Skip to main content

వర్సిటీలకు పూర్వ విద్యార్థులు గొప్ప వనరులు

సాక్షి, హైదరాబాద్‌: విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యాసంస్థలకు పూర్వ విద్యార్థులు గొప్ప వనరులని, వారి నైపుణ్యం, అనుభవం ఉపయోగించుకోవాలని గవర్నర్‌ తమిళి సై సౌందర రాజన్ అన్నారు.
రాష్ట్రస్థాయిలో పూర్వ విద్యార్థుల నెట్‌వర్క్‌ కోసం యూనివర్సిటీల చాన్సలర్‌ హోదాలో ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. నెట్‌వర్క్‌ రూపకల్పనపై నేషనల్‌ ఇన్ఫర్మేటిక్‌ సెంటర్‌ బుధవారం పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్ ఇచ్చింది. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ ప్రస్తుత విద్యార్థుల ఇంటర్న్ షిప్, ప్రాజెక్ట్‌ ఫండింగ్, ఈవెంట్స్‌ నిర్వహణ, స్టార్టప్‌ల నిధులకు పూర్వ విద్యార్థుల సహకారం తీసుకునేలా ప్రయత్నాలు సాగాలని సూచించారు. విద్యాసంస్థల్లో మౌలిక వసతుల కల్పన, ప్రయోగశాలల అభివృద్ధి, గ్రంథాలయాల బలోపేతం తదితర వాటికి ఈ నెట్‌వర్క్‌ ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో గవర్నర్‌ కార్యదర్శి సురేంద్ర మోహన్, జాయింట్‌ సెక్రటరీలు భవానీ శంకర్‌ పాల్గొన్నారు.

పౌర సేవల్లో ‘ఈ ఆఫీస్‌’లు కీలకం:
ఈ ఆఫీస్‌ విధానం ద్వారా పౌరసేవల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతుందని గవర్నర్‌ తమిళి సై అన్నారు. ‘ఈ ఆఫీస్‌’విధానంపై రాజ్‌భవన్ లో రాష్ట ఐటీ విభాగం ఇచ్చిన‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్ అనంతరం గవర్నర్‌ పలు సూచనలు చేశారు. కోవిడ్‌ సంక్షోభం డిజిటల్‌ సాంకేతికత వినియోగాన్ని పెంచిందన్నారు. పాలన, జీవితాన్ని సులభతరం చేసేలా డిజిటల్‌ సాంకేతికత ఉపయోగపడాలని సూచించారు. కోవిడ్‌ సంక్షోభ సమయంలో నూతన ఆవిష్కరణలతో ముందుకు రావాల్సిన అవసరం ఉందని గవర్నర్‌ అన్నారు. కాగా రోబోటిక్‌ శానిటైజర్‌ వాహనాన్ని రూపొందించిన హైదరాబాద్‌ సైన్స్ సొసైటీని గవర్నర్‌ అభినందించారు. వాహనం పనితీరును సొసైటీ ప్రతినిధులు త్రిపురనేని వరప్రసాద్, సంజార్‌ అలీ ఖాన్ గవర్నర్‌కు వివరించారు.
Published date : 27 Aug 2020 05:43PM

Photo Stories