Skip to main content

తల్లిదండ్రులకు పిల్లల్ని దగ్గిరచేసిన... అమ్మఒడి!

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘అమ్మఒడి’పథకం సత్ఫలితాల దిశగా సాగుతోంది.
చాలా చోట్ల తల్లిదండ్రులకు దూరంగా ఉన్న పిల్లలు ఈ పథకం ద్వారా తిరిగి వారి చెంతకు చేరుతున్నారు. పేదరికమో, మరో కారణం చేతనో కానీ చిన్నారులు విద్యకు దూరం కాకూడదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ పథకం మొదటి సంవత్సరంలోనే మంచి ఫలితాలను ఇస్తోంది. ప్రతి చిన్నారికీ తల్లిదండ్రుల ప్రేమ, అనురాగం లభించడం అనేది ఐక్యరాజ్య సమితి ద్వారా కల్పించిన బాలల హక్కుల్లో ముఖ్యమైనది. ప్రతి చిన్నారి కుటుంబ వ్యవస్థలో పెరిగి పెద్ద అవ్వడం కూడా వీరికి కల్పించిన హక్కు. అయితే దురదృష్టవశాత్తు కొంత మంది తల్లిదండ్రులు పేదరికం వల్ల పిల్లల పెంపకాన్ని భారంగా భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వారు పిల్లలను చైల్డ్ కేర్ సెంటర్‌లలో చేర్పిస్తున్నారు.

చైల్డ్ కేర్ సెంటర్‌ల నుంచి ఇంటికి...
ఏటా మే, జూన్‌లో చైల్డ్ వెల్‌ఫేర్ జిల్లా కమిటీల ద్వారా కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను చైల్డ్ కేర్ సెంటర్‌లలో చేర్పిస్తారు. అయితే అమ్మ ఒడి పథకం ద్వారా పిల్లలను స్కూళ్ళలో చదివించుకునేందుకు డబ్బు ఇస్తున్నారని తెలియడంతో కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను చైల్డ్‌కేర్ సెంటర్ల నుంచి తిరిగి తీసుకెళుతున్నారు. ఇలా ఇప్పటివరకు వందల మంది పిల్లలు ప్రభుత్వ స్కూళ్ళలో చేరారు. అటు పిల్లల తల్లులకు ప్రభుత్వం డబ్బులు ఇవ్వడం, ఇటు తిరిగి పిల్లలకు తల్లిదండ్రుల ప్రేమ, అనురాగం, అనుబంధం లభించింది.

తల్లిదండ్రుల చెంతకు 1,500 మంది పిల్లలు
కృష్ణా జిల్లా చైల్డ్ వెల్‌ఫేర్ కమిటీ వివరాల ప్రకారం ఎప్పుడూ లేని విధంగా 2019-20 ఏడాదికి గాను ఒక్క కృష్ణా జిల్లాలోనే 146 మంది పిల్లలను చైల్డ్‌కేర్ సెంటర్‌ల నుంచి తల్లిదండ్రులు ఇంటికి తీసుకెళ్లారు. వారి ఇళ్ళకు దగ్గరలో ఉన్న స్కూళ్ళలో పిల్లలను చేర్పించారు. ఇలా పరిశీలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1,500 మంది చిన్నారులు తల్లిదండ్రుల ప్రేమకు దగ్గరయ్యారు. బంధువులు, కుటుంబ సభ్యులకు చేరువయ్యారు. ఇందుకు అమ్మ ఒడి పథకం తోడ్పడింది. ప్రస్తుతం అమ్మఒడి పథకం డబ్బులు తల్లుల చేతికి వచ్చినందున రాబోయే విద్యా సంవత్సరంలో చైల్డ్ కేర్ ఇనిస్టిట్యూషన్‌లలో ఉన్న ఎక్కువ మంది పిల్లలు తల్లిదండ్రుల ఒడికి చేరే అవకాశం ఉంది. వంద మంది పిల్లల మధ్య చైల్డ్ కేర్ సంస్థలలో ఉండే పిల్లల కన్నా చిన్న కుటుంబంలో తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్లు, అన్నా తమ్ముళ్ళ మధ్య పెరిగే పిల్లల భవిష్యత్ ఉన్నతంగా ఉంటుందనడంలో సందేహం లేదు.
Published date : 20 Jan 2020 03:08PM

Photo Stories