లు పెరిగాయి. పీహెచ్‌ యూఆర్‌/ఈడబ్ల్యూఎస్‌ విభాగంలో 136–121 నుంచి 163–146, పీహెచ్‌ ఓబీసీ, ఎస్సీ విభాగాల్లో 120–107 నుంచి 145–129కు, పీహెచ్‌ ఎస్టీలో 120–108 నుంచి 145–129కు కటాఫ్‌ మార్కులు ఎగబాకాయి. 

Published date : 05 Jun 2024 04:01PM

Photo Stories